70ఏళ్లు దాటినా.. ఎక్కడా తగ్గని పదును: కలరియపట్టులో ఆమె ఓ లెజెండ్..

Subscribe to Oneindia Telugu

వయసు 60లకు చేరువైందంటే.. చాలామంది దాన్ని విశ్రాంత జీవితంగానే భావిస్తారు. ఆ వయసులో జనాన్ని ఉద్దరించే పనులేవి పెట్టుకోకుండా ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటూ గడుపుతారు.

మనుమలు, మనుమరాళ్లతో సరదాగా గడపడం.. పుస్తకాలతో కాలక్షేపం చేయడం.. సంపాదించిందేమైనా ఉంటే పిల్లలకు ఎలా పంచి ఇవ్వాలని ఆలోచించడం.. వృద్యాప్యంలో ఇలా సాగిపోతుంది వారి జీవితం.

వయసు పైబడుతుంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఎలాగు వెంటాడుతాయి. ఏమి తోచక ఏదైనా చేద్దామని ప్రయత్నించినా.. వేళకు ఇంత తిని.. మెడిసిన్స్ వేసుకోక ఈ వయసులో ఎందుకీ పాట్లు అన్న విమర్శలు ఎదురవుతాయి. అలా 60ఏళ్లు పైబడ్డాక.. చాలామందికి ఇల్లే ప్రపంచమై పోతుంది.

కానీ కేరళకు చెందిన మీనాక్షి అమ్మకు ఇవేవి వర్తించవు. 76ఏళ్ల వయసులోను యువతీ, యువకులకు ఏమాత్రం తీసిపోని ఫిట్ నెస్ ఆమెది. ఇందుకు కారణం.. చిన్నతనం నుంచి ఆమె కలరియపట్టును ప్రాక్టీస్ చేస్తుండటమే.

ఏడేళ్ల వయసులో:

ఏడేళ్ల వయసులో:

మీనాక్షి అమ్మ ఏడేళ్ల వయసులో కలరియపట్టును నేర్చుకోవడం మొదలుపెట్టారు. నిజానికి మీనాక్షి అమ్మను మంచి నృత్యకారిణిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో.. ఆమె తల్లిదండ్రులు కలరియపట్టు నేర్పించారు. కలరియపట్టు ద్వారా శరీరం నృత్యానికి అనుకూలంగా మారుతుందనేది వారి భావన.

కానీ ఒక్కసారి కలరియపట్టులోకి దిగాక మీనాక్షి అమ్మ ఇక దాన్ని వదల్లేదు. ఆ కళతో పెరిగిన అనుబంధం.. అందులో రాణిస్తున్న తీరు.. ఇక దాన్ని విడిచిపెట్టేలా చేయలేదు. అలా 70ఏళ్లుగా ఆమె అదే కళకు అంకితమై బతుకుతున్నారు.

గురువుతోనే వివాహం:

గురువుతోనే వివాహం:

కడతానందన్ కలారి సంఘం పేరుతో రాఘవన్ అనే ఓ గురువు కోజికోడ్‌లో కలరియపట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తుండేవారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగానే ఆయన ఈ శిక్షణ ఇస్తుండేవారు.

మీనాక్షి గురించి తెలిసి ఆయన చాలా సంతోషించారు. మీనాక్షి అంకిత భావం, కలరియపట్టులో ఆమె ప్రదర్శించే మెలుకువలు నచ్చి ఆమెనే వివాహం చేసుకున్నారు. అయితే 2009లో ఆయన మరణించడంతో.. ఆ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీనాక్షి అమ్మపై పడింది. దాంతో ఆ గురుకులం బాధ్యతలను స్వీకరించి.. స్వయంగా కొన్ని వందల మంది శిష్యులను తీర్చిదిద్దారు.

ఇప్పటికీ శిక్షణలోనే:

ఇప్పటికీ శిక్షణలోనే:

వయసు పైబడుతున్నా.. విశ్రాంతి తీసుకోవాలన్న ఆలోచన మీనాక్షి అమ్మలో ఏ కోశాన ఉండదు. ఇప్పటికీ 150 నుంచి 200మంది వరకు ఆమె శిక్షణ ఇస్తూనే ఉన్నారు. విదేశీయులు సైతం ఆమె వద్ద తర్ఫీదు పొందుతున్నారంటే కలరియపట్టుకు ఆమె ఎంతటి పేరు తీసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు.

కలరియపట్టులో కర్ర, కత్తి, బల్లెం, ఇతరత్రా ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. ఈ యుద్దకళకు అనుబంధంగా ప్రత్యేక వైద్య విధానం కూడా ఉండటం విశేషం. ఏ స్వార్థం లేకుండా మీనాక్షి అమ్మ కొన్ని వందల మందికి ఈ శిక్షణ ఇస్తున్నారు. వారి వద్ద నుంచి ఆమె ఏమి ఆశించరు. ఎవరికి తోచినంత వారు ఆమెకు ఇవ్వవచ్చు.

వరించిన పద్మశ్రీ:

వరించిన పద్మశ్రీ:

ఒక ప్రాచీన కళను బ్రతికించేందుకు జీవితాన్నే అంకితం చేసిన మీనాక్షి అమ్మను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2016లో కేంద్రం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. తాను చేసేదాని గురించి ఏమాత్రం గొప్పలు పోని మీనాక్షి అమ్మ.. తనకు వచ్చిందే నలుగురికే నేర్పిస్తున్నానంటూ వినయంగా చెబుతారు. కలరియపట్టు శిక్షణలో తన ప్రాధాన్యం ఎప్పుడూ తొలుత మహిళలు, యువతులే అని చెబుతుంటారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At 76, she is possibly the oldest woman exponent of Kalaripayattu, the ancient martial arts from Kerala. She has been practising Kalaripayattu for no less than sixty-eight years - training and teaching.
Please Wait while comments are loading...