800వాహనాల్లో కోర్టుకు గుర్మీత్ బాబా: 2రాష్ట్రాల్లో ఉద్రిక్తత, 200 రైళ్లు రద్దు
వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. సిర్సా నుంచి పంచకులలోని సీబీఐ న్యాయస్థానానికి దాదాపు 800 కార్ల కాన్వాయ్‌లో బయలుదేరారు.
పంచకుల: వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. సిర్సా నుంచి పంచకులలోని సీబీఐ న్యాయస్థానానికి దాదాపు 800 కార్ల కాన్వాయ్‌లో బయలుదేరారు. హత్య, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్మీత్ కేసులో సీబీఐ న్యాయస్థానం శుక్రవారం తుది తీర్పు ఇవ్వనుంది.

ఎటుచూసినా మద్దతుదారులే..
ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో గుర్మీత్ మద్దతుదారులు న్యాయస్థానానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రహదారులపై ఎటువైపు చూసినా ఆయన మద్దతుదారులే కనిపిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

భారీగా బలగాల మోహరింపు
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. పంజాబ్, హర్యాకు వచ్చే 200 రైలు సర్వీసులను రైల్వేశాఖ అధికారులు రద్దు చేశారు. బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.

లైంగిక దాడి ఆరోపణలు.. శాంతంగా ఉండాలని..
2002లో ఇద్దరు మహిళా సాధ్వీలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డేరా మద్దతుదారులంతా శాంతంగా ఉండాలని కోరుతూ గుర్మీత్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పంచకుల వచ్చిన మద్దతుదారులంతా వెంటనే వారి వారి ఇళ్లకు వెళ్లిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని గౌరవించాలని సూచించారు.

ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు..
కాగా, వెన్ను నొప్పి తనను బాధిస్తున్నా కోర్టుకు హాజరవుతున్నట్టు గుర్మీత్ ట్వీట్ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పంచకుల జిల్లా కోర్టుకు వెళ్లే మార్గాలపై పోలీసులు నిఘా పెంచారు. గుర్మీత్ మద్దతుదారులను ఎక్కడవారిని అక్కడే అడ్డుకుంటున్నారు. కాగా, బాబా మద్దతుదారులు పెట్రోలు, ఆయుధాలతో రోడ్లపైకి వస్తుండటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వేళ తీర్పు బాబాకు వ్యతిరేకంగా వస్తే వారు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications