వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలోని ప్రైవేట్ విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించినంత ఫీజులే తీసుకుంటున్నారా? క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫీజుల పీటముడి

"జూనియర్ ఇంటర్ చదువుతున్న మా అబ్బాయికి ఏడాదికి రూ. 42 వేలు ఫీజు కడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల ప్రకారం కడతామంటే కాలేజీ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. పైగా, ఫీజు కట్టకపోతే తరగతులకి హాజరు కానివ్వడం లేదు. అందుకే, కొంత ఫీజు కట్టి ప్రభుత్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాం."

విశాఖ రామ్‌‌నగర్‌లో ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న ప్రభాస్ అనే విద్యార్థి తల్లి సంతోషిణి ఈ మాట చెప్పారు.

ప్రభాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. కాలేజీ ఫీజుతో పాటు ఇతర ఫీజులంటూ ఏడాదికి మరో రూ. 10 వేల వరకు వసూలు చేస్తారని ఆమె చెప్పారు.

ఫీజుల పీటముడి

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు ఇలా..

ఏపీలో విద్యా రంగంలో ప్రమాణాలు పెంచేందుకు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఆర్.కాంతారావు చైర్మన్‌గా పలువురు విద్యారంగ నిపుణులతో ప్రభుత్వం పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (APSERMC) ఏర్పాటు చేసింది.

ఏపీఎస్ఆర్ఎంసీ సిఫారసుల మేరకు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజులు ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో 53, 54 తీసుకొచ్చింది.

ఈ ఫీజులు 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయని తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు లాభాపేక్ష లేకుండా సేవాదృక్పథంతో నడపాలని గతంలో ప్రభుత్వ నిబంధనలు గానీ, ఫీజులపై స్పష్టమైన ఆదేశాలు గానీ లేవు.

జీవో 53, 54 ప్రకారం గ్రామ పంచాయతీల్లో అయితే నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు రూ.10 వేలు.. పట్టణాల్లో 11 వేలు.. నగరాల్లో రూ.12 వేలు ఫీజు వసూలు చేసుకోవచ్చు.

ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ గ్రామాల్లో రూ.12 వేలు, పట్టణాల్లో రూ.15 వేలు, నగరాల్లో రూ.18 వేలుగా ఫీజులు నిర్ణయించారు.

హాస్టల్‌ విద్యార్థులకు గ్రామ పంచాయతీల్లో రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.24 వేలు వరకే ఫీజు వసూలు చేయాలి.

ఇంటర్‌లో మ్యాథ్స్‌, సైన్స్‌ గ్రూపులకు గ్రామ పంచాయతీల్లో రూ.15 వేలు, పట్టణాల్లో రూ.17.5 వేలు, కార్పొరేషన్లలో గరిష్ఠంగా రూ.20 వేలు వరకు, అదే ఆర్ట్స్‌ గ్రూపులైతే రూ.12 వేలు, రూ.15 వేలు, రూ.18 వేలుగా ఫీజు నిర్ణయించారు.

ఇంటర్‌ విద్యార్థులకు హాస్టల్‌ ఫీజు ఏడాదికి గ్రామ పంచాయతీల్లో 18 వేలు, పట్టణాల్లో 20 వేలు, నగరాల్లో 24 వేలు మించకూడదు. జేఈఈ మెయిన్స్‌, నీట్‌ లాంటి కోచింగ్‌లకు ఏడాదికి రూ.20 వేలు మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు.

పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రవాణా సౌకర్యం అందిస్తే...దానికి కిలోమీటరుకు రూ.1.20 వసూలు చేసుకోవచ్చునని నిర్ణయించారు. ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఇతర శిక్షణల పేరిట కూడా ఏ రుసుమూ వసూలు చేయకూడదని ఆదేశించింది.

ఫీజుల పీటముడి

వసూలు చేసిన ఫీజులలో వేతనాలకు ఎంత ఖర్చ చేయాలంటే..

