బరాబర్ ఫైట్- అనుక్షణం అనూహ్య మలుపు- కీలక నేతలు వీళ్లే..
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతోన్నాయి. ప్రారంభ ఫలితాల్లో బీజేపీ దూకుడు కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి.
ఈ దఫా ఈ పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. 35 నుంచి 45 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేస్తుందని, ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి. ఇవి వాస్తవరూపాన్ని దాల్చేలా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి ఆతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక అభ్యర్థులు వెనుకంజలో నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020 తరహాలో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవనే సంకేతాలను ఇచ్చినట్టయింది.
వెనుకంజలో ఉన్న కీలక అభ్యర్థుల్లో.. అరవింద్ కేజ్రీవాల్- న్యూఢిల్లీ, అతిషి- కల్కాజీ, మనీష్ సిసోడియా- జంగ్‌పురా, దుర్గేష్ పాఠక్- రాజీందర్ నగర్, మంత్రి గోపాల్ రాయ్- బాబర్‌పూర్, మనోజ్ త్యాగి- కరావల్ నగర్, అనిల్ ఝా- కిరారీ, దినేష్ మొహానియా - సంగం విహార్, వినయ్ మిశ్రా- ద్వారకా.. వంటి ఆప్ అభ్యర్థలు ఉన్నారు.












Click it and Unblock the Notifications