రెండు దశాబ్దాలుగా తోడు లేకుండానే.. 'జటాయువు' జీవితంలో ఊహించని మలుపు..
ఆంజనేయుడి కంటే ముందే రామాయణంలో సీతమ్మ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుడు 'జటాయువు'. అదే పేరుతో ఢిల్లీ జూలో నివసిస్తున్న ఒక ఈజిప్షియన్ రాబందు జీవితం కూడా ఒక రకంగా విషాదకరమైన పోరాటమే! గత ఇరవై ఏళ్లుగా నాలుగు గోడల మధ్య, ఎవరూ లేని ఒంటరితనంతో.. నిశ్శబ్దంగా నరకం అనుభవించిన ఈ 'జటాయువు' జీవితంలోకి ఎట్టకేలకు ఒక వెలుగురేఖ రాబోతోంది. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. అతనికి ఒక భాగస్వామిని తెచ్చేందుకు ఢిల్లీ జూ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్వేషణ మొదలుపెట్టారు.
సుమారు ఇరవై ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తూ దారితప్పి, గాయపడి ఢిల్లీ తీరంలో వాలినప్పుడు అధికారులు ఈ రాబందును రక్షించారు. ఢిల్లీ జూకి తీసుకొచ్చి ప్రేమాభిమానాలతో 'జటాయువు' అని పేరు పెట్టారు. అయితే కాలం గడిచేకొద్దీ వయోభారం, ఆరోగ్య సమస్యలతో జూలోని మిగతా రాబందులు ఒక్కటొక్కటిగా కన్నుమూశాయి. చివరికి జటాయువు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.

సాధారణంగా ఈజిప్షియన్ రాబందులు 25 ఏళ్లకు పైగానే జీవిస్తాయి. 5 ఏళ్ల వయస్సు నుంచే జంటగా మారి ఒకే భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటాయి. కానీ మన జటాయువు మాత్రం తన జీవితంలోని బంగారంలాంటి సమయాన్నంతటినీ తోడు లేకుండానే గడిపేశాడు. ఇప్పుడు ఈ ఒంటరితనానికి ముగింపు పలికేందుకు అధికారులు నిబంధనల ప్రకారం జంతు మార్పిడి విధానంలో రెండు ప్రముఖ జూలతో చర్చలు జరుపుతున్నారు.
జూలో ఒంటరి జీవితాలు.. మరో 16 జీవులకు తోడు కోసం వెతుకులాట!
కేవలం జటాయువు మాత్రమే కాదు, ఢిల్లీ జూలో తోడు లేక రోదిస్తున్న జీవులు మరో 15 వరకు ఉన్నాయి. 2021లో తీసుకొచ్చిన రెండు మగ ఆస్ట్రిచ్‌లకు (ఉష్ట్రపక్షులు) ఆడ తోడు లేదు. అలాగే 2018 నుంచి ఒక రియా పక్షి, 2022 నుంచి ఒక మగ బార్న్ గుడ్లగూబ, గ్రే లాంగూర్, బ్లాక్ స్వాన్, చిన్న భారతీయ పునుగుపిల్లి వంటివి కూడా జంటలు లేక ఒంటరిగా ఉంటున్నాయి.
2024లో జతకట్టిన మగ ఖడ్గమృగం 2025లో చనిపోవడంతో 18 ఏళ్ల ఆడ ఖడ్గమృగం కూడా మళ్లీ ఒంటరిదైపోయింది. వీటన్నింటికీ తగిన జోడీలను వెతికి, జూలో సంతానోత్పత్తిని పెంచడంతో పాటు కొత్త జీన్స్ జెనెటిక్ బ్లడ్‌లైన్‌ను తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సెప్టెంబర్ 6న కీలక పర్యటన.. పింజోర్ సెంటర్‌పై దృష్టి!
రాబందుల సంరక్షణలో పేరుగాంచిన హర్యానాలోని 'పింజోర్ రాబందుల సంరక్షణ, ప్రజనన కేంద్రం'పై ఢిల్లీ జూ దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 6న జూ అధికారుల బృందం అక్కడికి వెళ్లి పరిశోధనలు జరపనుంది. హర్యానా అటవీ శాఖ, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో రాబందుల సంరక్షణ విధానాలను పరిశీలించనున్నారు. జటాయువుకు తగిన ఈజిప్షియన్ రాబందు భాగస్వామి లభిస్తే, అనుమతులు పొంది త్వరలోనే ఢిల్లీకి తరలించనున్నారు.
ఢిల్లీ జూ రూపురేఖలు మారబోతున్నాయ్!
ఒక్కో జీవి సంఖ్య తగ్గిపోతూ గతంలో 99 రకాలుగా ఉన్న జూ జంతువుల జాతులు ప్రస్తుతం 92కి పడిపోయాయి. చింపాంజీలు, జిరాఫీలు, జీబ్రాలు వంటివి ఇప్పటికే కనిపించకుండా పోయాయి. దీంతో జూను పూర్తిస్థాయిలో రెనోవేషన్ చేసే మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
అందులో భాగంగా ఏకంగా 109 కొత్త జాతులను, దాదాపు 2,943 జంతువులు, పక్షులను కొత్తగా జూకి తీసుకురావాలని నిర్ణయించారు. చీతాలు, మౌస్ డీర్ (చిన్నపాటి జింకలు), విదేశీ కోతులు, అరుదైన సీతాకోకచిలుకలతో ఢిల్లీ జూ సరికొత్త కలరింగ్ తెచ్చుకోనుంది. అయితే, ప్రస్తుతం అందరి చూపు రెండు దశాబ్దాల తర్వాత తన భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న 'జటాయువు' రాక పైనే ఉంది!














Click it and Unblock the Notifications