• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్రౌపది ముర్ము: గిరిజన, దళిత వ్యక్తి లేదా ఒక మహిళ రాష్ట్రపతి అయితే సమాజంపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ద్రైపది ముర్ము

ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా జూలై 25న ప్రమాణం చేశారు. ఆమె ఒడిశాకు చెందిన గిరిజన నాయకురాలు.

ద్రౌపది ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక వ్యాసం రాశారు. గిరిజనులకు బీజేపీ చాలా ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆ వ్యాసంలో చెప్పారు.

ఇదివరకు రాష్ట్రపతిగా పనిచేసిన రామ్‌నాథ్ కోవింద్ దళిత గుర్తింపును కూడా బీజేపీ చాలాసార్లు ప్రస్తావించింది. అంతకుముందు ప్రతిభా దేవి సింగ్ పాటిల్.. ''మహిళా గుర్తింపు’’ను కూడా అప్పట్లో యూపీఏ ప్రభుత్వం నొక్కిచెప్పింది.

అయితే, ఇలా ఉన్నత పదవుల్లో ఉండే వారి కులాలు, మతాలు, జెండర్‌ల గుర్తింపుతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమైనా మారతాయా?

ద్రైపది ముర్ము

అత్యున్నత పదవి...

రాష్ట్రపతిని దేశ తొలి పౌరుడు అని అంటారు. ఈ పదవి చేపట్టిన వ్యక్తికి అపరిమిత అధికారాలు ఉండకపోవచ్చు. కానీ, కొన్ని అధికారిక ప్రకియలకు రాష్ట్రపతి ఆమోదముద్ర తప్పనిసరి.

రాష్ట్రపతి అనుమతి లేకుండా ఏ బిల్లూ చట్ట రూపం దాల్చదు. ఆర్థిక బిల్లు మినహా ఏ బిల్లునైనా పున:పరిశీలనకు ఆయన వెనక్కి పంపించొచ్చు. అయితే, ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది.

రామ్‌నాథ్ కోవింద్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్క బిల్లును కూడా ప్రభుత్వానికి తిప్పి పంపలేదు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలతోపాటు అన్నింటిపైనా ఆయన మొదటిసారే ఆమోదముద్ర వేశారు.

నరేంద్ర మోదీ, అమిత్ షా

దళితుల కోసం బీజేపీ ఏం చేసింది?

బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా లాల్ సింగ్ ఆర్య పనిచేస్తున్నారు.

తాజాగా తొలి గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి దక్కడంపై చాలా కథనాలు వస్తున్నాయి. అయితే, దళిత వ్యక్తి రాష్ట్రపతిగా పనిచేసిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమైనా మారాయా? అనే ప్రశ్నను లాల్ సింగ్ ఆర్యకు బీబీసీ అడిగింది.

దీనికి సమాధానంగా లాల్ సింగ్ ఆర్య పెద్ద జాబితాను బీబీసీ ముందు ఉంచారు.

''ముందుగా దళితుల్లో ఆత్మగౌరవం పెరిగిందని విషయాన్ని మనం గుర్తించాలి’’అని ఆయన చెప్పారు.

''ఇదివరకెన్నడూ లేని స్థాయిలో దళితులకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయి. నేడు దాదాపు 30 నుంచి 35 శాతం మంది దళితులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఒకవేళ ఇదివరకే ప్రభుత్వ పథకాలు దళితులకు చేరువయ్యుంటే.. స్వచ్ఛభారత్, గృహ కల్పన, ఆయుష్మాన్ యోజన లాంటి పథకాలను మోదీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు’’అని ఆయన అన్నారు.

''ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో 12 మంది దళిత మంత్రులు ఉన్నారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఇంత స్థాయిలో దళితులకు ప్రాధాన్యం దక్కలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలోనూ ఆరుగురు దళితులకు మంత్రి పదవులు దక్కాయి’’అని ఆయన వివరించారు.

''2018-19లో నలుగురు దళిత నేతలను రాజ్యసభకు బీజేపీ పంపించింది. మరో నలుగురు షెడ్యూల్ కులాలకు చెందిన వారిని రాజ్యసభకు నామినేట్ చేసింది’’అని ఆయన చెప్పారు.

భారతీయ జనతా పార్టీ

''పార్టీలో పదవులను కూడా బీజేపీ దళితులకు కేటాయిస్తోంది. దళితులు ఆధిక్యంగా ఉండే జిల్లాల్లో ముగ్గురు ప్రధాన కార్యదర్శుల్లో ఒక పదవిని దళితులకు కేటాయిస్తోంది’’అని ఆయన తెలిపారు.

''దళిత నాయకుడైన బీఆర్ అంబేడ్కర్‌కు బీజేపీ ఐదు స్మారకాలను నిర్మించింది. కాంగ్రెస్ ఒక్క స్మారకాన్ని కూడా నిర్మించలేదు. మొదట మేం అంబేడ్కర్ పుట్టిన చోటైన మహూలో స్మారకాన్ని ఏర్పాటుచేశాం. దిల్లీలోని 26 అలీపుర్ రోడ్‌లో ఒక స్మారకం నిర్మించాం. నాగ్‌పుర్‌లోని దీక్ష భూమిలో ఒక స్మారకం, ముంబయిలోని చైత్రభూమిలో మరొకటి, లండన్‌లో ఇంకొకటి నిర్మించాం. అంబేడ్కర్ జీవించిన ప్రతిచోటా ఆయనకు స్మారకం కట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది’’అని ఆయన అన్నారు.

''ఈ పనులేవీ మేం తూతూమంత్రంగా చేయలేదు. ఇదివరకటి ప్రభుత్వాలు కేవలం ప్రకటనలు చేసి.. పనులు చేయడం మానేశాయి. కానీ, మేం అలా కాదు. క్షేత్రస్థాయిలో పనిచేశాం’’అని లాల్‌సింగ్ చెప్పారు.

అయితే, ఈ పనులకు క్రెడిట్‌ను ప్రధాన మంత్రికి ఇవ్వాలా లేక రాష్ట్రపతికా? ఈ ప్రశ్నకు లాల్ సింగ్ స్పందిస్తూ.. ''ప్రభుత్వానికి అధిపతి రాష్ట్రపతి. ఆయన పేరు మీదే అన్ని పనులు చేస్తారు. 'మా ప్రభుత్వం ఈ పని చేసింది’అని పార్లమెంటులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పేవారు’’అని ఆయన వివరించారు.

దళితుల స్థితిగతులు...

భారత్‌ జనాభాలో దళితుల వాటా 16.6 శాతం వరకు ఉంటుంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణాలలో దళితుల వాటా 20 శాతం కంటే ఎక్కువే ఉంది.

దళితులపై జరుగుతున్న నేరాలపై ఎన్‌సీఆర్‌బీ ఒక నివేదిక విడుదల చేసింది. గత ఐదేళ్లలో కేవలం 2018లో మాత్రమే వారిపై నేరాలు తగ్గినట్లు దీన్ని పరిశీలిస్తే తెలుస్తుంది.

మరోవైపు దళితుల్లో నిరుద్యోగం, విద్య గణాంకాలు కూడా గత ఐదేళ్లలో పెద్దగా మారలేనట్లు తెలుస్తుంది. కానీ, గత ఐదేళ్లలో ఓటింగ్ సరళిలో మాత్రం మార్పు కనిపిస్తోంది.

దళితుల్లో బీజేపీ ప్రాతినిధ్యం...

దళితుల పార్టీగా చెప్పుకునే బహుజన్ సమాజ్‌పార్టీ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. ఒకప్పుడు ఈ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.

మరోవైపు దేశ వ్యాప్తంగా 84 లోక్‌సభ స్థానాలను షెడ్యూలు కులాలకు రిజర్వు చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వీటిలో 40 చోట్ల బీజేపీ గెలిచింది.

అయితే, 2019లో జరిగిన ఎన్నికల్లో మరో 5 స్థానాల్లో బీజేపీ గెలిచింది. దీంతో లోక్‌సభలో ప్రస్తుతం బీజేపీ నుంచి 45 మంది దళిత ఎంపీలు ఉన్నారు.

ప్రతిభా పాటిల్

కాంగ్రెస్ ఎక్కడుంది?

ప్రతిభా దేవి సింగ్ పాటిల్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే సమయంలో కాంగ్రెస్ కూడా ఇలాంటి రాజకీయాలకు పదునుపెట్టింది.

మహిళగా ఆమె గుర్తింపు గురించి అప్పట్లో తరచూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడేవారు. అయితే, మహిళల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదాన్ని ఆ పార్టీ కూడగట్టడలేకపోయింది. ఈ నంబర్ల గేమ్‌లో యూపీఏ పూర్తిగా విఫలమైందని విమర్శకులు అన్నారు.

మరోవైపు అదే సమయంలో మహిళల కోసం తమ పార్టీ, ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నాయని బీజేపీ నాయకులు కూడా పదేపదే చెబుతున్నారు. ఉజ్వల పథకం కానీ లేదా అందరికీ ఇల్లు పథకంలో మహిళల పేరిట పట్టాలు సహా.. అన్నింటా మహిళలకు పెద్దపీట వేసినట్లు వివరిస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీకి లోక్‌సభలో ఆధిక్యం కంటే ఎక్కువ ఎంపీల మద్దతు ఉంది. అయినప్పటికీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ముందుకు తీసుకెళ్లడం లేదు.

''కొన్ని విషయాల్లో ఒకరకమైన రాజకీయ వాతావరణం ఉండాలి. అన్నిపార్టీలు కలిసి పనిచేయాలి. ఈ దిశగా మేం పనిచేయడం మొదలుపెట్టాం’’అని లాల్ సింగ్ చెప్పారు.

ద్రైపది ముర్ము

గుర్తింపు రాజకీయాలతో ప్రయోజనం ఉండదు – దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్ దేశ్‌పాండే విశ్లేషణ


ఇలాంటి గుర్తింపు రాజకీయాలతో క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రయోజనం ఉండదు.

అయితే, దీని వల్ల ఎవరికీ అసలు ఉపయోగం ఉండదని అనుకోకూడదు. దేని లెక్కలు దానికే ఉంటాయి.

రాష్ట్రపతి పదవి విషయానికి వస్తే, ఇది ఏ వర్గానికి కేటాయించినా.. క్షేత్రస్థాయిలో మనకు ప్రభావం కనిపించదు.

అయితే, ఈ రాజకీయాలకు మరో కోణం కూడా ఉంది. దేశంలోని హిందూత్వ రాజకీయాల్లో కులం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్నిసార్లు నేరుగా కులం పేరును ప్రస్తావించకపోవచ్చు. కానీ, హిందూత్వ రాజకీయాల్లో పరోక్షంగా దీని ప్రభావం చాలా ఉంటుందని నేను చెప్పగలను.

మనం ఒక కులానికి చెందిన వారిమని భావించినప్పుడు.. మన కంటే పైనున్న వారు లేదా కిందున్న వారిపై మన గుర్తింపు ఆధారపడుతుంది. మిగతావారు మనల్ని ఎలా చూస్తారు అనే దానిపై ఈ కులం అనేది ఆధారపడుతుంది. ఒకసారి కిందున్న, పైనున్న వారి మధ్య దూరం తగ్గినప్పుడు.. కులం గుర్తింపు అదే పోతుంది.

అయితే, హిందూత్వ రాజకీయాలు చేసేవారు అన్ని కులాలకు చెందిన వారినీ హిందువులుగానే చూడాలని పదేపదే చెబుతుంటారు. అయితే, మధ్య, ఎగువ కులాలకు చెందిన వారు.. తక్కువ కులాల వారిని ఆమోదించకపోవచ్చు. ఒక్కోసారి కులాల గుర్తింపు కూడా హిందూత్వ రాజకీయాలకు అడ్డుగా మారొచ్చు.

అయితే, దళితులు, ఆదివాసీలకు ఉన్నత పదవులు ఇవ్వడం లేదా దళితులకు సంబంధించిన ఒక ముఖ్యమైన రోజును సెలవుగా ప్రకటించడం లాంటి చర్యలతో దిగువ, మధ్యతరగతి కులాల వారిని కూడా హిందూత్వ రాజకీయాల్లో కలుపుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇది మరింత ఎక్కువైంది. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం దీని వల్ల ప్రభావం కనిపించకపోవచ్చు.

అందుకే దీన్ని గుర్తు చేసేందుకు అమిత్ షా కథనం రాయాల్సి వచ్చింది. మేం మీ కులాల వారి కోసం ఇది చేశామని చెప్పుకునే ప్రయత్నంగా దీన్ని చూడాలి.

గుర్తింపు రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత జటిలమైనది. ఎందుకంటే వీరు ఏదో ఒక వర్గానికి చెందిన వారని మనం చెప్పలేం. ఎందుకంటే మన దేశం భిన్న కులాలు, మతాలుగా విడిపోయి ఉంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకమైన గుర్తింపు ఉండే ఉంటుంది.

గుర్తింపు రాజకీయాలు అన్నిసార్లూ చెడ్డవని చెప్పుకోవడానికీ వీల్లేదు. కొందరు మహిళా సర్పంచ్‌లు మెరుగ్గా తమ గ్రామాల కోసం పనిచేస్తున్నట్లు మనం వార్తలు చూస్తుంటాం. పంచాయతీ ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.

దళితులు, గిరిజనుల వెనుకబాటును ఎలా అంచనా వేస్తున్నామో అదే విధంగా వారిలో సంతోష స్థాయిలను కూడా మనం అంచనా వేయాలి. తమ వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నత పదవులు చేపట్టినప్పుడు తమకు ఎంత వరకు ప్రయోజనం ఉంటుందో వారిని అడిగి నేరుగా తెలుసుకోవాలి.

నిజంగా మార్పువచ్చినా.. అది కేవలం గుర్తింపు రాజకీయాల వల్లే వచ్చిందని భావించకూడదు. ఒక దళితుడు రాష్ట్రపతి అవ్వడం వల్లే దళితుల స్థితిగతులు మెరుగుపడ్డాయని నిరూపించడం అసాధ్యం.

అదే సమయంలో ఒకవేళ ఎలాంటి మార్పు లేకపోతే... దళితుడు రాష్ట్రపతి కాకపోవడం వల్లే వారి స్థితిగతులు మెరుగుపడలేదని భావించకూడదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Draupadi Murmu: What would be the impact on society if a tribal, Dalit person or a woman becomes President?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X