లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్: వారికి మాత్రమే ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశం
Vote from Home: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. లోక్‌సభతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాల అయిదేళ్ల పదవీ కాలం ముగిసినట్టయింది. ఓటర్లు కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఈ ఎన్నికల్లో 96,88,21,926 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సంఖ్యలో ఆరు శాతం పెరుగుదల కనిపించింది. 2019లో దేశంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు. ఈ అయిదేళ్లల్లో ఈ సంఖ్య 96.88 కోట్లకు చేరుకుంది.
ఇందులో పురుష ఓటర్లు 49.7 కోట్ల వరకు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 47.1 కోట్లు. జెండర్ రేషియో 940 నుంచి 948కి చేరుకుంది. అంటే ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 948 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ల ఓట్ల సంఖ్య ఈ అయిదేళ్లల్లో 39,683 నుంచి 48,044కు పెరిగింది.
18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 1,16,48,090 మంది ఉన్నారు. 20 నుంచి 29 వరకు వయస్సు గల ఓటర్లు 17,81,14,233 మంది ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఓ కొత్త వసతిని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈసీ. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రవేశపెట్టింది. అది విజయవంతం కావడంతో ఇక లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే విధానాన్ని కొనసాగించబోతోన్నట్లు ఈసీ వెల్లడించింది.

అదే- ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశం. 85 సంవత్సరాలు, అంతకు మించి వయస్సు గల వయోవృద్ధులకు పోలింగ్ కేంద్రం వరకూ వెళ్లకుండా ఇంట్లో నుంచే ఓటు వసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అలాగే- 40 శాతం, అంతకంటే పైగా అంగ వైకల్యం గల దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేయవచ్చు.
పోలింగ్ సిబ్బంది సదరు ఓటరు ఇంటి వద్దకే వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్‌మెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను తెస్తారు. రహస్యంగానే తమ ఓటు వేయవచ్చు. తమ వయస్సును నిర్ధారించడానికి, 40 శాతం మేర అంగవైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రాలను పోలింగ్ సిబ్బందికి చూపించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications