జియోపై అంబానీ కీలక ప్రకటన- డబ్బులు రెడీగా పెట్టుకోండి బాస్: కొత్తగా రిలయన్స్ ఇంటెలిజెన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో ఐపీఓ (Jio IPO) గురించి వెల్లడించారు. దీనిపై ఆయన అధికారికంగా మాట్లాడటం ఇదే తొలిసారి. జియో ఐపీఓ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని ప్రకటించారు. 2026 ప్రథమార్థం నాటికి లిస్టింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ముఖేష్ అంబానీ మాట్లాడారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో జియో తరఫున ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ను దాఖలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోన్నామని స్పష్టం చేశారు. 2026 ప్రథమార్థం నాటికి జియో షేర్లు దేశీయ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతాయని వివరించారు.

ఈ ఐపీఓ అన్నిరకాల పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయమైన అవకాశంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జియో ఆదాయం రూ. 1,28,218 కోట్లుగా నమోదైంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 17 శాతం వృద్ధి సాధించిందీ సంస్థ. ఈబీఐటీడీఏ రూ. 64,170 కోట్ల రూపాయలుగా నమోదైంది.
దేశవ్యాప్తంగా 50 కోట్లమందికి పైగా జియో యూజర్లు ఉన్నారని ముఖేష్ అంబానీ వెల్లడించారు. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడికి మొబైల్, హోమ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ అందించడం, ప్రతి ఇంటికి జియో స్మార్ట్ హోమ్, జియోటీవీ+, జియో టీవీ ఓఎస్, నిరంతర ఆటోమేషన్ వంటి డిజిటల్ సేవలను అందించడం తమ లక్ష్యమని వివరించారు.
ఇందులో- జియో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, ప్రతి మారుమూల గ్రామానికి కూడా డిజిటల్ సేవలను అందించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నామని ముఖేష్ అంబానీ తెలిపారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి జియో నాంది పలుకుతుందని అన్నారు.
AI Everywhere for Everyone.. అనే నినాదంతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సేవలను అన్ని రంగాలకూ విస్తారంగా అందిస్తామని అంబానీ వ్యాఖ్యానించారు. భారత్ వెలుపల కూడా జియో సేవలను విస్తరింపజేయడానికి అన్ని చర్యలు తీసుకుంటోన్నామని చెప్పారు. స్వదేశీ సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
మెటాతో కలిసి ఓ కొత్త AI జాయింట్ వెంచర్‌ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు ముఖేష్ అంబానీ. ఇంధనం, రిటైల్, టెలికాం, మీడియా, మానుఫ్యాక్చరింగ్ రంగంలో ఓపెన్ మోడల్స్, ఏఐ టూల్స్ తో అనుసంధానిస్తామని, ఎంటర్‌ప్రైజ్-రెడీ AIని అందించడానికి మెటాతో ఒక ప్రత్యేక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
దీని కోసం రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరుతో ఓ కొత్త సంస్థను నెలకొల్పబోతోన్నామని ముఖేష్ అంబానీ ప్రకటించారు. దీన్ని మరింత డెవలప్ చేయడానికి మెటాతో పాటు గూగుల్ సహకారాన్ని తీసుకుంటోన్నట్లు చెప్పారు. తొలిదశలో పారిశ్రామిక రంగంలో దీన్ని విస్త్రతం చేస్తామని, క్రమంగా అన్ని సేవలకూ దీన్ని వినియోగించుకునేలా చర్యలు చేపడతామని అన్నారు.












Click it and Unblock the Notifications