మహారాష్ట్రలో తేలిన లెక్క-కొత్త పాత్రల్లో త్రిమూర్తులు-సాయంత్రం ప్రమాణం..!
మహారాష్ట్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం తర్వాత మొదలైన కుర్చీలాట సుఖాంతమైంది. మహారాష్ట్రకు ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే కుర్చీ వీడేందుకు ఇష్టపడకపోవడంతో మొదలైన ఈ సంక్షోభానికి బీజేపీ తనదైన శైలిలో తెరదించింది. దీంతో గతంలో ఉన్న సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా
ఈసారి పాత్రలు మారి కొనసాగడానికి లైన్ క్లియర్ అయింది.
మహారాష్ట్రలో ఇవాళ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముంబైలోని అజాద్ మైదానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు మూడోసారి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. దీంతో సీఎం పదవిపై ఇన్నాళ్లు మొండిపట్టు పట్టిన షిండే బీజేపీ అధిష్టానం జోక్యంతో మెట్టు దిగినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో ఈసారి మహాయుతి కూటమి అధికారంలోకి రావడానికి తానే కారణమని, కాబట్టి తనకు మరోసారి సీఎం అవకాశం ఇవ్వాల్సిందేనని షిండే పట్టు బట్టారు. అయితే బీజేపీ మాత్రం అత్యధిక సీట్లు గెల్చుకున్న తమను కాదని షిండేకు పగ్గాలు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. అలాగని షిండేను వదులుకునేందుకు సైతం ఇష్టపడలేదు. దీంతో ఆయన్ను ఎలాగైనా ఒప్పించేందుకు పార్టీ సీనియర్ నేతలు విజయ్ రూపాణీ, నిర్మలా సీతారామన్ ను పరిశీలకులుగా పంపింది. చివరికి వారు షిండేను ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగే కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానిక ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు బీజేపీ పెద్దలు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలి వస్తున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు.












Click it and Unblock the Notifications