మేనిఫెస్టో పార్ట్-3: నోరు తెరిస్తే అబద్ధాలే..
Arvind Kejriwal: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి ప్రతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సమాయాత్తం అయ్యాయి. హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. అదే నెల 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ నెల 10వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల పర్వం సైతం ముగిసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇదివరకే తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఈ ఎన్నికల బరిలో దిగారు. కల్కాజీ నుంచి ఆతిషి పోటీలో ఉన్నారు. అల్కా లంబా, పూజా బల్యాన్, రేఖా గుప్తా, పూనం శర్మ.. వంటి వివిధ పార్టీల మహిళ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.
ఈ ఎన్నికల కోసం బీజేపీ మూడో విడత మేనిఫెస్టోను ఆవిష్కరించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీన్ని విడుదల చేశారు. ఢిల్లీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సహా పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఇది పార్ట్- 3 మేనిఫెస్టో.
దీన్ని విడుదల చేసిన అనంతరం అమిత్ షా మాట్లారు. మాజీ ముఖ్యమంత్ర అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరుగా మారిపోయారని, మాట్లాడే ప్రతి మాటా అబద్ధమేనంటూ ధ్వజమెత్తారు. దశాబ్దకాలం పాటు అబద్ధాలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తోన్నారంటూ మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరకొచ్చే సమయానికి అమాయకపు మొహంతో జనం ముందుకొస్తారని చురకలు అంటించారు.
తాము మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని అమలు చేస్తామని అమిత్ షా చెప్పుకొచ్చారు. మహిళలు, యువత, ఉద్యోగులు, అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు, మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులు, పెన్షనర్లు, చిరు వ్యాపారులు.. ఇలా ప్రతి వర్గానికి మేలు చేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications