రేప్: కదులుతున్న రైలు నుంచి యువతిని తోసేశారు

ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను సాగర్ జిల్లాలోని బీనా రైల్వే స్టేషన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. ఆమెను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ముఖానికి, ఇతర శరీరభాగాలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.
కాగా, బాధిత మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేసిన ఇద్దరు దుండగులు ఆమెను రైలు నుంచి తోసేశారని ఆమె బంధువులు తెలిపారు. ఆమెకు సంబంధించిన బంగారు ఆభరణాలు, లగేజీ కూడా మిస్సయ్యిందని చెప్పారు.
ఘటనపై బీనా రైల్వే పోలీస్ ఏఎస్ఐ ఏబి శర్మ మాట్లాడుతూ.. బాధితురాలు ఎస్-7 బోగీలో ఉజ్జయినీ వైపుగా మహాకాళ్ ఆలయాన్ని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. కాన్పూర్‌కు చెందిన బాధితురాలు ఢిల్లీలో విధులు నిర్వహిస్తోందని చెప్పారు.
అప్పటికే ఉజ్జయినీకి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం ఎదురుచూస్తున్నారని ఆ అధికారి తెలిపారు. అత్యాచారారయత్నం జరిగిందనేదానిపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఏఎస్ఐ తెలిపారు. రూమర్స్ నమ్మలేమని చెప్పారు.
అపస్మారక స్థితిలో ఆమె లభించిందని ఆయన తెలిపారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాతనే అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. సాగర్ జిల్లా ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించినట్లు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం భోపాల్‌లోని హమేడియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications