జమిలికి క్లియర్ రూట్ మ్యాప్: ఆ ముహూర్తంలోనే..!!
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా విజయఢంకా మోగిస్తోన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిచింది. హస్తినాపురిలో తన ప్రాభవాన్ని, అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ బోణీ కొట్టే పరిస్థితీ కనిపించట్లేదు.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. దీన్ని అందుకుంది బీజేపీ. 27 సంవత్సరాల తరువాత తొలిసారిగా హస్తినలో కమ్ బ్యాక్ ఇచ్చింది. గ్రాండ్‌గా ఎంట్రీ అయింది. ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి కావాల్సిన మెజారిటీని అందుకుంది.

ఇప్పటివరకు ఓడిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- న్యూఢిల్లీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా- జంగ్‌పురా, ధరంపాల్ చందేరా- రాజౌరీ గార్డెన్, సోమ్‌నాథ్ భారతి- మాలవీయ నగర్, ప్రవీణ్ జైన్- షాలిమార్ బాగ్, దినేష్ మొహానియా - సంగం విహార్ ఉన్నారు.
ముఖ్యమంత్రి ఆతిషీ- చివరి రౌండ్‌లో గట్టెక్కారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరీపై విజయఢంకా మోగించారు. ఈ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీని నిరాశ నిస్పృహల్లోకి నెట్టాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం బోసిపోయాయి. కంచుకోటలు సైతం కుప్పకూలిపోవడం పట్ల దిగ్భ్రాంతికి గురైందా పార్టీ. స్వయానా కేజ్రీవాలే మట్టికరవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
బీజేపీ అందుకున్న ఈ ఘనవిజయం.. దేశ రాజకీయాలను సైతం మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా అడుగు ముందుకు వేయడానికి అవసరమైన బలాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చినట్టయింది. 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో జమిలి ఎన్నికలు రావొచ్చనడానికి ఊతమిచ్చింది.
ప్రస్తుతం జమిలి ఎన్నికల బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. 27 మందితో లోక్‌సభ, 12 మందితో రాజ్యసభ జేపీసీ ఏర్పాటైంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి మధ్యంతర ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది.
జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సూచనలు, సలహాలను అందజేస్తుంది. దానికి అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. ఇది అమలులోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోలేదు.
దేశంలో జమిలి ఎన్నికలు కొత్తేమీ కాదు. 1951 నుండి 1967 వరకు లోక్‌సభ, అన్ని రాష్ట్రా శాసనసభలకు ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 1951- 52లో తొలిసారిగా లోక్‌సభ, శాసనసభలకు మొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు. 1957, 1962, 1967 నాటి ఎన్నికల వరకూ అదే సంప్రదాయం కొనసాగింది.
కొన్ని రాష్ట్రాల శాసనసభలు మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి రావడం వల్ల 1968- 69 మధ్యకాలంలో జమిలికి తొలిసారిగా బ్రేక్ పడింది. 1970 నాటి లోక్‌సభ కూడా ముందస్తుగా రద్దయింది. ఆ తరువాత 1971లో లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి జమిలి మళ్లీ పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్లీ కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications