Delhi Assembly Election 2025: నేడు ప్రచారానికి తెర.. ఆప్ వర్సెస్ బీజేపీ.. గెలుపెవరిది?
Delhi Assembly Election 2025: కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు, యూపీ అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక ప్రచారం ఇవాళ సాయంత్రం 5గంటలకు ముగియనుంది. బీజేపీ, ఆప్ లు ఢిల్లీలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ప్రచారానికి చివరి రోజు కావడంతో.. బీజేపీ 22 రోడ్ షోలు ర్యాలీలు నిర్వహిస్తుండగా.. ఆప్ 9 రోడ్ షోలను నిర్వహిస్తోంది. ఢిల్లీలో ఎన్నికల్లో గెలిచి నాలుగో సారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుంటే.. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, కాంగ్రెస్ మొత్తం స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగింది. మిగిలిన రెండు స్థానాలను జేడీయూ, ఎల్జేపీలకు బీజేపీ కేటాయించింది.
వీటితో పాటు బీఎస్పీ, ఎన్సీపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ దాదాపు అన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో హోరాహోరీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్తీ, బీజేపీల మధ్య కనిపిస్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నించడం కూడా ఆ పార్టీకి కాస్త వ్యతిరేకతగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు టికెట్ లభించిన ఏడుగురు ఆప్ అభ్యర్థులు బీజేపీలో చేరడం ఆప్ ను ఇబ్బంది పెట్టే విషయమే. మరో వైపు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్టులు ప్రజల్లో సానుభూతిని పెంచాయని ఆప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఉచితాలపై విమర్శలు గుప్పించిన బీజేపీ కూడా అధికారం కోసం భారీగా ఉచిత హామీలను ఇచ్చేసింది. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ప్రధాని మోడీ మరోసారి స్లోగన్ జనాల్లోకి తీసుకెళ్లారు. ఢిల్లీలో ఉద్యోగులు అధికంగా ఉండడంతో బడ్జెట్ లో పన్ను మినహాయింపు లాభం చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది. మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత తమకు లాభం చేకూరుస్తుందని అంచనాలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ఈ సారైనా ఖాతా తెరుస్తుందా లేదా అనేది సందేహంగా మారింది. కాంగ్రెస్ సీట్లు గెలవకున్నా ఓట్లను చీల్చే అవకాశం ఉంది. మజ్లిస్ పార్టీ కూడా రెండు స్థానాల్లో విజయం సాధించకపోయినా ముస్లిం ఓట్లను చీల్చనుంది. ఈ సారి ఢిల్లీ ఎన్నికల్లో తాగునీటి సమస్య ముఖ్య అంశంగా మారింది. ఆప్ సర్కారు ఉచిత నీరు అందిస్తున్నా ఆ నీళ్లు సరిపోవడం లేదు. మురుగు నీటి సమస్య కూడా ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీలో రోడ్లు కూడా అంతంత మాత్రంగా మారాయి. నిరుద్యోగ సమస్య కూడా వెంటాడుతోంది. ఇన్నిసవాళ్ల మధ్య ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందో చెప్పడం కష్టమే.
చివరిరోజున హోరా హోరీ ప్రచారం
ఢిల్లీలో ప్రచారం చివరి రోజున భారీగా రోడ్ షోలు, ర్యాలీలు ఉన్నాయి. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ తో పాటు పలువురు నాయకులు ప్రచారం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తొమ్మిది ర్యాలీలు,రోడ్ షోలను నిర్వహించనుంది. అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌లతో పాటు,పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హర్భజన్ సింగ్ కూడా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓట్లు అభ్యర్థించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ సమావేశం మధ్యాహ్నం ఛతర్‌పూర్‌లో జరుగుతుంది. కల్కాజీలో అతిషికి మద్దతుగా రోడ్ షో ఉంటుంది. మనీష్ సిసోడియా బైక్ ర్యాలీ జంగ్పురాలో జరుగుతుంది. సంజయ్ సింగ్ మూడు ఎన్నికల సమావేశాలను కూడా నిర్వహిస్తారు. భగవంత్ మాన్ ఈరోజు ఢిల్లీలో నాలుగు సమావేశాలు నిర్వహించనున్నారు. టీఎంసి నాయకుడు శత్రుఘ్న సిన్హా కూడా కిరాడిలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు.
బురారిలోని ముకుంద్‌పూర్ చౌక్‌లో జరిగే ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జంగ్‌పురా, బిజ్వాసన్, ద్వారకలలో బహిరంగ సభలలో ప్రసంగించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఛతర్‌పూర్, మోతీ నగర్‌లలో రోడ్ షో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ కోట్ల ముబారక్‌పూర్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications