రక్షణ శాఖ అమ్ముల పొదిలో కొత్త అస్త్రం..అగ్ని ప్రైమ్: స్పెషాలిటీస్ ఇవే: అణ్వాయుధాలు సైతం
భువనేశ్వర్: దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. అగ్ని సిరీస్‌లో రూపొందించిన కొత్త తరహా క్షిపణిని డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ షార్ట్‌రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌కు అగ్ని ప్రైమ్‌గా పేరు పెట్టారు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధికారులు. ఒడిశా సమీపంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్‌ను డీఆర్డీఓ అధికారులు దీన్ని విజయవంతంగా పరీక్షించారు.
1,000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది ఈ బాలిస్టిక్ మిస్సైల్‌కు. 1000 కిలోల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలుగుతుంది. అణ్వాయుధాలను తీసుకెళ్లే సామర్థ్యం గల క్షిపణుల్లో ఇది మొదటిది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్‌లోని టెస్ట్ ఫైర్ కేంద్రంలో ఈ ఉదయం 10:55 నిమిషాలకు దీన్ని పరీక్షించామని అన్నారు. ఈ క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించినట్లు నిర్ధారించారు. క్షిపణి గమనాన్ని ఈస్టర్న్ కోస్ట్ మీదుగా ట్రాక్ చేశామని పేర్కొన్నారు.

అంచనాలకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలతో ఇది నిర్దేశిత లక్ష్యాన్ని.. నిర్దేశించిన షెడ్యూల్‌లోనే ఛేదించినట్లు చెప్పారు. రెండురోజుల కిందటే డీఆర్డీఓ అత్యాధునికమైన పినాకా రాకెట్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. ఒడిశాలోని చాందీపూర్‌లో గల టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. మొత్తం 25 పినాకా రాకెట్లను మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ల సహాయంతో ప్రయోగించింది. అవన్నీ కూడా వేర్వేరు రేంజ్‌లల్లో నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2డీజీ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది డీఆర్డీఓ. ఒకవైపు ప్రాణాంతక వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన మెడిసిన్‌పై దృష్టి సారిస్తూనే.. మరోవంక ఆయుధ సంపత్తిని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. 2డీజీ డ్రగ్‌ను కరోనా వైరస్ పేషెంట్లకు అందజేసే వైద్యంలో వినియోగిస్తారు. ప్రస్తుతం దీన్ని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ తయారు చేస్తోంది. కమర్షియల్ అవసరాల కోసం త్వరలోనే దీన్ని మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకుని రానుంది.












Click it and Unblock the Notifications