అది భూషణ్ వ్యక్తిగత అభిప్రాయం: కేజ్రివాల్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ గానీ, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఢిల్లీ రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలించినట్లయితే..
మంగళవారం మధ్యాహ్నం 2.45: టైమ్స్ నౌ కథనం ప్రకారం.. ఢిల్లీలో ఏ పార్టీకి తగిన మెజార్టీ రాకపోవడంతో తాము మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని బిజెపి పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

12.50: తమ పార్టీకి చెందిన నాయకుడు ప్రశాంత్ భూషణ్ సోమవారం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రివాల్ అన్నారు. కాంగ్రెస్, బిజెపి రెండూ అవినీతి పార్టీలేనని, బిజెపి.. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు కదా? అని కేజ్రివాల్ మంగళవారం ప్రశ్నించారు.
జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదిస్తామని బిజెపి లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే తమ పార్టీ మద్దతిచ్చే విషయంలో ఆలోచించవచ్చని ప్రశాంత్ భూషణ్ సోమవారం తెలిపారు. అయితే ప్రశాంత్ భూషణ్ కూడా తన వ్యాఖ్యలకు మంగళవారం మరోసారి వివరణ ఇచ్చారు. తాను ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భం వేరని, తమ పార్టీ లాగా బిజెపి పనిచేస్తే అప్పుడు తాము ఆలోచిస్తామన్నామని, కానీ ఇతర పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీలాగా ఎన్నటికీ మారలేవని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.
10.17: తమ ప్రభుత్వం పారదర్శక పాలనను అందిస్తుందనే నమ్మకం తమకుందని బిజెపి ఎమ్మెల్యే హర్షవర్ధన్ అన్నారు. అవినీతిని అంతమొందించేందుకు బిజెపి ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. ఎన్నికల ముందే హర్షవర్ధన్‌ను తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దించామని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ సోమవారం అన్నారు.












Click it and Unblock the Notifications