దిల్లీ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం..
దిల్లీ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తును NIA వేగవంతం చేసింది. తాజాగా ఈ ఆత్మాహుతి దాడి కుట్రకు పన్నాగం పన్నిన వ్యక్తిని అధికారులు దిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు అమీర్ రషీద్ అలీ అని తెలుస్తోంది. బాంబు పేలుడుకు ఉపయోగించిన I-20 కారు అతని పేరు మీదనే రిజిస్టర్ అయి ఉంది. ఇక అరెస్టయిన అమీర్ రషీద్ జమ్మూ కాశ్మీర్ లోని పాంపోర్ కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన డాక్టర్. ఉమర్ ఉన్ నబీకి.. అమీర్ కు మంచి సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇద్దరూ కలిసే ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు అధికారులు తేల్చారు.
మరోవైపు ఉమర్ కు చెందిన మరో వాహనాన్ని కూడా అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దాడికి ముందు వరకు ఉమర్ హరియాణాలోని నూహ్ ప్రాంతంలో కొన్ని రోజులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నవంబర్ 10వ తేదీన రాత్రి అతడు దిల్లీకి వచ్చినట్లు తేల్చారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్. ప్రియాంక శర్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్టయిన అదీల్ అహ్మద్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేశారు.

అలాగే దాదాపు 200మంది కశ్మీర్ వైద్యులపైనా.. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లోని కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకున్న కశ్మీర్ విద్యార్థులపైనా నిఘా పెట్టారు అధికారులు. ఇక దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక చాలా మంది గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక పేలుడుకు కారణమైన ఐ20 కారు నడిపిన వ్యక్తి డాక్టర్ అమర్ గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అతడితో సంబంధం ఉన్న మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు ఎన్ఐఏ అధికారులు.












Click it and Unblock the Notifications