IT, ED Raids: తమిళనాడులో సినీ, రాజకీయ ప్రముఖల ఇళ్లలో ఈడీ, ఐటీ సోదాలు..
తమిళనాడులో పలు ప్రాంతాల్లో ఐటీ, ఈడీ దాడులు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నిందితుడు జాఫర్ సాదిక్‌తో సంబంధం ఉన్న వారి ఇళ్లలో 35 చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించింది. ఉదయం 7 గంటలకు సోదాలు ప్రారంభమయ్యాయి. ఈడీ(ED) బృందాలు శాంతోమ్‌లోని జాఫర్ సాదిక్ ఇంటికి చేరుకున్నాయి. జాఫర్ సాదిక్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఇటీవల ఢిల్లీలోని ఎన్‌సీబీ విచారించిన సినీ దర్శకుడు అమీర్ కార్యాలయంలోనూ టీ నగర్‌లో సోదాలు జరిగాయి.
కొడుంగయ్యూర్, కిల్పాక్, రాధాకృష్ణన్ సలైలో సోదాలు జరిగాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు సూడోఎఫెడ్రిన్ స్మగ్లింగ్ ఆరోపణలపై జాఫర్ సాదిక్, మరికొంత మందిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కేసు ఆధారంగా ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఎన్సీబీ ఢిల్లీలోని ఒక గోడౌన్‌లో 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకుంది. జాఫర్ సాదిక్ అతని సన్నిహితుడు సదానందంతో సహా ఐదుగురిని అరెస్టు చేసింది.

ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ పీఎంఎల్ చట్టం కింద ప్రత్యేక కేసు నమోదు చేసింది. సినిమా, హాస్పిటాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారవేత్తగా పేరు పొందిన జాఫర్ సాదిక్ డీఎంకే ఎన్నారై విభాగంలో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అయితే, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో అతని ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో సాదిక్ ను పార్టీ పదవి నుంచి తొలగించారు.
మరో పక్క ఐటీ దాడులు కూడా కొనసాగుతోన్నాయి. పొల్లాచ్చిలో ఎంబీఎస్ పౌల్ట్రీ ఫామ్స్ నడుపుతున్న వ్యాపారవేత్తల ఇళ్లలో ఐటీ బృందాలు సోదాలు చేస్తోన్నాయి. అరుల్‌మురుగన్, శరవణ మురుగన్, ఇళ్లు, కార్యాలయాలు దాడులు చేశారు. సోదాల్లో రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications