దావూద్‌తో సంబంధాలు: మంత్రి పదవికి ఖడ్సే రాజీనామా!
ముంబై: మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే తన పదవికి రాజీనామా చేశారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి వెళ్లిన ఆయన తన పదవికి రాజీమానా చేస్తున్నట్లుగా ఓ లేఖను అందించారు.
మాహారాష్ట్ర బీజేపీ శాఖలో కీలక నేతగా ఎదిగిన ఖడ్సేకు దావూద్ ఇబ్రహీంతో అత్యంత సన్నిహిత సంబధాలున్నాయన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలాన్ని సృష్టించాయి. ఖడ్సేకు దావూద్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవని ఇటీవల ఓ సంచలన విషయాన్ని మరాఠా పత్రికలు వెలుగులోకి తెచ్చాయి.

దీనిపై మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ వార్తలను ఖడ్సే తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం తేలకముందే ఖడ్సే అక్రమ భూకేటాయింపులు జరిపారంటూ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మహారాష్ట్రలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న శివసేనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఖడ్సేను పదవి నుంతి తప్పించాలని డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారు. కానీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తికి ఖడ్సే ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఫడ్నవీస్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు జరిగిన విషయాన్ని వివరించారు. అక్రమ భూకేటాయింపుల్లో ఆయన పాత్ర ఉందన్న ఆరోపణలపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయింది.
ఈ అక్రమ భూ కేటాంయిలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం ఫడ్నవీస్‌ను అమిత్ షా ఆదేశించారు. దీంతో చివరకు ఖడ్సే దిగిరాక తప్పలేదు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి కూడా ఖడ్సే గైర్హాజరయ్యారు. సోమవారం నుంచి ఆయన తన ఎర్రబుగ్గ కారుని కూడా వాడటం మానేశారు.
మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న ఖడ్సే గత నెలలో తన భార్యకు, అల్లుడికి దాదాపు రూ. 40 కోట్ల విలువ చేసే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్ఐడీసీ)కి చెందిన ప్రభుత్వ భూమిని కేవలం రూ. 3.75 కోట్లకే ఇచ్చేశారు. ఈ అక్రమ భూ వ్యవహారమే ఆయన మంత్రి పదవికి ఎసరు పెట్టింది.
అయితే తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమణి ఖడ్సే వాదిస్తున్నారు. అది ప్రభుత్వ భూమి కాదని, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్నామని.. మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్ డ్యూటీ కట్టామని ఖడ్సే అంటున్నారు. కాగా, రాజీనామా చేసిన ఖడ్సేపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తున్నాయి.
కేవలం రాజీనామా చేస్తే సరిపోదని.. ఆయన ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. ఖడ్సే రాజీనామా చేయాలని గత మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆప్ మాజీ నేత అంజలి దమానియా ఆయనపై విచారణకు ఆదేశించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానన్నారు.
ఆరోపణలు రుజువైతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతా: ఖడ్సే
తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని మహారాష్ట్ర మాజీ మంత్రి ఖడ్సే స్పష్టం చేశారు. ఈ ఆరోపణల వల్ల తనపై మచ్చ రాకూడదనే రెవెన్యూ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. 'ఫోర్జరీ పత్రాలతో నన్ను ఇరికించారు. నాకు వ్యతిరేకంగా చీప్ పబ్లిసిటీ స్టంట్ సృష్టించారు' అని ఆయన మండిపడ్డారు.
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రజల అభిమతానికి అనుగుణంగానే రాజీనామా చేశానని, తన రాజీనామా కొందరు స్వార్థపరులకు చెంపపెట్టు లాంటిందని అన్నారు.












Click it and Unblock the Notifications