చైనా బోర్డర్‌లో రక్షణ మంత్రి: డ్రాగన్ కంట్రీకి కీలక సంకేతాలు: మూడురోజులు అక్కడే
లేహ్: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఢక్‌లో పర్యటిస్తోన్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులతో సమావేశమౌతారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో లఢక్‌కు బయలుదేరిన ఆయన లేహ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్ మాతా కీ జై నినాదాల మధ్య ఆర్మీ అధికారులు ఆయనకు సాదరంగా ఆహ్వానించారు. లఢక్ లెప్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథుర్, ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
ఏడాదిన్నర కాలంగా లఢక్ సమీపంలోని భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే జూన్ 15, 16 తేదీల్లో సంభవించిన ప్రాణాంతక దాడుల్లో భారత జవాన్లు 20 మంది వీరమరణం పొందారు. అప్పటి ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇంకా సరిహద్దుల్లో కనిపిస్తోనే వస్తోంది. వాస్తవాధీన రేఖకు రెండు వైపులా జవాన్ల మోహరింపు కొనసాగుతోంది. సరిహద్దుల వల్ల ఉద్రిక్తతను నివారించడంలో భాగంగా భారత్-చైనా ఆర్మీ అధికారులు తరచూ సమావేశమౌతోన్నారు. కిందటి నెలలోనూ ఈ భేటీ కొనసాగింది.

చర్చల్లో కుదిరిన ఒప్పందాల మేరకు వాస్తవాధీన రేఖ వద్ద నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి రెండు దేశాలు ప్రాధాన్యతను ఇస్తోన్నాయి. ఈ పరిణామాల మధ్య రాజ్‌నాథ్ సింగ్.. అనూహ్యంగా లఢక్ పర్యటనకు బయలుదేరి రావడం, ఏకంగా మూడురోజుల పాటు ఇక్కడే బస చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన పర్యటనను పురస్కరించుకుని రాజ్‌నాథ్ సింగ్..బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌కు చెందిన కొన్ని మౌలిక నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.. ఇప్పటికే పూర్తయిన వాటిని ప్రారంభిస్తారు.

భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటైన వర్కింగ్ మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కో ఆర్డినేషన్ 22వ సమావేశానికీ ఆయన హాజరవుతారు. సరిహద్దుల నుంచి వెనక్కి తీసుకోవాల్సిన చర్యలపై రాజ్‌నాథ్ సింగ్ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సైన్యాన్ని ఉపసంహరించుకోవడం వల్ల ఉద్రిక్తతలను నివారించడంలో చొరవ తీసుకున్నట్టవుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆర్మీ వెటరన్ అధికారులతో సమావేశం కావడం మరో ఎత్తుగా మారింది. వారిలో చాలామందికి చైనా సరిహద్దుల్లో పనిచేసిన అనుభవం ఉంది.












Click it and Unblock the Notifications