ప్రైవేట్ స్కూల్స్, కాలేజేస్ లో గరిష్ఠంగా ఎంత ఫీజు వసూలు చేయాలనే నిర్ణయంతో పాటు...ఆ వసూలు చేసిన ఫీజులను ఏ పనులకు వినియోగించాలో కూడా ప్రభుత్వం చెప్పింది.

వసూలు చేసిన ఫీజుల్లో 50 శాతాన్ని టీచర్లు, నాన్ టీచింగ్ స్టాప్ వేతనాలకు, మరో 15 శాతాన్ని గ్రాట్యుటీ, పీఎఫ్‌, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌కు ఖర్చు చేయాలి. అలాగే మరో 20 శాతం ఫీజును పాఠశాల లేదా కళాశాల అభివృద్ధికి వినియోగించాలి.

అలాగే అయా విద్యాసంస్థల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్లు వివరాలతో పాటు...విద్యార్హతలు, వారికి ఇస్తున్న జీతాలు అన్నింటినీ ఎప్పటికప్పుడు విద్యాశాఖకు సమర్పించాలి.

వసూలు చేస్తున్న ఫీజులు, వాటి ఖర్చు వివరాలు అయా విద్యాసంస్థల వెబ్ సైట్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు..ఇరువురిని దృష్టిలో పెట్టుకుని ఫీజులపై నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ చెప్తోంది.

అమలు బాధ్యత ప్రభుత్వానిదే....

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల పట్ల చాలా మంది తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ జీవోలు అమలు అయినప్పడే ఉపయోగమని...ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు ఈ జీవోను అమలు చేయడానికి సుముఖంగా లేవని చెబుతున్నారు. తాము ఎప్పటీలాగే ఫీజులు కడుతున్నామని చెప్పారు.

"జీవో ప్రకారం ఫీజులు కడతామంటే...కుదరదని చెప్తున్నారు. మీరు కట్టే ఫీజులు మాకు అద్దె డబ్బుకు కూడా సరిపోవని స్కూల్ సిబ్బంది అంటున్నారు. పైగా కోర్డులో కేసు వేశాం. అది తేలిన తర్వాత కోర్టు చెప్పినట్లు చేస్తాం. అప్పటివరకూ, పాత విధానంలోనే ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అందుకే, చేసేది లేక ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టేశాను" అని కె. మునీంద్ర బీబీసీతో చెప్పారు.

మునీంద్ర ఒక నగల దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కూతురు ఒక ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతోంది.

"ఫీజు కట్టకపోతే రానివ్వమని మా అమ్మాయి చదువుతున్న స్కూల్ యాజమాన్యం చెప్పింది. అసలే పదోతరగతి, చదువు పాడవుతుందని ఫీజు కట్టాల్సి వచ్చింది. ప్రభుత్వ జీవో ఇవ్వడమే కాదు, దానిని కఠినంగా అమలు చేసే బాధ్యతను కూడా తీసుకోవాలి" అన్నారు.

మరిన్ని స్కూళ్లు మూతపడతాయ్

జీవో 53, 54లపై ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు అసంతృప్తితో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యాసంస్థలు నడపలేమని అంటున్నాయి. అవసరమైన వనరులతో, విద్యార్థులకు సౌకర్యాలన్నీ కల్పిస్తూ స్కూళ్లు, కాలేజీలు నిర్వహించాలంటే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు ఏ మూలకూ రావని చెబుతున్నాయి.

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు బాగున్నట్లు కనిపిస్తున్నా, వాస్తవానికి అవి ఉపయోగకరంగా లేవని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ఎన్ మూర్తి అన్నారు. కరోనా వల్ల చాలా స్కూల్స్ మూతపడ్డాయని, ఫీజులు వసూలు కాలేదని చెప్పారు.

