నిరంజన్ జ్యోతి వ్యాఖ్యలు: సభ్యులకు నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరిక
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మంగళవారం పార్లమెంటులో దుమారం రేపాయి. కేంద్రమంత్రి క్షమాపణ చెప్పాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు తీవ్రంగా పట్టుబట్టాయి. దీంతో కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి లోకసభలో క్షమాపణలు చెప్పారు.
ఈ నేపథ్యంలో లోకసభలో స్పందించిన నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ సభ్యులకు కఠిన హెచ్చరిక చేశారు. జాతిని తప్పుబట్టించే విధంగా ప్రసంగించవద్దని, ఇటువంటి వాటిపై రాజీపడే సమస్యే లేదని నరేంద్ర మోడీ తీవ్రంగా హెచ్చరించారు.
కాగా, తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయం మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి దిగి రాక తప్పలేదు. ఆమె చేసిన వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో ఆమె క్షమాపణ చెప్పారు. ఆమె వ్యాఖ్యలను ప్రతిపక్షాలు పార్లమెంటులో ప్రస్తావిస్తూ మంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఆమె లోకసభలో క్షమాపణ చెప్పారు.

తాను ఆ వ్యాఖ్యలు చేశానని అంగీకరిస్తున్నానని, అందుకు క్షమాపణ చెబుతున్నానని నిరంజన్ జ్యోతి అన్నారు. ఆమె వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో పార్లమెంటు ఉభయ సభలు కూడా కొద్దిసేపు వాయిదా పడ్డాయి.
సాధ్వి చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..
ఢిల్లీ శానససభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి.. రాముడి సంతానం పాలన కావాలో, అక్రమ సంతానం పాలన కావాలో ఢిల్లీ ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాముడి విశ్వసించనివాళ్లపై, దేశ సమైక్యత విశ్వాసం లేనివారిపై మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని, దానికి మతపరమైన రంగు పులమాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
తాను వ్యక్తిని గానీ, కమ్యూనిటీని గానీ, పార్టీని గానీ ప్రస్తావించలేదని చెప్పారు. రాముడి గురించి మాట్లాడడం తప్పా, రాముడి గురించి మాట్లాడితే మతవిషయం అవుతుందా అని ఆమె అడిగారు. సాధ్వీ నిరంజన్ జ్యోతి దూషణలకు సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెసు నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మంత్రి విమర్శించారు.
సోనియా గాంధీ అల్లుడు అంత ధనవంతుడు ఎలా అయ్యారని ఆమె సోనియా రాబర్ట్ వాద్రా విషయంపై ప్రశ్నించారు. దేశంలోని పేదలను వాద్రా దోచుకున్నాడని ఆరోపించారు. పశ్చిమ ఢిల్లీలోని శ్యాంనగర్‌లో ఓటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ నిరంజన్ జ్యోతి దూషణలకు దిగారు. తాము అవినీతికి పాల్పడబోమని, అవినీతిని సహించబోమని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని ఆమె అన్నారు. ఈ దేశాన్ని, ప్రజలను దోచుకుంటున్నవారిని ఏమని పిలువాలని ఆమె అడిగారు.












Click it and Unblock the Notifications