డెంటిస్ట్ ప్రాణం తీసిన క్రికెట్ బంతి గొడవ
న్యూఢిల్లీ: క్రికెట్ బంతి తగలడంతో మొదలైన గొడవ.. ఓ డెంటిస్ట్ ప్రాణాలు బలితీసుకుంది. ఈ దారుణ ఘటన పశ్చిమ దిల్లీలోని వికాస్‌పురీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డెంటిస్ట్ పంకజ్ నారంగ్(40) కొడుకు ఇంటి బయట క్రికెట్ ఆడుతుండగా ఆ బంతి ప్రమాదవశాత్తూ అటుగా వెళ్లేవారికి తగిలింది. దీంతో వారు వాగ్వాదానికి దిగారు. కొడుకును రక్షించేందుకు నారంగ్ ఇంటి నుంచి బయటకు వచ్చి కొడుకుని తీసుకుని వెళ్లిపోయారు

కాగా, గురువారం అర్ధరాత్రి సమయంలో సుమారు 15 మంది వచ్చి సదరు డెంటిస్ట్‌ని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆయన తలకు బలమైన దెబ్బలు తగలడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 మందిలో తొమ్మిది మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. వారిలో నలుగురు బాలనేరస్థులు ఉన్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పశ్చిమ డీసీపీ పుష్పేంద్ర కుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications