వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిఫా ప్రపంచ కప్‌ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫిఫా ప్రపంచ కప్‌

ఖతార్‌లో నిర్వహించిన ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా గెలుచుకుంది. ఈ టైటిల్‌ను అర్జెంటీనా గెలవడం ఇది మూడోసారి. తాజా విజయంలో లియోనెల్ మెస్సీ ప్రధాన పాత్ర పోషించారు.

గతంలో 1978, 1986లలో ఫిఫా వరల్డ్‌ కప్‌ను అర్జెంటీనా గెలుచుకొంది. అయితే, ముందెన్నడూ లేని స్థాయిలో తాజా వరల్డ్ కప్‌ హోరాహోరీగా జరిగిందని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు వరల్డ్‌ కప్‌కు ఒక ముస్లిం దేశం అతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

దీంతో ఈవెంట్‌కు అరబ్, ఇస్లామిక్ హంగులు అద్దేందుకు ఖతార్ చాలా ప్రయత్నించిందని వార్తలు, విశ్లేషణలు వస్తున్నాయి.

మొత్తంగా ఫిఫా నిర్వహణకు 220 బిలియన్ డాలర్లను ఖతార్ ఖర్చుపెట్టింది.

వరల్డ్ కప్ టైటిల్‌ను అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఇచ్చేటప్పుడు అతడి భుజాలపై ఖతార్ పాలకుడు షేక్ తానిమ్ బిన్ హమాద్ అల్-థానీ ఒక నల్ల రంగు వస్త్రాన్ని కప్పారు. ఇది అరబ్బులు వేసుకునే సంప్రదాయ వస్త్రం.

మెస్సీ షర్టును ఈ నల్లని వస్త్రం పూర్తిగా కప్పేసింది. అర్జెంటీనా నేషనల్ బ్యాడ్జి కూడా కనిపించలేదు. ఆ సమయంలో ఫిఫా చీఫ్ నవ్వుతూ కనిపించారు.

ఈ విషయంలో సంప్రదాయాలను గౌరవించాలని అరబ్బులు చెబుతుంటే, పశ్చిమ దేశాల నెటిజన్లు ట్విటర్‌లో విమర్శలు సంధిస్తున్నారు.

''అసలు ఈ వస్త్రాన్ని ఇప్పుడు కప్పాల్సిన అవసరం ఏముంది?’’అని అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ పాబ్లో జాబ్‌లెటా ప్రశ్నించారు.

మరోవైపు నవంబరు 20న ఫిఫా వరల్డ్ కప్ ఆరంభ కార్యక్రమంలోనూ ఒక గాయని బుర్ఖా వేసుకొని పాట పాడారు. కొన్ని ఐరోపా దేశాల్లో ఇలా బురఖా వేసుకోకుండా ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి.

ఫిఫా ప్రపంచ కప్‌

ఇస్లామిక్ హంగులు..

ఆ ప్రారంభ కార్యక్రమంలో ఖురాన్‌లోని వాక్యాలను కూడా చదివి వినిపించారు.

మరోవైపు ఖతార్‌లో ఫిఫా మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే పర్యటకులు విడిదిచేసే హోటళ్లలో ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటుచేశారు.

వీటిని స్కాన్ చేసి ఇస్లాం గురించి తెలుసుకోవచ్చు.

మరోవైపు ఇస్లామిక్ సంప్రదాయాల గురించి వివరించేందుకు ముస్లిం వలంటీర్లను కూడా చాలాచోట్ల ఏర్పాటుచేశారు.

ఇలా ఫిఫాకు ఇస్లామిక్ హంగులు అద్దడంపై వరల్డ్ కప్ ఈవెంట్‌ను పర్యవేక్షించే ఫిఫా అత్యున్నత కమిటీకి అమెరికన్ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్ ప్రశ్నలు పంపించింది.

కానీ, వారికి ఎలాంటి సమాధానమూ రాలేదు.

