
ఢిల్లీలో స్కూల్స్ ఇప్పట్లో తెరవలేం.. కరోనా థర్డ్ వేవ్ ఆందోళనలో ఉన్నామన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలను ఈ సమయంలో తిరిగి ప్రారంభించలేమని స్పష్టం చేశారు. కరోనా థర్డ్ వేవ్ కు సమయం ఆసన్నమైందని ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు చూపిస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఇస్తున్న కోవిడ్ -19 టీకా ప్రక్రియ పూర్తయ్యే వరకు మేము ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటున్నాము అని సిఎం కేజ్రీవాల్ తేల్చిచెప్పారు.
ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్నట్లుగా పాఠశాలల్లో ఆఫ్‌లైన్ తరగతులను తిరిగి ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా అనే ప్రశ్నకు సిఎం కేజ్రీవాల్ స్పందించారు. గ్లోబల్ సాక్ష్యాలు మరియు మహమ్మారి చరిత్ర పరిణామ క్రమాన్ని బట్టి మూడవ తరంగం అనివార్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడవ వేవ్ ఆసన్నమైందని ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం హెచ్చరికలు జారీ చేసిన వేళ అరవింద్ కేజ్రీవాల్ పాఠశాలలు తెరవద్దు నిర్ణయం తీసుకున్నారు.

మాస్కులు లేకుండా పర్యాటక ప్రాంతాలలో పర్యాటకుల ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తడంతో, కరోనా సూపర్-స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉందని, కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతూనే ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కోవిడ్ -19 నిబంధనలపై రాజీ పడవద్దని ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఐఎంఎ హెచ్చరికను ప్రతిధ్వనించారు. ఇక కరోనా థర్డ్ వేవ్ భయాందోళన మధ్య స్కూల్స్ పునః ప్రారంభించలేమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి నేపధ్యంలో స్కూల్స్ మూతపడ్డాయి. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 72 కరోనావైరస్ కేసులు మరియు ఒక మరణం నమోదయ్యాయి, నగరంలో ఆరోగ్య శాఖ పంచుకున్న గణాంకాల ప్రకారం పాజిటివిటీ రేటు 0.10% గా ఉంది. తాజా బులెటిన్ ప్రకారం, ఇప్పటివరకు మొత్తంగా ఢిల్లీలో మరణించిన వారి సంఖ్య 25,022 కు పెరిగింది.