వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్లీ: నోయిడా ట్విన్ టవర్స్‌‌ కూల్చివేత పూర్తి కథ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

దిల్లీ సమీపంలోని నోయిడాలో.. సూపర్‌టెక్ నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు భారీ ఆకాశహర్మ్యాలను ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు కూల్చివేశారు.

'అపెక్స్', 'సియానే' అనే పేర్లున్న ఈ ట్విన్ టవర్స్‌ను పడగొట్టేందుకు 3700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించారు.

రెండు భారీ భవనాలూ కేవలం 9 సెకన్లలో కూలిపోయాయి.

ఈ జంట భవనాల్లో అపెక్స్ టవర్‌లో 32 అంతస్తులు, సియానే టవర్‌లో 29 అంతస్తులు ఉన్నాయి. ఇవి రాజధాని దిల్లీ నగరంలోని కుతుబ్ మీనార్ కన్నా పొడవైన భవనాలు.

మొత్తం 100 మీటర్ల ఎత్తయిన ఈ భవనాలను కూల్చివేయాలని.. 9 ఏళ్ల పాటు సాగిన కోర్టు కేసు అనంతరం న్యాయస్థానం ఆదేశించింది.

ఆదివారం మధ్యాహ్నం ఒక మీట నొక్కిన 9 సెకన్లలో రెండు భవనాలూ శిథిలాల కుప్పగా మారాయి. ఇవి కూలేటపుడు భారీ స్థాయి ధూళి మేఘం రేగింది. చుట్టుపక్కల పరిసరాలన్నిటినీ ఆ ధూళి మేఘం కమ్మేసింది.

అయితే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ శాఖ.. ట్విన్ టవర్స్ కూల్చివేత స్థలం వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించటానికి ఆరు ప్రత్యేక డస్ట్ మెషీన్లను ఏర్పాటు చేసింది.

''కూల్చివేతకు ముందు, కూల్చివేత సమయంలో, కూల్చివేత తర్వాత కూడా కాలుష్య స్థాయిని పరిశీలిస్తాం. గాలిలో పీఎం 10, పీఎం 2.5 రేణువుల మోతాదును ఈ మెషీన్ల ద్వారా తనిఖీ చేస్తాం. ఆ నివేదిక 24 గంటల్లో వస్తుంది'' అని ఒక మెషీన్ టెక్నీషియన్ ఉమేష్ తెలిపారు.

కూల్చివేత కథ మొదలైందిలా...

న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (NOIDA) ఒక హౌసింగ్ సొసైటీని అభివృ‌ద్ధి చేయటానికి 2004లో సూపర్‌టెక్ లిమిటెడ్ అనే సంస్థకు ఒక ప్లాటును కేటాయించింది. ఆ హౌసింగ్ సొసైటీకి 'ఎమరాల్డ్ కోర్ట్‌' అని పేరు పెట్టారు.

ఈ సొసైటీలో ఒక్కోటి 10 అంతస్తులతో 14 టవర్ల నిర్మాణ ను నిర్మించే ప్రణాళికకు 2005లో నోయిడా బిల్డింగ్ రెగ్యులేషన్స్ అండ్ డైరెక్షన్స్ 1986 కింద అనుమతి ఇచ్చారు.

సూపర్‌టెక్ సంస్థకు.. ఒక్కోటి 10 అంతస్తులతో కూడిన 14 టవర్లను నిర్మించటానికి అనుమతి లభించింది. ఒక్కో టవర్ ఎత్తు గరిష్టంగా 37 మీటర్లు ఉండవచ్చునని పరిమితి విధించారు.

వాస్తవ నిర్మాణ ప్రణాళిక ప్రకారం.. ఒక్కోటి 10 అంతస్తులతో కూడిన 14 టవర్లు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, గార్డెన్ ఏరియా నిర్మించాలి.

అయితే 2006 జూన్‌లో ఈ కంపెనీకి అదనపు భూమిని కేటాయించారు. దీంతో నిర్మాణ ప్రణాళికలో మార్పులు చేశారు. గార్డెన్ ప్రాంతాన్ని తొలగించి అదనంగా మరో రెండు టవర్లను నిర్మించేలా ప్రణాళికను మార్చారు.

2009 నాటికి రూపొందిచిన తుది ప్రణాళిక ప్రకారం.. ఒక్కోటి 40 అంతస్తులతో కూడిన 'అపెక్స్', 'సియేన్' అనే రెండు టవర్లను నిర్మించాలని తలపెట్టారు. అయితే అప్పటికి ఈ తుది ప్రణాళికకు నోయిడా అథారిటీ నుంచి అనుమతులు ఇంకా రాలేదు.

నోయిడా ట్విన్ టవర్స్

కోర్టుకు వెళ్లిన ఇళ్ల యజమానులు...

2011లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. యూపీ అపార్ట్‌మెంట్ ఓనర్స్ యాక్ట్ 2010ని ఉల్లంఘించి ఈ రెండు టవర్లను కట్టారని ఆరోపించింది.

ఈ రెండు టవర్ల మధ్య 16 మీటర్ల కన్నా తక్కువ దూరం ఉందని.. అది చట్టాన్ని అతిక్రమించటమేనని ఇళ్ల యజమానులు వాదించారు.

వాస్తవ ప్రణాళికలో గార్డెన్ కోసం కేటాయించిన స్థలాన్ని ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం కోసం ఉపయోగించారని ఆరోపించారు.

సూపర్‌టెక్ సంస్థ 2009లో ప్రతిపాదించిన నిర్మాణ ప్రణాళికకు నోయిడా అథారిటీ 2012లో.. ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టులో విచారణ ప్రారంభం కావటానికి ముందు.. ఆమోదం తెలిపింది.

నోయిడా ట్విన్ టవర్స్

ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలన్న హైకోర్టు...

కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు 2014 ఏప్రిల్‌లో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ జంట భవనాలను కూల్చివేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చింది.

సూపర్‌టెక్ సంస్థ తన సొంత ఖర్చుతో ఈ జంట భవనాలను కూల్చివేయాలని కోర్టు నిర్దేశించింది. వాటిలో ఇళ్లు కొన్న వారికి.. వారి డబ్బును 14 శాతం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ నోయిడా అథారిటీ, సూపర్‌టెక్ సంస్థలు 2014 మే నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని చెప్పాయి.

నోయిడా ట్విన్ టవర్స్

కూల్చివేత తేదీని ఖరారు చేసిన సుప్రీంకోర్టు...

అయితే.. సుప్రీంకోర్టు 2021లో తీర్పునిస్తూ.. అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ ట్విన్ టవర్స్‌ను నిబంధనలను ఉల్లంఘించి నిర్మించారంటూ.. వాటిని కూల్చివేయాలని ఆదేశించింది.

ఆగస్టు 28వ తేదీన కానీ.. ఏవైనా సాంకేతిక, వాతావరణ కారణాల రీత్యా స్వల్ప జాప్యం జరిగేట్లయితే.. ఆ తర్వాత ఏడు రోజుల్లోగా కానీ కూల్చివేత జరగాలని గడువు కూడా నిర్దేశించింది.

ఈ నేపథ్యంలో ఆగస్టు 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఈ ట్విన్ టవర్స్‌ను కూల్చివేశారు.

నోయిడా ట్విన్ టవర్స్

కూల్చివేత కోసం ఎన్ని జాగ్రత్తలో...

ఇలాంటి కూల్చివేతలను సాధారణంగా ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అనుమతించరు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఆదివారం నాటి కూల్చివేతలోనూ చాలా సవాళ్లు ఎదురయ్యాయి.

ఈ భవనాలు ఉన్నచోటే నేలమట్టం అయ్యేందుకు వీలుగా.. వీటిని పడగొట్టేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఈ పనిలో మూడు దేశాల ఇంజనీర్లు పాలుపంచుకున్నారు.

ఈ రెండు టవర్లకు కేవలం 30 అడుగులు (9 మీటర్లు) దూరంలో ఒక 12 అంతస్తుల భవనం ఉంది. దీనిలో దాదాపు 7,000 మంది జీవిస్తున్నారు. మరోవైపు ఈ చుట్టుపక్కలే మరో 45 భవనాలు కూడా ఉన్నాయి.

ఈ చుట్టుపక్కల భవనాల్లో జీవించే ప్రజలు, పెంపుడు జంతువులు ఆదివారం ఉదయానికల్లా వారి వారి ఇళ్లు విడిచి వెళ్లాల్సిందిగా నిర్దేశించారు. కూల్చివేత పూర్తయిన ఐదు గంటల తర్వాత మాత్రమే మళ్లీ వారు తిరిగి రావడానికి అనుమతిస్తారు.

చుట్టుపక్కల రోడ్లతో పాటు ప్రధాన ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు.

కూల్చివేత చేపట్టే ప్రాంతానికి 50 అడుగుల (15 మీటర్ల) దూరంలో ఒక భూగర్భ పైప్‌లైన్ కూడా ఉంది. ఇది దిల్లీకి వంట గ్యాస్‌ను సరఫరా చేస్తుంది. ఈ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

మరోవైపు కూల్చివేత సమయంలో వచ్చే ప్రకంపనలతో చుట్టుపక్కల ఉండే తమ ఇళ్లు దెబ్బతినే ముప్పుందని అక్కడుండే ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆందోళన అవసరంలేదని ఇంజనీర్లు భరోసా ఇచ్చారు.