అయితే, దీనికి ముందుగా ఖతార్‌లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

''ఎలాంటి వివక్ష లేని, అందరినీ కలుపుకొంటూ వెళ్లే వరల్డ్ కప్‌ను నిర్వహించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఖతార్‌లో అందరికీ ఆహ్వానం ఉంది. అయితే, మాది సంప్రదాయ దేశం. కొన్ని ప్రేమ కార్యకలాపాలను మేం బహిరంగంగా చేయం. మా సంప్రదాయాన్ని గౌరవించాలని అందరినీ కోరుతున్నాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు ఫిఫా కప్ పేరుతో అరబ్, ముస్లిం సంప్రదాయాలను ఖతార్ ప్రోత్సహిస్తోందని అక్కడకు వచ్చిన పశ్చిమ దేశాల జర్నలిస్టులు ఆరోపించారు.

''పశ్చిమ దేశాల వస్త్రధారణలో మహిళలను చూడటం ఖతార్‌లో ప్రజలకు పెద్దగా అలవాటు లేనట్లుంది’’అనే వ్యాఖ్యలతో ద టైమ్స్ ఆఫ్ లండన్ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అయితే, దీనిపై నిరసన వ్యక్తం కావడంతో ఆ వ్యాఖ్యలను తొలగించారు.

ఖతార్‌లోని 29 లక్షల జనాభాలో 87 శాతం మంది విదేయులే ఉంటారు.

వీరిలో పశ్చిమ దేశాల ప్రజల వాటా కూడా ఎక్కువే ఉంటుంది.

అయితే, ఫిఫా పేరుతో ఇస్లాంను ఖతార్ ప్రోత్సహిస్తోందనే వాదనను ఫిఫా చీఫ్ జ్యానీ ఇఫైంటోనీ ఖండించారు. ఈ విషయంలో ఖతార్‌కు ఆయన సంఘీభావం ప్రకటించారు.

ఫిఫా ప్రపంచ కప్‌

ఫిఫా చీఫ్ ఏం చెబుతున్నారు?

ఖతార్‌లో ప్రపంచ కప్ మొదలు కాకముందే, ఈ విషయంపై ఫిఫా చీఫ్ ఇఫైంటోనీ మాట్లాడారు.

''ఈ రోజు నాకు నేను ఒక ఖతార్ పౌరుడిలా అనిపిస్తున్నాను. ఒక అరబ్బులానూ అనిపిస్తోంది. ఒక ఆఫ్రికన్‌గా, ఒక స్వలింగ సంపర్కుడిగా, ఒక వికలాంగుడిలా, ఒక విదేశీ కార్మికుడిలా.. కూడా అనిపిస్తోంది. నేడు పశ్చిమ దేశాల చుట్టూ హిపోక్రసీ అలుముకొంది. పైగావారు నేడు ఇతరులకు నైతిక విలువలపై సందేశాలు ఇస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

బయట దేశాల నుంచి వచ్చే ఫుట్‌బాల్ ప్రేమికులకు వరల్డ్ కప్ సమయంలో ఇస్లాం సంప్రదాయాలను పరిచయం చేసేందుకు ఖతార్ ప్రత్యేకంగా సన్నద్ధమైందని ఏపీ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది.

ఖతార్‌లోని ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వరల్డ్ కప్ అతిథుల కోసం కటారా కల్చరల్ విలేజీ మసీదు దగ్గర ప్రత్యేక పెవీలియన్‌ను ఏర్పాటుచేసింది.

30 భాషల్లో ఇక్కడ ఇస్లామిక్ సంస్కృతి గురించి వివరించే ఏర్పాట్లు చేశారు.

మరోవైపు అతిథులకు ఖురాన్‌తోపాటు ఇస్లామిక్ బుక్‌లెట్లు కూడా పంపిణీ చేశారు.

వరల్డ్ కప్ స్టేడియంలకు అతిథులను తీసుకెళ్లే బస్సుల్లోనూ ఖురాన్ క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటుచేశారు.

దోహాలోని కటారా కల్చరల్ విలేజీ మసీదు విశేషంగా అతిథులను ఆహ్వానిస్తోందని టర్కీ వార్తా సంస్థ అనాదోలు తెలిపింది.

ఇస్లాం, ఖురాన్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించింది.

ఫిఫా ప్రపంచ కప్‌

ఇజ్రాయెల్‌పై వివాదం..

ఫిఫా వరల్డ్ కప్ 2022 సమయంలో ఇజ్రాయెల్‌లోని తెల్ అవీవ్ నగరం నుంచి దోహాకు నేరుగా విమాన సేవలు ఉంటాయని ఫిఫా ప్రకటించింది.

ఇజ్రాయెల్, పాలస్తీనాలో ఫుట్‌బాల్ అభిమానుల కోసం ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

వాస్తవానికి ఖతార్, ఇజ్రాయెల్‌ల మధ్య దౌత్య సంబంధాలు లేవు. ఈ రెండు దేశాల మధ్య నేరుగా ఎలాంటి విమాన సేవలు కూడా లేవు.

అయితే, ఖతార్‌కు నేరుగా విమాన సేవలు మొదలుపెట్టడంపై ఇజ్రాయెల్ ఉత్సాహం చూపించింది.

ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

మరోవైపు ఇజ్రాయెల్‌ను ఆమోదించే దిశగా ఒక్కో అరబ్బు దేశం అడుగులు వేస్తోందని చాలా మంది విదేశాంగ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తంచేశారు.

ఫిఫా ప్రపంచ కప్‌

పాలస్తీనాకు మద్దతు..

మరోవైపు ఖతార్‌లోని చాలా ప్రాంతాల్లో పాలస్తీనాకు మద్దతుగా బహిరంగంగానే పోస్టర్లు కనిపించాయి.

స్టేడియంల బయట ఇజ్రాయెలీ జర్నలిస్టుల ఎదుట కొంతమంది పాలస్తీనా అనుకూల నినాదాలు చేశారు. పాలస్తీనా జెండాలను కూడా ఎగురవేశారు.

''ఫిఫా వరల్డ్ కప్ వేదికలపై పాలస్తీనాకు కనిపిస్తున్న మద్దతు ఊహించనిది. అటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా ఈ మద్దతును చూసి ఆశ్చర్యపోతున్నాయి’’ అని ఇరాక్ కేంద్రంగా అరబ్ వార్తలు ప్రచురించే అమ్వాజ్ మీడియా పేర్కొంది.

''ఇజ్రాయెల్‌తో సంబంధాల బలోపేతం దిశగా కుదుర్చుకుంటున్న అబ్రహాం అకార్డ్స్‌తో ప్రజలకు సంబంధం లేనట్లుగా అనిపిస్తోంది. ఇజ్రాయెల్‌ను ఆమోదించే అరబ్ దేశాల సంఖ్య పెరుగుతోందని చాలా విశ్లేషణలు మనం చూశాం. కానీ, ఫిఫా వరల్డ్‌ కప్‌లో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది’’అని అమ్వాజ్ వివరించింది.

2020లో బహ్రెయిన్, మొరాకో, సూడాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో ఇజ్రాయెల్ దౌత్య సంబంధాలు ఏర్పాటుచేసే దిశగా అప్పటికి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నేతృత్వంలో అబ్రహాం అకార్డ్స్ కుదర్చుకున్నారు.

ప్రస్తుతం ఈ నాలుగు దేశాలతోనూ ఇజ్రాయెల్‌కు ప్రభుత్వాల స్థాయిల్లో దౌత్య సంబంధాలు ఉన్నాయి. అయితే, ఈ దేశాల ప్రజలు నేడు భిన్నంగా స్పందిస్తున్నారని అమ్వాజ్ మీడియా పేర్కొంది.

ఫిఫా ప్రపంచ కప్‌

సాధారణ పౌరుల ఆగ్రహం..

''అరబ్ ప్రభుత్వాలతో ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాలు కుదర్చుకుంటోంది. కానీ, సాధారణ పౌరుల విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఒప్పందాలను తాము ఆమోదించబోమని ప్రజలు చెబుతున్నారు’’అని అమ్వాజ్ మీడియా రాసుకొచ్చింది.

ఈ విషయంపై డెన్వర్ యూనివర్సిటీలోని మిడిల్ ఈస్ట్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ నాదెర్ హాషిమీ... అమ్వాజ్ మీడియాతో మాట్లాడారు.

''పాలస్తీనావాసుల విషయంలో అరబ్బులు చాలా సంఘీభావంతో ఉన్నారు. ఇజ్రాయెల్‌పై ప్రభుత్వం, ప్రజల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఈ ప్రపంచ కప్ చెబుతోంది’’అని నాదెర్ వ్యాఖ్యానించారు.

వరల్డ్ కప్ వేదికగా ఇజ్రాయెల్‌తో సంబంధాలపై అరబ్ ప్రజలు సానుకూలంగా స్పందిస్తారని పశ్చిమ ఆసియా దేశాల మీడియా సంస్థలు అంచనా వేశాయి. నిజానికి పాలస్తీనా వాసుల తరహాలో ఇజ్రాయెల్ ఎదుట నేరుగా తమ అభిప్రాయం వ్యక్తంచేసే అవకాశం చాలా మంది అరబ్ ప్రజలకు లభించలేదు.

తాజా వరల్డ్ కప్‌ను ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతను తెలియజేయడానికి చాలా మంది అరబ్బులు ఉపయోగించుకున్నారు. ఇక్కడ తాము మాట్లాడితే ప్రపంచంలో అందరికీ తెలుస్తుందని వారు మీడియాతో కూడా చెప్పారు.

ఇజ్రాయెల్ మీడియా ముందు అరబ్ ప్రజల స్పందనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నవంబరు 18న ఓ ఇజ్రాయెల్ టీవీ చానెల్ ప్రతినిధి మాట్లాడాలని సూచించినప్పుడు ఒక అరబ్ పౌరుడు మౌనంగా నిరసన తెలిపారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.

ఆ తర్వాత కొందరు లెబనాన్ పౌరులు కూడా ఇలానే ఇజ్రాయెల్ జర్నలిస్టులతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఆ తర్వాత ''ఇక్కడ ఇజ్రాయెల్‌కు చోటు లేదు’’అని ఒక వ్యక్తి గట్టిగా అరిచారు.

ఇజ్రాయెల్‌పై ద్వేషమా?

సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్న వ్యతిరేకతపై ఇజ్రాయెల్ జర్నలిస్టులు కూడా అభ్యంతరాలు వ్యక్తంచేశారు. నవంబరు 26న ఇజ్రాయెల్ జర్నలిస్టు ర్యాజ్ షేచింక్ ఒక వీడియో ట్విటర్‌లో పోస్టు చేశారు.

ఈ వీడియోలో అరబ్ ప్రజలు పాలస్తీనా జెండా పట్టుకొని ఇజ్రాయెల్ పాత్రికేయుడి ఎదుట నిరసన వ్యక్తంచేశారు.

''మీరు ఎక్కడి నుంచి వచ్చారు?’’అని ఆ వీడియోలో ఒక ప్రశ్న అడిగిన వెంటనే.. ''మాది ఇజ్రాయెల్’’అని రిపోర్టర్ సమాధానం ఇచ్చారు. వెంటనే పాలస్తీనా జెండా చూపిస్తూ ఆ అరబ్ వ్యక్తి నిరసన వ్యక్తంచేశారు.

ఆ తర్వాత బుర్ఖా వేసుకున్న ఇద్దరు అమ్మాయిలు కూడా నిరసన తెలియజేశారు. ఆ తర్వాత వచ్చిన మొరాకో పౌరులు కూడా మాట్లాడలేదు.

చివరగా ఇజ్రాయెల్ పౌరుడితో ఆ జర్నలిస్టు మాట్లాడారు. కానీ, అతడి వెనుక చాలా మంది పాలస్తీనా అనుకూల నినాదాలు చేశారు.

ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ర్యాజ్ ఇలా రాసుకొచ్చారు.. ''నేనేమీ చెప్పాలని భావించడం లేదు. మీరే వినండి. నేను జర్నలిస్టును. ఇదొక స్పోర్ట్స్ వేడుక. కానీ, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. మాపై చాలా విద్వేషం కనబడుతోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు వరల్డ్ కప్‌లో మొరాకో సెమీ ఫైనల్స్ వరకు చేరుకోవడాన్ని ఇస్లాం, అరబ్‌ల ఘనతగా పేర్కొంటూ పశ్చిమ ఆసియా దేశాల మీడియా వార్తలు రాసింది. మొరాకోను ప్రశంసిస్తూ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. మొరాకోను ముస్లిం టీమ్‌గా పాకిస్తాన్ మాజీ ప్రధాని అభివర్ణించారు. మరోవైపు మొరాకో రాజుకు సౌదీ అరేబియా యువరాజు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Did Qatar spread religious propaganda as FIFA World Cup venue?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X