"టపాసులు మీరు కాలిస్తే.. పొగ మేం పీల్చాలా..?"
ఎంత కొట్టినా చావని పాములా పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. ప్రతీ విషయానికి భారత్ పై విమర్శలు చేస్తోంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ లో వరదలు వచ్చినప్పుడు.. భారత్ వల్లే పాకిస్థాన్ లో వరదలు వచ్చాయని.. తమకు సమాచారం ఇవ్వకుండా భారత్ డ్యామ్ గేట్లు ఎత్తివేసిందని మండిపడింది. తాజాగా మరోసారి భారత్ పై అక్కసు వెల్లగక్కింది పాకిస్థాన్. పాకిస్థాన్ లోని లాహోర్ లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో లాహోర్ లోని ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. అయితే కాలుష్యం పెరగడానికి గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి పాకిస్థాన్.. తన వేళ్లను మరోసారి భారత్ వైపు చూపించింది.
పాకిస్థాన్ లోని డైలీ డాన్ పత్రిక ఇచ్చిన కథనం ప్రకారం.. భారత్ లోని దిల్లీ, ఇతర ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొగ, దుమ్ము, ధూళిని మేఘాలు తమ దేశం వైపునకు మోసుకొస్తున్నాయని అందువల్ల పాకిస్థాన్ లోని లాహోర్ లాంటి నగరాల్లో వాయి కాలుష్యం తీవ్రతరం అవుతోందని వింత వాదన మొదలుపెట్టింది. పాకిస్థాన్ లోని ప్రొవిన్షియల్ ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్(EPD) ఈ ఆరోపణలు చేసింది. దీపావళి సందర్భంగా భారత్ లో అత్యధికంగా టపాసులు కాల్చిన నేపథ్యంలో.. ఆ పొగ మొత్తం తమ దేశం వైపునకు వస్తోందని అక్కడి అధికారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా లాహోర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 266 కు పెరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం కలిగిన నగరాల్లో లాహోర్ రెండో స్థానంలో ఉంది. ఇక మొదటి స్థానంలో భారత్ రాజధాని దిల్లీ ఉన్న విషయం తెలిసిందే. దిల్లీలో ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటింది. అయితే నిపుణులు మాత్రం.. లాహోర్ లో వాయు కాలుష్యం కొత్తేమీ కాదని అభిప్రాయపడ్డారు. లాహోర్ పరిసర ప్రాంతాల్లో పంట పొలాలను ధ్వంసం చేయడం, అధిక పొగ వెదజల్లే వాహనాలను చెక్ చేయకపోవడం, పరిశ్రమల నుంచి పొగ కారణాలతో లాహోర్ లో వాయు కాలుష్యం అధికం అయినట్లు తెలిపారు.

కానీ పాకిస్థాన్ మాత్రం.. తమపై తప్పు పెట్టుకోకుండా భారత్ ను దోషిగా చూపిస్తోంది. లాహోర్ లోని వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం తొలిసారిగా స్మాగ్ గన్ ను ప్రవేశపెట్టింది. ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తున్నట్లు స్థానిక యంత్రాంగం చెబుతోంది. ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ లో 70శాతం తగ్గినట్లు స్పష్టం అవుతోంది. దీంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 666 నుంచి 170 కు పడిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications