చికిత్స చెయ్యలేదని డాక్టర్ ను కాల్చి చంపాడు
డెహ్రడూన్: అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి చికిత్స చెయ్యడానికి నిరాకరించిన ఓ డాక్టర్ ను రౌడిషీటర్ కాల్చి చంపిన ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్ లోని ఉద్ధవ్ సింగ్ నగర్ లో డాక్టర్ దారుణ హత్యకు గురైనాడని పోలీసులు చెప్పారు.
స్థానిక ఎస్పీ అనంత్ శంకర్ తక్ వాలే కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్ధవ్ సింగ్ నగర్ కు చెందిన మానిక్ రాఠీకి 18 నెలల కుమారుడు ఉన్నాడు. రాఠీ కుమారుడు కొంత కాలంగా అతిసార వ్యాధితో బాధపడుతున్నాడు.

కుమారుడిని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిగా పని చేస్తున్న ఎస్ కే సింగ్ ఇంటికి వెళ్లాడు. తన కుమారుడికి వైద్యం చేయించాలని డాక్టర్ సింగ్ కు చెప్పాడు. డాక్టర్ సింగ్ వైద్యం చెయ్యడానికి నిరాకరించడంతో ఇతర వైద్యులను సంప్రదించాడు.
అయితే అప్పటికే కుమారుడు మరణించాడని అక్కడి వైద్యులు చెప్పారు. సరైన సమయంలో డాక్టర్ సింగ్ చికిత్స చెయ్యడానికి నిరాకరించడం వలనే తన కుమారుడు మరణించాడని రాఠీ ఆగ్రహించాడు. తుపాకి తీసుకుని డాక్టర్ సింగ్ ను కాల్చి చంపేశాడని పోలీసు అధికారులు తెలిపారు. రౌడీషీటర్ జాబితాలో రాఠీ పేరు ఉందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications