ఒకరు ప్రచారక్.. మరొకరు ధర్నేబాజ్: మోడీ, కేజ్రివాల్‌పై సోనియా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కపట రాజకీయాలు, బూటకపు హామీల నుంచి ఢిల్లీని కాపాడాలని ఓటర్లకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివారం స్వయంగా ప్రచారరంగంలోకి దిగారు సోనియాగాంధీ. మొదటి సభలోనే మోడీ, కేజ్రీవాల్‌పై పదునైన మాటలతో విమర్శల వర్షం కురిపించారు.
మీతాపూర్‌లో ఆదివారం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వ్యక్తిగత ప్రచారంతో తీరికలేకుండా ఉంటే, అరవింద్ కేజ్రీవాల్ ధర్నాలతో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఒక పార్టీకి కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే చేసే ప్రచారక్ (మోడీ) ఉన్నారు. మరో పార్టీకి ధర్నాలతో బిజీగా ఉండే వ్యక్తి (కేజ్రీవాల్) ఉన్నారని ఎద్దేవా చేశారు.

‘ఢిల్లీకి కావాల్సింది సుపరిపాలనే కానీ.. తప్పుడు వాగ్దానాలు కాదు. బిజెపి, ఆప్ పెద్దపెద్ద మాటలు, బూటకపు హామీలిస్తున్నాయి. నినాదాలతో దేశం ముందుకు నడువదు' అని సోనియా పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఆహార భద్రత, భూసేకరణ చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం బలహీనపర్చి ప్రజల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నది. అవినీతిని నిర్మూలిస్తామని లోక్‌సభ ఎన్నికల సమయంలో బంగారు హామీలిచ్చి ఇప్పటివరకూ ఒక్కహామీని కూడా నెరవేర్చలేకపోయింది.
‘అవినీతి నిర్మూలనకు మేం ఆర్టీఐ చట్టాన్ని తెస్తే, సీఐసీ కమిషనర్‌ను నియమించకుండా మోడీ ప్రభుత్వం అవినీతికి ఆస్కారం ఇస్తోంది. విదేశాల్లోని భారతీయుల నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరికి రూ.15 లక్షలిస్తామన్న హామీ ఏమైంది. అచ్చే దిన్ (మంచిరోజులు) పేరుతో కురిపించిన బూటకపు హామీల వాస్తవం ఇది' అని సోనియా పేర్కొన్నారు. విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న ఆ శక్తులను ఓడించండి.












Click it and Unblock the Notifications