బెంగాల్ సీఎంపై దాడి: ఈసీ సీరియస్ -నివేదికకు ఆదేశం -కోల్‌కతా ఆస్పత్రిలో మమతకు చికిత్స
అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బుధవారం నందిగ్రామ్‌లో జరిగిన దాడి ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తీవ్రంగా పరిగణించింది.

దీదీపై దాడికి సంబంధించిన ఘటనలో శుక్రవారంలోగా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయతోపాటు ప్రత్యేక పోలీసు పరిశీలకుడు వివేక్ దుబే, పశ్చిమ బెంగాల్ ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు అజయ్ నాయక్‌ను సీఈసీ ఆదేశించింది.
బీజేపీ సవాళ్ల నేపథ్యంలో ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీకి దిగిన మమతా బెనర్జీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం ప్రచారం ముగించుకుని కారు ఎక్కుతుండగా, తనపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని, కాలికి బలంగా గాయమైందని, ఛాతీనొప్పి సైతం తనను తీవ్రంగా బాధిస్తున్నదని మమత తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్ర అని ఆరోపించారు. దీనిపై సీఎం ఫిర్యాదు చేయడంతో ఈసీ స్పందించింది.
సాయంత్రం దాడి జరగడానికి ముందు కూడా తనను చుట్టుముట్టే ప్రయత్నం చేశారని, మధ్యాహ్నం నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు తన కారు డోర్‌ను బలవంతంగా నెట్టారని, దీంతో తాను లోపలే ఉండి పోవాల్సి వచ్చిందని మమత తెలిపారు. దాడి నేపథ్యంలో సీఎం మమతను కోల్‌కొతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు

బెంగాల్ గవర్నర్ జగదీప్ దినకర్ ఆసుపత్రికి వచ్చి సీఎంను పరామర్శించారు. కాగా, మమతా బెనర్జీపై ప్రతిపక్షలు విమర్శలు గుప్పించాయి. ఎన్నికల వేళ దాడి పేరుతో సానుభూతి కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, లోక్ సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువు నేతలు దీదీపై దాడిని ఖండించారు.












Click it and Unblock the Notifications