యూపీ బీజేపీ ఎంపీపై ఎఫ్ఐఆర్: సుప్రీంకోర్టు ఆదేశిస్తే గానీ ముందుకు రాని పోలీసులు..!!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల కేసు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఆయనపై చర్యలు తీసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా లేనప్పటికీ- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయడానికి ఢిల్లీ పోలీసులు అంగీకారం తెలిపారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా వ్యవహరిస్తోన్న బ్రిజ్ భూషణ్‌పై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా బీజేపీ అధినాయకత్వం ముందుకు రావట్లేదు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభకు ప్రాతినిథ్యాన్నివహిస్తోన్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. వరుసగా మూడుసార్లు ఆయన ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనను రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నామినేట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు బ్రిజ్ భూషణ్‌పై వెల్లువెత్తాయి.

ఆయనపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకుంటామంటూ ఇదివరకు కేంద్ర ప్రభుత్వం వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపడానికి జనవరిలో మేరీకోమ్ సారథ్యంలో అయిదుమంది సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. నాలుగు వారాల్లోగా నివేదికను అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి కాలేదు.
రోజులు గడుస్తున్నప్పటికీ- కేంద్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చకపోవడంతో మరోసారి నిరసన దీక్షలకు దిగారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీత ఫొగట్, సత్యవ్రత్ కడియన్, సోమ్‌వీర్ రాఠీ, జితేందర్ కిన్హా తమ నిరసనలను కొనసాగిస్తోన్నారు. ఇటీవలే ఈ ఏడుమంది రెజ్లర్లు కూడా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. తాము ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని తెలిపారు. వారిపై రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను సైతం జారీ చేసింది.
దీనిపై ఢిల్లీ పోలీసులు తాజాగా స్పందించారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎఫ్ఐఆర్ కాపీని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. ఈ సాయంత్రంలోగా ఎఫ్ఐఆర్ నమోదవుతుందని, పోలీసులపై ఎలాంటి రాజకీయపరమైన ఒత్తిళ్లు లేవంటూ ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications