• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తూర్పు గోదావరి జిల్లా: ‘నాడు టీడీపీ-నేడు వైసీపీ.. దళితుల అసైన్డ్ భూముల్లో అక్రమ మైనింగ్.. న్యాయం చేయని జిల్లా అధికారులు’

By BBC News తెలుగు
|
Google Oneindia TeluguNews
అసైన్డ్ భూముల్లో తవ్వకాలు

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన పడాల కుమారి తండ్రికి రామేశంపేటలో ఒక ఎకరా 35 సెంట్లు భూమి ఉండేది. ఆ అసైన్డ్ భూమిని ఆమె తండ్రికి ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చారు.

ఆమె ఒక్కర్తే కూతురు. దాంతో, ఆ భూమి ఆమెకే వారసత్వంగా దక్కింది.

వారికి జీడితోట ఉండేది. దుంపసాగు చేసేవారు.

కానీ, ఆ భూమిని ఫలసాయానికి ఇచ్చిన వ్యక్తితో మైనింగ్ కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకుని తమకు తెలియకుండా తవ్వేసినట్లు పడాల కుమారి బీబీసీకి చెప్పారు.

పెద్దాపురం మండలంలోని రామేశంపేటలో ఉన్న మెట్టలపై ఆమెకు వారసత్వంగా వచ్చిన అసైన్డ్ భూమి ఇప్పుడు గ్రావెల్ మైనింగులో తవ్వేయడంతో ఆమె తల్లడిల్లిపోతున్నారు.

"ఈ పంటల ద్వారా ఏడాదికి రూ. 40 నుంచి 50 వేల ఆదాయం వచ్చేది. భూమిని తవ్వడాన్ని చాలాసార్లు అడ్డుకున్నాం. కానీ మాపైనే తిరగబడ్డారు. అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాం కానీ ఫలితం లేదు. అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు తవ్వుకున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్లు తవ్వేస్తున్నారు" అని అంటున్నారు పడాల కుమారి.

ఆమె స్వయంగా జిల్లా ఎస్పీని, ఆర్డీవోని కలిసినా న్యాయం జరగలేదంటున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు కూడా నమోదు చేయలేదని బీబీసీకి తెలిపారు.

ఈ సమస్య కేవలం పడాల కుమారి ఒక్కరిదే కాదు. ఇలాంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు. కొందరిని బెదిరించి, మరికొందరికి కొంత మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి మొత్తంగా కొండలను తొలిచేసే ప్రక్రియ అయితే నేటికీ సాగుతోంది.

అసైన్డ్ భూముల్లో తవ్వకాలు

తవ్వకాలెప్పుడు మొదలయ్యాయి?

ఈ తవ్వకాల వ్యవహారం 8 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో మొదలయింది. అప్పట్లో వైసీపీ దానిని అక్రమమంటూ తప్పుబట్టింది. సీపీఎంతో సహా కొన్ని పార్టీలు ఆందోళనలకు పూనుకున్నాయి. ఆ తర్వాత అధికారులు కదిలారు. అక్రమ తవ్వకాలు జరిగినట్టు నిర్ధరించారు. జేసీబీలతో సహా కొన్ని వాహనాలను కూడా సీజ్ చేశారు. కానీ మైనింగ్ కొనసాగుతూనే ఉంది.

బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కొండలన్నీ తొలిచేస్తున్నట్టు స్పష్టంగా కనిపించింది. పంటల కోసం వేసిన బోర్లు, విద్యుత్ సరఫరా కోసం ఉన్న స్తంభాలు మినహా విలువైన చెట్లతో సహా అన్నింటినీ నేలమట్టం చేస్తున్నట్టు కనిపించింది.

అనుమతులు లేకుండానే..

పెద్దాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న రామేశంపేట, ఆనూరు, వాలు తిమ్మాపురం, సూరంపాలెం గ్రామాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న మెట్టల్లో ఇప్పుడు సగం పైగా మాయమయ్యాయి.

ఇందిరాగాంధీ హయాంలో ఆ మెట్ట ప్రాంతాల్లో సాగు చేసుకునేందుకు సమీప గ్రామాల్లో ఎస్సీలకు చెందిన 800 కుటుంబాలకు పట్టాలిచ్చారు. ఎకరా 35 సెంట్లు చొప్పున అసైన్డు భూములు వారికి అప్పగించారు. అప్పటి నుంచి మెట్ట భూములను సాగులోకి తెచ్చి జీడి, మామిడి లాంటి వివిధ తోటలు పెంచారు. కర్రపెండలం దుంప సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఏడేళ్ల క్రితం 100 ఎకరాల్లో మెస్సర్స్ శ్రీ సత్యా మైనింగ్ అండ్ మల్టి పర్పస్ వూక్ సొసైటీ లిమిటెడ్ అనే సంస్థ తరుపున మైనింగ్‌కి అనుమతి కోరారు. అటవీ, భూగర్భ గనులు, పర్యావరణ, రెవెన్యూ శాఖల పరిశీలన తర్వాత 64.075 ఎకరాలలో గ్రావెల్ తవ్వకాలకు అధికారిక అనుమతులు వచ్చాయి.

కానీ 2015 నుంచి ఇప్పటి వరకూ జరిపిన తవ్వకాలు పరిశీలిస్తే దాదాపుగా 300 ఎకరాల పైబడి తవ్వేసినట్టు కనిపిస్తోంది. అంటే అనుమతులున్న దానికి ఐదారు రెట్లు మెట్టను తవ్వేసినట్టు చెప్పవచ్చు. అయితే, ప్రస్తుతం ఈ కంపెనీ ఇక్కడ తవ్వకాలు జరపట్లేదు.

ఎర్రమట్టి దిబ్బలు

అనుమతులివ్వడమే చట్ట విరుద్ధం

"దళితులకు జీవనోపాధి కోసం ఇచ్చిన అసైన్డ్‌ భూములవి. అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 9/77 ప్రకారం వాటిని అమ్మడం, కొనడం చట్టవిరుద్ధం. కానీ జిఒ 2/2013ను చూపించి లీజు పేరుతో తవ్వకాలకు అనుమతిచ్చారు. ఎస్సీలకు చెందిన అసైన్డ్ ల్యాండ్స్ ను కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. దీనిపై కొందరు కోర్టుకి కూడా వెళ్లారు. సాగుదారుల అనుమతి లేకుండా తవ్వకాలు జరపడం పట్ల ఇన్‌జన్‌క్షన్ ఆర్డర్ కూడా ఉంది. అయినా గ్రావెల్ తరలింపు ఆపలేదు. గ్రావెల్ పేరుతో 50 అడుగుల ఎత్తులో ఉండే కొండలను తవ్వేశారు. భూమిలో కూడా మరో పది అడుగుల లోతు వరకూ తవ్వకాలు జరిపి చెరువుల్లా మార్చేశారు. కొండల స్థానంలో ఇప్పుడు చెరువులు కనిపిస్తున్నా అధికారులు కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారని" రామేశంపేట కు చెందిన ఎం రామకృష్ణ బీబీసీతో అన్నారు.

అనుమతులకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నట్టు గతంలో అధికారులు నిర్ధరించారు.

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన మురళీధర్ రెడ్డి, జేసీలుగా పనిచేసి ప్రస్తుతం సీఎంవోలో ఉన్న రేవు ముత్యాలరాజు సహా అనేకమంది ఐఏఎస్ అధికారులు మైనింగ్ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. పెద్దస్థాయిలో జరుగుతున్న ఈ తవ్వకాలను తప్పుబట్టారు.

పరిధికి మించి, నిబంధనలను ఉల్లంఘించి తవ్వేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఐదారేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వస్తున్నప్పటికీ నేటికీ తవ్వకాలు మాత్రం నిలుపుదల చేయలేదని తాజా పరిస్థితి చెబుతోంది.

స్వల్పకాలంలోనే భారీగా తవ్వకాలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

పట్టాదారులకు తెలియకుండా పట్టుకుపోయారు..

దాదాపు వెయ్యి ఎకరాల భూమి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న కాలంలో వారందరికీ జీడి తోటలు వేసుకునేందుకు సహాయం అందించారు.

అవన్నీ ఫలసాయం అందిస్తుండడంతో ఏటా వేసవిలో కనీస ఆదాయానికి ఢోకా లేని పరిస్థితి ఏర్పడింది. అంతేగాకుండా బోర్లు ఏర్పాటు చేసుకోవడంతో సాగు పంట పండిస్తూ తమ కుటుంబాలకు ఆర్థిక భరోసాని దక్కించుకున్నామని ఆనూరికి చెందిన ఏడుకొండలు బీబీసీతో చెప్పారు.

"కొండను తవ్వేస్తే మా భూముల పరిస్థితి ఏమిటని అడిగాము. చదును చేసి అప్పగిస్తామన్నారు. కొందరికి ఎకరాకి రూ. 2 లక్షలు, మరికొందరికి రూ. 3లక్షలు చొప్పున ఇచ్చారు. వాటికి ఆశపడి కొందరు సంతకాలు పెట్టగానే తవ్వడం మొదలెట్టారు. 2015 నుంచి ఇప్పటికీ తవ్వుతూనే ఉన్నారు. కొన్ని చోట్ల అసలు భూ యజమానులకు సంబంధం లేకుండానే తవ్వేశారు. తెలిసి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదు. కేసులో ఇన్‌జన్‌క్షన్ ఆర్డర్ ఉన్నా అమలుకావడం లేదు" అంటూ ఏడుకొండలు వాపోయారు.

రోడ్డుకి సమీపంలో ఉండడం, నాణ్యమైన గ్రావెల్ లభించడంతో స్వల్పకాలంలోనే భారీగా తవ్వకాలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

ఇప్పుడు కొండలను తవ్వేసిన తర్వాత ఎకరం 35 సెంట్లు పట్టాలో ఉన్నా భూమి మాత్రం ఎకరం కూడా దక్కడం లేదని ఏడుకొండలు తెలిపారు. ఆ భూమి కూడా సాగుకి పనిచేయకపోవడంతో చాలామంది వలసలు వెళ్లిపోయారని తెలిపారు.

స్వల్పకాలంలోనే భారీగా తవ్వకాలు జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

అరకొర చర్యలతో సరిపెట్టిన అధికారులు

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అప్పటి హోం మంత్రి చినరాజప్ప అండదండలతోనే ఈ మైనింగ్ సాగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కాకినాడ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులే ఎక్కువ మంది కాంట్రాక్టర్లుగా ఉన్నారని సీపీఎం నేత దువ్వా శేషబాబ్జీ ఆరోపించారు.

టీడీపీ హయంలో రామేశంపేట మెట్ట మీద తవ్వకాలు అక్రమం అని వైసీపీ వాళ్లు కూడా ఆందోళన చేశారు. ఇప్పుడు వైసీపీ నేతలే మైనింగ్ చేస్తున్నారు. వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పని సక్రమం అయిపోయిందా అని సీపీఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి శేషబాబ్జీ ప్రశ్నిస్తున్నారు.

"అధికారులు అనేక నివేదికలు ఇచ్చారు. అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని కళ్లకు కనబడుతున్నా చర్యలు మాత్రం లేవు. మధ్యలో వైసీపీ అధికారంలోకి రాగానే రెండుసార్లు దాడులు చేశారు. జేసీబీలు, టిప్పర్లు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. మైనింగ్ తమ చేతుల్లోకి రాగానే సైలెంట్ అయిపోయారు. సాధారణ ఎస్సీ రైతులను మోసం చేసి ఈ మైనింగ్ జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి" అని శేషబాబ్జీ డిమాండ్ చేశారు.

అయితే, రాజకీయంగా గిట్టని వారు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బీబీసీతో అన్నారు.

పెద్దాపురం సమీపంలో జరుగుతున్న మైనింగ్ లో తన పాత్ర లేదని, అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు.

గ్రావెల్ కోసం జరిపిన తవ్వకాలతో ఎర్రమట్టి తప్ప ఏమీ కనిపించడం లేదు.

జేసీ నివేదిక ప్రకారం అదనంగా 150 ఎకరాలు..

2019లో ఆనాటి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వరంలోని కమిటీ ఈ మైనింగ్ పై విచారణ జరిపింది. ఓ నివేదిక కూడా సిద్ధం చేసింది. అప్పటికే అనుమతులు లేని తవ్వకాలు సుమారు 100 ఎకరాలు ఉంటుందని నిర్ధారించారు. వందల కోట్ల ఆదాయం తరలిపోయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అమాయక రైతుల నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని, పంట భూములను గ్రావెల్ క్వారీలుగా మార్చేశారని ఆ నివేదికలో తెలిపారు.

తక్షణం ఈ తవ్వకాలు నిలిపివేయాలని సూచించారు. అప్పట్లో ఏడీబీ రోడ్డు విస్తరణ పనులకు తగ్గట్టుగా బీఎస్సార్‌ సంస్థకి మాత్రమే అవసరాలకు అనుగుణంగా తవ్వకాలు జరుపుకునే వీలుందని తెలిపారు. అయితే ఆ సంస్థ కూడా పరిమితికి మించి తవ్వకాలు జరపిందని స్వయంగా నాటి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడించారు. పెద్దాపురం రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదంతా జరిగిన తర్వాత కూడా అడ్డుకట్టపడలేదు. అక్టోబర్ మొదటివారంలో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన బీబీసీకి తవ్వకాలు జరుపుతూ, గ్రావెల్ తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.

2015 నుంచి ఇప్పటి వరకూ జరిపిన తవ్వకాలు పరిశీలిస్తే దాదాపుగా 300 ఎకరాల పైబడి తవ్వేసినట్టు కనిపిస్తోంది

'చుట్టూ తవ్వేయడంతో మాకేమీ అర్థం కావడం లేదు’

తన భర్త పేరుతో వచ్చిన పట్టా భూమి ఆధారంగా భర్త లేకపోయినా బతుకుతున్నామని, ఇప్పుడు అది కూడా పోతే ఏం చేయాలన్నది పాలుపోవడం లేదని వాలుతిమ్మాపురం గ్రామానికి చెందిన అప్పియమ్మ చెబుతున్నారు.

"ఇందిరమ్మ, ఎన్టీఆర్ కాలంలో పట్టాలు వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇందిరాక్రాంతిపథం పేరుతో మా మెట్ట మీద 70 బోర్లు వేయించారు. పుష్కలంగా నీరు రావడంతో అనేక పంటలు పండించాము. దుంప, బొప్పాయి, నిమ్మ సహా వివిధ పంటలు సాగు చేశాం. కానీ ఇప్పుడు కొందరు రైతులను బెదిరించి, మరికొందరికి ఎంతోకొంత ఆశ చూపించి భూములు తీసేసుకున్నారు. ఇప్పుడు మా చుట్టూ తవ్వేయడంతో మధ్యలో భూములకు నీరు రావడం లేదు, ప్రకృతి దెబ్బతినేసింది. ఇప్పుడు మా భూములు ఏమి చేయాలో కూడా తెలియడం లేదు. ఉంచుదామంటే దారిలేదు. తవ్వకాలకు ఇద్దామంటే ఆ తర్వాత పంటలు లేకపోతే ఎలా గడపాలో తెలియడం లేదంటున్నారు" అప్పియమ్మ.

అసైన్డ్ భూముల తవ్వకాలతో పర్యావరణానికి కూడా హాని జరుగుతోంది.

పర్యావరణానికి ఇదేనా ప్రాధాన్యత?

పర్యావరణానికి జరుగుతున్న హాని గురించి ఎన్ జీటీ దృష్టికి తీసుకుని వెళతామని పర్యావరణ ఉద్యమకారులంటున్నారు.

"ఓవైపు పచ్చదనం కోసం మొక్కలు నాటాలని చెబుతున్నారు. దానికోసం హరితాంధ్రప్రదేశ్ అని, రకరకాల పేర్లతో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. కానీ పెద్దాపురం వంటి మెట్ట ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతానికి ఆనుకుని ఉన్న మెట్లను కొల్లగొట్టేస్తున్నారు. ఈ భూములు అనేక జీవాలకు ఆవాసంగా ఉండేవి. టేకు సహా విలువైన వనాలకు నిలయంగా ఉండేవి. కానీ ఇప్పుడు గ్రావెల్ కోసం జరిపిన తవ్వకాలతో ఎర్రమట్టి తప్ప ఏమీ కనిపించడం లేదు. పంటలు సాగుచేసేందుకు కూడా భూమి అనువుగా లేకపోవడంతో వందల ఎకరాల భూమి పనికిరాకుండా పోతోంది. పర్యావరణానికి తీరని హాని చేస్తున్నట్టు స్పష్టమవుతోంది" అని పర్యావరణ ఉద్యమకారుడు ఎం ఆదినారాయణ అన్నారు.

పెద్దాపురం పరిసరాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో గ్రీనరీ నిర్వహణ సక్రమంగా చేయకపోగా, సహజంగా ఉన్న వనరులను కూడా ఇలా ఇష్టారాజ్యంగా నాశనం చేస్తుండడంపై తాము గతంలోనే కలెక్టర్‌కి ఫిర్యాదు చేశామని ఆయన బీబీసీకి తెలిపారు.

అనుమతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు..

"రామేశంపేట మెట్టలో మైనింగ్ వ్యవహారాలపై చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కూడా స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలించాం. కమిటీ కూడా కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటి ఆధారంగా లీజుదారులపై చర్యలు తీసుకున్నాం. నిబంధనలు పాటించని వారి వాహనాలు, యంత్రాలు సీజ్ చేశాం. ఇప్పుడు మరోసారి పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠినంగా వ్యవహరిస్తాం" అని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మి బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
East Godavari District: ‘TDP-Today YCP .. Illegal mining in Dalit assigned lands .. Unjust district officials’
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X