తప్పతాగి.. కేంద్ర మంత్రికే తప్పుడు ట్వీట్.. రివర్స్ అయి జైలుకు
తాగిన మత్తులో రైల్వే టిక్కెట్ ఎగ్జామినర్ పై కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకే తప్పుడు ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి జైలుపాలయ్యాడు.
న్యూఢిల్లీ: తాగిన మత్తులో కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు తప్పుడు ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి జైలుపాలైన ఉదంతమిది. మధ్యప్రదేశ్ లోని దేవాస్ కు చెందిన ప్రయాస్ తరావీ అనే వ్యక్తి ఆదివారం రాత్రి రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ట్వీట్ చేశాడు.
భింద్-ఇండోర్ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో టిక్కెట్ ఎగ్జామినర్(టీటీఈ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)కు చెందిన సిబ్బంది తనతో తప్పుగా ప్రవర్తించారనేది అతడి ఫిర్యాదు. దీనిపై సత్వరమే స్పందించిన కేంద్ర మంత్రి ప్రభు... భోపాల్ లోని ఆర్పీఎఫ్ కమాండెంట్ కు ఆ ఫిర్యాదును బదిలీ చేశారు.
దీంతో ఆర్పీఎఫ్ ఎస్సై గోపాల్ మీనా వెంటనే రంగంలోకి దిగి శివపురి వద్ద రైలులో తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రయాస్ తరావీ చేసిన ఫిర్యాదు తప్పు అని తేలింది. పైగా ఆ సమయంలో అతడు బాగా తాగి ఉన్నాడని విచారణలో రుజువైంది.

అంతేకాకుండా రైలులోని సహ ప్రయాణికుల పట్ల అతడు తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో సహ ప్రయాణికుల వాంగ్మూలం మేరకు తరావీపై కేసు నమోదు చేసి, అతడ్ని అరెస్టు చేసినట్లు ఆర్పీఎఫ్ ఎస్సై గోపాల్ మీనా తెలిపారు.
మద్యం మత్తులో ఉన్న ఆయనను టిక్కెట్ చూపించాలని టీటీఈ కోరినా అతడు ఖాతరు చేయలేదని, పైపెచ్చు తనతో టీటీఈ తప్పుగా ప్రవర్తించినట్లు అతడు రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడని, తీరా విచారణ జరిపితే తప్పు అతడిదేనని తేలిందని మీనా వెల్లడించారు.












Click it and Unblock the Notifications