మమతా బెనర్జీని వెంటాడుతున్న నరేంద్రమోడీ?
తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఇంకా వేటాడుతూనే ఉంది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సమీప బంధువు మనేకా గంభీర్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో ఈడీ అధికారులు అడ్డుకొని సమన్లు జారీచేశారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల కేసులో సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
మనేకా గంభీర్ బ్యాంకాక్ వెళ్లడానికి రాత్రి 9.00 గంటల సమయంలో విమానాశ్రయానికి వచ్చారు. గతంలో ఈమెపై ఈడీ లుకౌట్ నోటీస్ జారీచేసింది. ఈ తరుణంలోనే ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కు రాగా అధికారులు ఈడీకి సమాచారం అందించారు. వెంటనే అధికారులంతా అక్కడకు చేరుకొని ప్రయాణానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు కోల్ కతాలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించి వెళ్లిపోయారు. దీంతో ఆమె తిరిగి నివాసానికి వెళ్లిపోయారు.

బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు ఇప్పటివరకు మనేకాను విచారించలేదు. గతంలో ఆమె సీబీఐ విచారణకు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని గతంలో ఆమెకు సమన్లు జారీచేయగా దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లారు. స్థానిక ఈడీ కార్యాలయంలోనే విచారించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని నేతలందరినీ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఏదో ఒక రీతిలో ఇబ్బందిపెట్టే విధంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఒక మంత్రిని అరెస్ట్ చేశారు. తర్వాత మరో మంత్రి ఇంట్లో సోదాలు జరిగాయి. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు జరిపేందుకు ఈడీ సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications