ఆ పార్టీని బలంగా దెబ్బకొడుతున్న విజయ్- వారికి గాలం
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తమిళనాడులో ప్రచారం హోరెత్తుతోంది. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు తప్పకపోవచ్చు.
రసవత్తరంగా తమిళనాడు..
తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23వ తేదీన జరగనుంది. మే 4న ఓట్లను లెక్కిస్తారు. ఈ పరిణామాల మధ్య టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తోన్న పెరంబూరు, తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాలపై అందరి దృష్టీ నిలిచింది. ఆయా చోట్ల విజయ్ అరంగేట్రం చేయడం రసవత్తర పోరుకు తెరలేపింది. పెరంబూరులో సిట్టింగ్ డీఎంకే ఎమ్మెల్యే ఆర్‌డీ శేఖర్‌కు సవాలు విసురుతున్నారు. డీఎంకేకు కంచుకోట ఇది. గత ఎన్నికల్లో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎన్ఆర్ ధనపాలన్‌పై 54,976 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు శేఖర్.

త్రిముఖ పోరు..
విజయ్ పోటీలో ఉన్న మరో నియోజకవర్గం తిరుచిరాపల్లి ఈస్ట్. ఇక్కడ కూడా ఆయన సిట్టింగ్ డీఎంకే ఎమ్మెల్యే ఇనిగో ఎస్ ఇరుదయరాజ్ ను ఢీకొంటున్నారు. 2011లో ఏర్పడిన స్థానం ఇది. మొదటి రెండు ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఆధీనంలో ఉండగా, 2021లో డీఎంకే గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఇనిగో ఇరుదయరాజ్ ఎస్ 53,797 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు.
యువత టీవీకే వైపు..
ఈ పరిణామాల మధ్య తమిళనాడు ఎన్నికలపై జూనియర్ వికటన్ తాజా సర్వే నిర్వహించింది. ఓటర్ల పల్స్ బాగా పట్టినట్టు కనిపించిందా సర్వే. తొలిసారిగా విజయ్ తనదైన ఓటు బ్యాంకును సృష్టించారని నిర్ధారించింది. రాష్ట్రవ్యాప్తంగా యువ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపినట్లు తేల్చింది. మొదటిసారిగా ఓటు వేయబోతున్న మెజారిటీ యువత టీవీకే అభ్యర్థులకు పట్టం కట్టొచ్చని ఈ సర్వే అభిప్రాయపడింది.
మిత్రపక్షాల మద్దతు..
జూనియర్ వికటన్ సర్వే ప్రకారం.. యువత టీవీకే వైపు ఆకర్షితులు కావడం వల్ల డీఎంకే, ఏఐఏడీఎంకేలు నష్టపోతాయని, ఈ రెండు పార్టీల ఓటుబ్యాంకులు చీలుతాయి. అలాగని ఈ ఎన్నికల్లో టీవీకే గెలుస్తుందనే గ్యారంటీ కూడా లేదు. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం ఏ పార్టీకి కూడా దక్కదు. మిత్రపక్షాలు ఇచ్చే మద్దతుపైనే ఆధారపడాల్సి ఉంటుంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని జూనియర్ వికటన్ అంచనా వేసింది.
అతిపెద్ద పార్టీగా..
డీఎంకే 37.5 శాతం ఓట్లతో 121 సీట్లను సాధించి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ఏఐఏడీఎంకే 33. 63 శాతం ఓట్లతో 83 స్థానాలను దక్కించుకుంటుంది. రెండో స్థానంలో నిలుస్తుంది. టీవీకే మూడో స్థానానికే పరిమితమౌతుంది. ఈ పార్టీకి మూడు సీట్లు దక్కొచ్చు. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ లో విజయం సాధిస్తారు. విల్లివాక్కంలో గట్టిపోటీ ఉన్నా టీవీకే అభ్యర్థి ఆధవ్ అర్జున గెలిచే అవకాశం ఉంది. మరో 27 నియోజకవర్గాల్లో హోరాహోరి పోరు ఉంటుందని జూనియర్ వికటన్ పేర్కొంది.
20 ఏళ్ల తర్వాత..
విజయ్ కు ఓటు వేసేలా యువ ఓటర్లు తమ తల్లిదండ్రులను సైతం ప్రభావితం చేస్తోన్నారని ఈ సర్వే తెలిపింది. విజయ్ రాకతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మునుపెన్నడూ లేని ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎన్నికల వాతావరణాన్ని మార్చేసింది. విజయ్ ప్రభావంతో 20 ఏళ్ల తర్వాత తమిళనాడులో ఏ పార్టీకీ మెజారిటీ దక్కకపోవచ్చని, అన్ని పార్టీల గెలుపు అవకాశాలనూ దెబ్బకొడుతుందని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications