బీహార్‌లో తొలగించిన 65 లక్షల మంది పేర్లను ప్రకటించిన ఈసీ..!
దేశ వ్యాప్తంగా బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ప్రక్రియను "ఓట్ల చోరీకి కొత్త ఆయుధం"గా ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 65 లక్షల మంది పేర్లను విడుదల చేసింది.
పోలింగ్ బూత్‌లలోని "ASD" (గైర్హాజరు, బదిలీ చేయబడిన, మరణించిన) కేటగిరీల్లో ఉన్న ఓటర్ల వివరాలను ఆగస్టు 19లోపు బహిరంగ పరచాలని, ఆగస్టు 22 నాటికి సమ్మతి నివేదికను దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి అనుగుణంగా EC ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని కూడా తెలిపింది.

కాగా బీహార్‌లో ఓటర్ల భారీ తొలగింపుపై విపక్షాలు మండిపడుతున్నాయి. తొలగించిన ఓటర్ల జాబితాను వెంటనే ప్రజలకు అందుబాటులో పెట్టాలని ఇప్పటికే వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు EC వివరాలు ప్రకటించినా, "ఓట్ల చోరీ" ఆరోపణలను విపక్షాలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ (CEC Gyanesh Kumar)పై అభిశంసన (impeachment notice)కు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ మాట్లాడుతూ.. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే చట్టపరంగా సీఈసీని తొలగించాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం. ప్రస్తుతానికి ప్రతిపక్షాలకు అంతమంది సభ్యులు లేనందున ఈ ప్రయత్నం ఎంతవరకు సాధ్యమవుతుందో అనుమానం వ్యక్తమవుతోంది.
మరోవైపు ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఆందోళన కార్యక్రమం ప్రారంభించగా.. దీనిపై స్పందించిన జ్ఞానేశ్ కుమార్ ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్‌సింగ్ సంధు, వివేక్ జోషీలతో కలిసి మీడియా ముందుకొచ్చారు. రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ, ఆయన తగిన ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ప్రమాణ పత్రం రూపంలో సంతకంతో ఆధారాలు ఇవ్వాలని, లేకపోతే ప్రజల్లో క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఆధారాలు లేకపోతే ఆరోపణలను నిరాధారంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications