పవార్ బాబాయ్..అబ్బాయ్ పైనా ఈడీ కేసులు: అవే..బీజేపీకి ఆయుధంగా : శివసేన నేతలకూ గాలం..!
మహారాష్ట్రలో సంచలన రాజకీయ సమీకరణాలకు..అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు తెర వెనుక జరిగిన అనేక రాజకీయ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి..బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన అజిత్ పవార్ లక్ష్యంగా రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా..అజిత్ పవార్ ను బీజేపీ ఈడీ తో బెదిరించి..లొంగదీసుకుందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.
అయితే, అజిత్ పవార్ మీదనే కాదు..ఎన్సీపీ అధినేత శదర్ పవార్ మీదా ఈడీ కేసులు ఉన్నాయి. అదే సమయంలో శివసేన..ఎన్సీపీలోకి మరి కొందరు నేతల మీద విచారణలో ఉన్న కేసుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక..శివసేన లోని కొందరు ఎమ్మెల్యేలు సైతం బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

అజిత్..శరద్ పవార్ ల పైనా ఈడీ కేసులు..
మహారాష్ట్రలో బీజేపీ అనూహ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో..ఎన్సీపీ నేతల మీద ఉన్న కేసులతోనే బీజేపీ వారిని లొంగదీసుకుందంటూ రాజకీయంగా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రధానంగా ఎన్సీపీ నేతల పైన ఉన్న కేసుల కారణంగానే వారు బీజేపీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మహారాష్ట్ర రాజకీయాల్లో జోరాగా సాగుతున్న చర్చ. అయితే, అజిత్ పవార్ మీద మాత్రమే కాదు. ఎన్సీసీ అధినేత శరద్ పవార్ పైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ నేతలపై మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం మొదలుకొని పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయి.

ఇరిగేషన్ స్కాంలో అజిత్ పవార్..
అజిత్ పవార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 1999 నుంచి 2014 మధ్య కాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్‌కి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులను మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారని అజిత్ పవార్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే తన నిర్ణయాలన్నీ సెక్రటరీ స్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా తీసుకున్నవేనని అజిత్ పవార్ ఆ తరువాత సమర్థించుకున్నారు. వీటి కారణంగా సెప్టెంబర్ 2012న అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగారు. తరువాణ చోటు చేసుకున్నరాజకీయ పరిణామాలతో తిరిగి నియామకం అయ్యారు.

బాబాయ్..అబ్బాయ్ లపై ఈడీ కేసు...
ఈ యేడాది సెప్టెంబర్‌లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెలముందు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్.. అజిత్‌పవార్‌లపై ఇతర మనీ ల్యాండరింగ్ కేసులతో పాటు 25 వేల కోట్ల మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంకు కుంభకోణం కేసుని నమోదు చేసారు. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఎటువంటి నిబంధనలను పాటించకుండానే.. ఆర్థిక బలాలను పరిగణనలోనికి తీసుకోకుండా.. చక్కెర ఫ్యాక్టరీలకు విచ్చలవిడిగా రుణాలివ్వడం ద్వారా ప్రభుత్వానికి 25 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఎంఎస్సీసీ బ్యాంకుల నుంచి కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలకు ఎటువంటి పూచీ లేకుండా రుణాలిచ్చి.. ఆ తరువాత వాటిని ఖాయిలాపడిన పరిశ్రమలుగా చూపించారనే ఆరోపణలు వీరి మీద ఉన్నాయి.

శివసేన నేతల మీదా..
ఎన్సీపీ నేతలు మాత్రమే కాదు.. శివసేనల నేతల పైనా ఈడీ కేసులు ఉన్నాయి. పార్టీకి చెందిన దిలీప్‌రావ్ దేశ్‌ముఖ్ .. ఇషార్‌లాల్ జైన్.. జయంతి పాటిల్.. శివాజీ రావ్.. ఆనంద్‌రావు.. రాజేంద్ర షింఘేన్.. మాధవ్ పాటిల్‌లపై ఈడీ కేసులు కొనసాగుతున్నాయి. ఈ కేసుల్లో ప్రధానంగా వీరు బ్యాంకుల చట్టాలను.. ఆర్బీఐ ఆదేశాలను ఉల్లంఘించారని నాబార్డ్ ఆడిట్ రిపోర్టు లో స్పష్టం చేసింది. ఇక, మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్ ను గతంలో ఈడీ అరెస్ట్ చేసింది. మనీ ల్యాండరింగ్ .. నేరపూరిత దుష్ప్రవర్తన.. కుట్ర.. మోసపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఎన్సీపీ నేత.. మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్‌ను 2016 మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా ఉండగా 2005లో ఎటువంటి టెండర్లను ఆహ్వానించకుండా.. కె.ఎస్.చమాంకర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని భుజ్‌బల్‌పై ఆరోపణలున్నాయి. ఇక, ఇప్పుడు ఈ కేసులు తిరిగి మహారాష్ట్రలో రాజకీయంగా హాట్ చర్చకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications