ఎయిరిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం
Air India: అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన తరువాత.. ఆ సంస్థలో ఉన్న లోపాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తోన్నాయి. ఒకప్పుడు దేశ పౌర విమానయాన రంగానికి తలమానికంగా ఉంటూ వచ్చిన ఈ సంస్థ.. టాటాల ఆధీనంలోకి వెళ్లిపోయిన అనంతరం అధ్వాన్నంగా తయారైంది.
అహ్మదాబాద్ దుర్ఘటన తరువాత ఎయిరిండియా విమానాల్లో రోజుకో సాంకేతిక లోపం తలెత్తుతూ వస్తోంది. ప్రయాణికుల ప్రాణాలను గాల్లో దీపంలా మార్చివేస్తోంది. ఫ్లైట్ మెయింటెనెన్స్ అనేది దాదాపుగా నామమాత్రంగా తయారైందనే పరిస్థితి ఏర్పడింది ఎయిరిండియా సంస్థలో.

ఈ విషయంలో స్వయానా టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్.. క్షమాపణలు చెప్పారంటే దీని దుస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎయిరిండియా విమానాల నిర్వహణ కోసం పౌర విమానయాన డైరెక్టర్ జనరల్.. ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి సమావేశం సైతం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో డీజీసీఏ.. సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎయిరిండియా సంస్థలో ముగ్గురు అధికారులను తక్షణమే తొలగించాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ ముగ్గురిలో ఎయిరిండియా డివిజినల్ వైస్ ప్రెసిడెంట్ సైతం ఉండటం చర్చీనీయాంశమౌతోంది. వారిని తొలగించడం మాత్రమే కాకుండా సంస్థాగతమైన క్రమశిక్షణ చర్యలను సైతం తీసుకోవాలని ఎయిరిండియాను డీజీసీఏ ఆదేశించింది.
ఈ అధికారులపై ఆలస్యం చేయకుండా అంతర్గత క్రమశిక్షణా చర్యలను ప్రారంభించాలని డీజీసీఏ సూచించింది. డివిజినల్ వైస్ ప్రెసిడెంట్ చురా సింగ్, చీఫ్ మేనేజర్ పింకీ మిట్టల్, క్రూ షెడ్యూలింగ్ అండ్ ప్లానింగ్ పాయల్ అరోరాను బాధ్యులుగా గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది.
లైసెన్సింగ్, టైమ్ టేబుల్, విశ్రాంతి సమయ నిబంధనలను ఉల్లంఘించేలా ఎయిరిండియా యాజమాన్యం సిబ్బందిని వినియోగిస్తోన్నట్లు గుర్తించింది. పోస్ట్-ట్రాన్సిషన్ ఆడిట్ సమయంలో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు డీజీసీఏ వెల్లడించింది. బెంగళూరు నుండి లండన్ కు ప్రయాణించిన విమానం పైలట్లు ఓవర్ టైమ్ డ్యూటీ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు వివరించింది.












Click it and Unblock the Notifications