భార్య సంపాదనపై భర్తలకు హైకోర్టు షాక్!
భర్త నుంచి మధ్యంతర భరణం కోరే సమయంలో భార్యకు సంపాదన ఉందని లేదా తనను తాను పోషించుకోగలదని కేవలం ఊహల ఆధారంగా నిర్ధారించలేమని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య ఉద్యోగం చేస్తోందని భర్త ఆరోపిస్తే దానికి తగిన డాక్యుమెంటరీ ఆధారాలు చూపడం తప్పనిసరి అని కోర్టు పేర్కొంది.
కేసు నేపథ్యం ఏమిటి?
2021లో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న ఓ మహిళ అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని 2022లో ఇంటి నుంచి గెంటివేశారని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. గతంలో ఫ్యామిలీ కోర్టు అమెకు నెలకు రూ.2,500 మధ్యంతర భరణం మంజూరు చేసింది. తన భర్త ప్రైవేట్ టీచర్‌గా, కిరాణా షాపు యజమానిగా నెలకు దాదాపు రూ.70,000 వరకు సంపాదిస్తున్నారని, తనకు ఇచ్చే రూ.2,500 ఏమాత్రం సరిపోవడం ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు పరిశీలన, భర్త ఆరోపణలు
జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ కేసును విచారించారు. విచారణలో భర్త కొన్ని కీలక వాదనలు చేశారు. తన భార్య నర్సరీ టీచర్‌గా పనిచేస్తోందని, ఆమెకు సంపాదన ఉందని భర్త వాదించాడు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించలేదు. తన ఆదాయం కేవలం రూ. 10,000 మాత్రమేనని చెప్పుకొచ్చాడు. భార్య కేవలం 11వ తరగతి వరకు మాత్రమే చదువుకుందని, ఆమె ఉద్యోగం చేస్తోందని భర్త చేసిన కేవలం ఆరోపణలు, ఆధారాలు లేకుండా చెల్లవని కోర్టు తేల్చి చెప్పింది. భర్త గ్రాడ్యుయేట్ అయినప్పటికీ, తన ఆదాయం రూ.10,000 అని చెప్పడం నమ్మశక్యంగా లేదని, ఇది కనీస వేతనాల కంటే తక్కువని కోర్టు అభిప్రాయపడింది.
తీర్పు, భరణం పెంపు
ఉత్తరప్రదేశ్ కనీస వేతనాల చట్టం ప్రకారం, ఒక గ్రాడ్యుయేట్/నైపుణ్యం కలిగిన వ్యక్తి కనీస వేతనం నెలకు సుమారు రూ. 13,200 గా ఉంటుందని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. భార్యకు స్వతంత్ర ఆదాయ వనరులు లేనందున గతంలో ఇచ్చిన రూ. 2,500 చాలా తక్కువని కోర్టు భావించింది. మధ్యంతర భరణాన్ని రూ.3,500కి పెంచుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బకాయి ఉన్న భరణం మొత్తాన్ని మూడు నెలల లోపు చెల్లించాలని భర్తను ఆదేశించింది.












Click it and Unblock the Notifications