"అన్ని పాఠశాలలకు, కళాశాలలకు ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని కాకుండా, అయా పాఠశాలలను బట్టి ఫీజులు వర్గీకరిస్తే బాగుండేది. పదో తరగతి విద్యార్థి గరిష్టంగా కట్టే ఫీజు రూ. 18 వేలు. పదో తరగతికి పాఠాలు చెప్పే టీచర్లకు కనీసం నెలకు రూ. 15 వేలు జీతం ఇవ్వాలి. అలాగే ఆరుగురు ఉపాద్యాయులు ఉండాలి. 50 మంది విద్యార్థులున్న పదోతరగతి క్లాసు రూంకి ఎంత ఫీజు వసూలవుతుంది. టీచర్ల జీతాలు, నిర్వహణ ఖర్చులు, పాఠశాల అద్దెలు అన్నీ కలుపుకుంటే అప్పులే మిగుల్తాయి" అన్నారు.

ఫీజులపై తాము కాంప్రమైజ్ అయితే విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయని విశాఖలోని ఒక కార్పోరేట్ కళాశాలలో మేనేజర్‌గా పని చేస్తున్న కె.బంగార్రాజు చెప్పారు.

"విద్యా సంస్థ అంటే అనేక రకాల సౌకర్యాలు కల్పించాలి. భవనాల అద్దెలే లక్షల్లో ఉన్నాయి. ఈ పోటీ ప్రపంచంలో ఒక్కో విద్యార్థిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదువు చెప్పాలి. అలాగే టెక్నికల్‌గా కూడా పిల్లలకు అన్నిరకాల సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యాసంస్థలు నిర్వహించడం ఎలా సాధ్యం..? మాకు నిర్వహణ ఖర్చులు కూడా రావు" అని ఆయన తెలిపారు.

కాలేజీ ఫీజులు

ఏ విధంగా తక్కువో చెప్పాలి...

ప్రభుత్వ నిర్ణయాన్ని తల్లిదండ్రులు స్వాగతిస్తున్నారని ఏపీఎస్ఈఆర్ఎంసీ చైర్మన్ ఆర్.కాంతారావు అన్నారు. కమిషన్‌ నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, అధిక ఫీజులు వసూలుచేసే సంస్థలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

"ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సరిపోవని ఏదైనా పాఠశాల, కళాశాలకు అనిపిస్తే, ఫీజులు పెంచాలని కోరుతూ కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ విద్యాసంస్థలో ఫీజుల వసూళ్లు, ఖర్చుల వివరాలతో ఒక రిపోర్టు తయారు చేసి కమిషన్‌కు ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తమకు ఏ విధంగా సరిపోవడం లేదో కూడా అందులో తెలియజేయాలి. ఆ దరఖాస్తులను కమిషన్‌ పరిశీలించి, సానుకూల నిర్ణయం తీసుకుంటుంది" అని కాంతారావు తెలిపారు.

ఫీజుల విషయంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఒత్తిడి చేస్తే తల్లిదండ్రులు 9150381111నంబరుకు ఫిర్యాదు చేవచ్చని ఆయన చెప్పారు.

"తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులను మాత్రమే చెల్లించాలి. ఏ సంస్థైనా ఎక్కువ ఫీజులు డిమాండ్‌ చేస్తే.. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషన్‌(రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ క్యాపిటేషన్‌ ఫీ) చట్టం-1983లోని సెక్షన్‌ 9, 10, 11 ప్రకారం ఇంటర్ బోర్డుకు ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంది" అని కాంతారావు స్పష్టం చేశారు.

హైకోర్టులో పిటిషన్

ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 53, 54లపై పలు పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా, ఎలాంటి ముందస్తు అధ్యయనం లేకుండా ప్రభుత్వం ఫీజులు ఖరారు చేసిందని అవి అందులో పేర్కొన్నారు.

ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు జీవోకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీనికి తమకు కొంత గడువు కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కె. రఘవీర్ కోరడంతో కేసు విచారణను సెప్టెంబర్ 2కు వాయిదా వేశారు.

ఫీజులను భారీగా తగ్గించి విద్యరంగంలో కార్పొరేట్ దోపిడీకి సీఎం జగన్ చెక్ పెడుతూంటే, చంద్రబాబు తనకు అనుకూలమైన వారితో కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Do private educational institutions in AP charge the same fees as prescribed by the government? What is happening at the ground level'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X