ఢిల్లీలో స్కూళ్లకు సెలవుల పొడిగింపు-దీపావళి తర్వాత సరిబేసి విధానం...
జాతీయ రాజధాని ఢిల్లీలో అంతకంతకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యం ప్రభుత్వాలతో పాటు ప్రజల్నీ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్య స్ధాయిలతో ప్రభుత్వాలు వరుస చర్యలు ప్రకటిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో చేసేది లేక స్కూళ్లకు సెలవుల్ని ఈ వారాంతం వరకూ పొడిగించారు. అలాగే రోడ్లపైకి వచ్చే వాహనాలకు సరి-బేసి విధానాన్ని దీపావళి తర్వాత అమలు చేయాలని నిర్ణయించారు.
నవంబర్ 10 వరకు 10, 12 తరగతులు మినహా దేశ రాజధాని అంతటా అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం గాలి నాణ్యత క్షీణిస్తున్న దృష్ట్యా 5వ తరగతి వరకు మాత్రమే తరగతులు నిలిపివేశారు. దీన్ని మిగతా తరగతులకూ వర్తింపచేస్తున్నారు. ఢిల్లీలో దాదాపు వారం రోజులుగా విషపూరితమైన పొగమంచు కప్పబడి ఉంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-4 కింద డీజిల్ ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేయాలని, నగరంలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జాతీయ రాజధానిలో స్మోగ్ గన్ల ఏర్పాటుతో పాటు బాణాసంచా నిషేధం, బీఎస్ 3, బీఎస్ 4 వాహనాలపై నిషేధం కూడా కొనసాగుతుందని ఢిల్లీ రవాణామంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఢిల్లీలో నవంబర్ 12న దీపావళి ముగిశాక 13 నుంచి వారం రోజుల పాటు వాహనాల సరి-బేసి విధానం అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నిబంధన ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లో చివరి సంఖ్య సరిసంఖ్య అయితే సరిసంఖ్య ఉన్న తేదీల్లో, అలాగే బేసి సంఖ్య ఉంటే బేసి సంఖ్య ఉన్న తేదీల్లో రోడ్లపైకి అనుమతిస్తారు. నవంబర్ 20 తర్వాత దీన్ని తిరిగి సమీక్షిస్తారు.
ఢిల్లీలో ఇవాళ గాలి నాణ్యత సూచీ 488గా నమోదైంది. ఇది చాలా సమయాల్లో 500 కూడా దాటిపోతోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్ణయించిన పరిమితి కంటే చాలా ఎక్కువ. రోజుకు 25-30 సిగరెట్లు కాల్చడం అంత ప్రమాదకరం అని నిపుణులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడుతోంది.












Click it and Unblock the Notifications