నోయిడాలోని చాలా భవనాలను భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. అయితే, ఈ జంట భవనాలను కూల్చేటప్పుడు వచ్చే ప్రకంపనలు.. రిక్టర్ స్కేలు మీద నాలుగు తీవ్రతతో వచ్చే ప్రకంపనల్లో పదో శాతం మాత్రమే ఉంటాయని కూల్చివేతలో పాలుపంచుకుంటున్న బ్రిటిష్ ఇంజనీర్లు చెప్పారు.

మరోవైపు ప్రకంపనల తీవ్రతను తగ్గించేందుకు ఈ ట్విన్ టవర్ల బేస్‌మెంట్లను వ్యర్థాలతో నింపారు.

కూల్చివేత జరిగిందిలా...

ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు వారాల ముందు నుంచీ ఈ భవనాల్లోని 30 అంతస్తులను బ్లాస్టర్లు పరిశీలించారు. ఇక్కడ విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.

అనంతరం ఈ అంతస్తుల్లో పేలుడు పదార్థాలను నింపారు. పేలుడు పదార్థాలతో ఒక అంతస్తును మరో అంతస్తుతో అనుసంధానించారు. వీటిలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే మిగతా అంతస్తుల్లో పేలుడు జరగదు. అందుకే అన్నీ సవ్యంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

పేలుడు కోసం భిన్న రకాల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. మిల్లీ సెకన్ల వ్యవధిలో ఈ రెండు భవనాల్లోనూ పేలుళ్లు మొదలయ్యేలా ఏర్పాట్లు చేశారు.

ఆదివారం ఉదయం ఈ కూల్చివేత కోసం ఆరుగురు సిబ్బంది ''ఎక్స్‌క్లూజన్ జోన్‌''లోకి వెళ్లి, పేలుడు పదార్థాలు విస్ఫోటం చెందేందుకు అంతా సిద్ధం చేశారు.

''ఇవి వాటంతట అవిగా నేలమట్టం కావు. మొదట 18 అంతస్తులను పేలుడు పదార్థాలతో ధ్వంసం చేస్తాం. దీంతో మిగతావి వాటంతట అవే కూలిపోతాయి. ఈ విధానాన్ని వాటర్‌ఫాల్ ఇంప్లోషన్‌గా పిలుస్తారు. దీనిలో గురుత్వాకర్షణ శక్తి కూడా సాయం చేస్తుంది'' అని దిల్లీకి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ వ్యవస్థపాకుడు ఉత్కర్ష్ మెహతా కూల్చివేతకు ముందు చెప్పారు. దిల్లీలో భవనాల కూల్చివేత కోసం ఆయన సంస్థ పనిచేస్తుంది.

https://twitter.com/ANI/status/1563838223948075008

కూల్చివేత తర్వాత ఏం చేస్తారంటే...

ఈ ట్విన్ టవర్ల కూల్చివేత తర్వాత దాదాపు 30,000 టన్నుల శిథిలాలు పోగవుతాయని అంచనా. ఇవి చుట్టుపక్కల చెల్లాచెదురై, ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ శిథిలాలను తరలించేందుకు దాదాపు 1,200 ట్రక్కులు పనిచేస్తాయి. ఇవి దగ్గర్లోని ఒక రీసైక్లింగ్ ప్లాంట్‌కు శిథిలాలను తరలిస్తాయి. అక్కడ వీటిని రీసైక్లింగ్ చేసేందుకు మూడు నెలల సమయం పడుతుంది.

''ధూళి సమస్య త్వరగానే సద్దుమణుగుతుంది. కానీ, శిథిలాలను వదిలించుకోవడానికి కాస్త సమయం పడుతుంది'' అని మెహతా చెప్పారు.

భారత్‌లో ఇలాంటి కూల్చివేతలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. 2020లో కేరళలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను అధికారులు కూల్చివేశారు.

పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి వీటిని కట్టారని చర్యలు తీసుకున్నారు. వీటిలో దాదాపు 2,000 మంది ఉండేవారు. అయితే, నోయిడా కూల్చివేతలు ప్రత్యేకమైనవి. ఇవి చాలా పెద్దవి, వీటి విషయంలో ఆందోళన కూడా ఎక్కువగా కనిపించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Delhi: The full story of the demolition of Noida Twin Towers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X