Delimitation: డీలిమిటేషన్ పై కాంగ్రెస్ ట్విస్ట్- పార్లమెంట్ ప్రోరోగ్ ఆలస్యం వేళ ఖర్గే లేఖ..!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు ఆటంకాలు తప్పడం లేదు. గతంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లు (Delimitation bill)ను నెగ్గించుకునేందుకు మహిళా బిల్లుతో కలిపి పెట్టి ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడిన కేంద్రానికి విపక్షాలన్నీ ఏకమై 2/3 వంతు మెజార్టీ రాకుండా అడ్డుకున్నాయి. దీంతో ఈసారి వర్షకాల సమావేశాల్లో ఈ బిల్లును ఎలాగైనా ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలని ప్లాన్ చేసి, ఆ మేరకు మెజార్టీకి సైతం ఇబ్బందుల్లేకుండా విపక్షాల్ని అడ్డంగా చీల్చిన కేంద్రానికి కాక్రోచ్ పార్టీ నిరసనల రూపంలో ఝలక్ తప్పలేదు.
ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ చేసిన ఆందోళనల ఫలితంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించిన కేంద్రం.. ఆ తర్వాత పార్లమెంట్ కు వచ్చి ఈ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. దీంతో ప్రధాని మోడీ, అమిత్ షా పార్లమెంట్ కే రాకుండా ఉండిపోయారు. చివరి రోజు వచ్చి వందేమాతరం పూర్తిగా పాడేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ను సైతం నిరవధిక వాయిదా వేయకుండా అలాగే ఉంచి, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ద్వారా డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకుందామని ఆశించినా అదీ ముందుకు సాగేలా లేదు. ఇప్పటికే విద్యార్ధుల ఆందోళనలతో ఏకమైన విపక్షాలు డీలిమిటేషన్ అవసరం లేదంటూ కొత్త రాగం అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాశారు. డీలిమిటేషన్ ప్రతిపాదనలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే ముందు అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు వాటిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాజాగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో ఖర్గే ఈ లేఖ రాశారు. డీలిమిటేషన్ వంటి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లకూడదని ఖర్గే సూచించారు.

ఈ సందర్భంగా ఖర్గే ప్రధాని ముందు మూడు కీలక డిమాండ్లు పెట్టారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని, లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల వారీ సీట్ల సంఖ్యను మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. అలాగే డీలిమిటేషన్ ప్రతిపాదనలపై అన్ని పార్టీలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఖర్గే కోరారు. రాష్ట్రాల ప్రాతినిధ్యం, లోక్‌సభ సీట్ల సమతుల్యత వంటి అంశాలకు డీలిమిటేషన్‌పై చర్చల్లో కీలక ప్రాధాన్యత ఉందని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. ఇప్పటికే జూలై 16న ప్రధానికి రాసిన లేఖలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలను పరిశీలించేందుకు తగిన సమయం ఇవ్వాలని ఖర్గే కోరారు. తాజాగా ఆ డిమాండ్లను మరోసారి ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.














Click it and Unblock the Notifications