ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం: మోడీ ఫోన్, కదిలిన సీతారామన్ గది
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో నలుగురు మృతి చెందగా 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మణిపూర్ రాజధాని ఇంపాల్ సమీపంలో భూకంపం సంభవించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో భవనాలు కూలి ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇంపాల్‌లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఇంపాల్‌కు 33 కిలోమీటర్ల దూరంలో, టామెంగ్లాంగ్ జిల్లాలో 17 కి.మీ లోతున భూకంపకేంద్రం ఉన్నట్టు గుర్తించారు.
పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బంగ్లాదేశ్‌లలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కాగా, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, అరుణాచల్ ప్రదేశ్ సీఎం నబమ్ టుకి ప్రధాని నరేంద్రమోడీ ఫోన చేశారు. భూకంప తీవ్రత సహాయక చర్యలను అడిగి తెలుసుకన్నారు.

బెంగాల్‌లో తాను బస చేసిన సిలిగురిలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్లో సైతం ప్రకంపనలు వచ్చాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ఈశాన్య రాష్ట్రాల్లోని కాఫీ తోటలను పరిశీలించేందుకు అక్కడి పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు నిన్న వెళ్లారు.
సరిగ్గా భూకంపం సంభవించిన సమయంలో ఆమె పశ్చిమబెంగాల్ లోని సిలిగురిలోనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న సీతారామన్, భూకంపం ప్రభావంతో తానున్న చోటు కూడా కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు.
దీనిపై నిర్మలా సీతారామన్ వెనువెంటనే ట్విట్టర్లో స్పందించారు. భూకంపం కారణంగా తానున్న గది కూడా కదిలిపోయిందని ఆమె పేర్కొన్నారు. ‘‘సిలిగురిలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో నేను ఉన్న గది కూడా కంపించిపోయింది. అంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా'' అంటూ ఆమె ట్వీటారు.
Felt my room shake, in Siliguri government guest house! Hope everyone is ok. #tremor.
— Nirmala Sitharaman (@nsitharaman) January 3, 2016 











Click it and Unblock the Notifications