బెంగాల్‌లో బీజేపీకి భారీ షాక్ -రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై ఈసీ నిషేధం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊపుమీదున్న బీజేపీకి షాక్ తగిలింది. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్‌పై ఎన్నికల సంఘం 24 గంటల పాటు నిషేధం విధించింది. 24 గంటల పాటు ఆయన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది. ఈ నిబంధన గురువారం రాత్రి 7 గంటల నుంచి శుక్రవారం రాత్రి 7 గంటల వరకూ వర్తిస్తుందని ఈసీ పేర్కొంది.
ఇటీవలే సీఎం మమతా బెనర్జీ ప్రచారంపై నిషేధం విధించిన సందర్భంలో ఈసీపై టీఎంసీ సంచలన ఆరోపణలు చేసింది. ఈసీ ఏకపక్షంగా, బీజేపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని, తామిచ్చిన ఫిర్యాదులపై స్పందించడం లేదంటూ టీఎంసీ లేఖలు కూడా రాసింది. ఈక్రమంలో ఇవాళ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపైనా ఈసీ చర్యలకు దిగడం గమనార్హం.

దిలీప్ ఘోష్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనలను ఉల్లంఘించారని ఈసీ తన నోటీసులో పేర్కొంది. ప్రజలను రెచ్చగొట్టడం, వారి భావోద్వేగాలను తీవ్రంగా ప్రేరేపించే విధంగా దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని, తద్వారా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందని ఈసీ అభిప్రాయపడింది.
బెంగాల్ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ లో కూచ్ బెహార్ ప్రాంతంలో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నాటి కాల్పుల ఘటనను సీఎం మమత ఖండించగా, అదే అంశాన్ని ప్రస్తావిస్తూ... ''''కేంద్ర బలగాలు కేవలం చూపుడు గుర్రాలే అని భావించే వారికి బుల్లెట్ల శక్తి బాగా అర్థమైందని అనుకుంటున్నా. ఇది ప్రారంభమే. కూచ్‌బెహార్ లాంటి ఘటనలు మరికొన్ని ప్రాంతాల్లోనూ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకోవాలని భావించే వారికి షీతల్‌కుచి (కూచ్‌బిహార్) ఘటన గట్టి జవాబు లాంటిది'' అని దిలీప్ ఘోష్ అన్నారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఈసీ చర్యలకు దిగింది.












Click it and Unblock the Notifications