ఓటర్ల జాబితాలో 16.7 లక్షల మంది పేర్లు తొలగింపు: ఈసీ ప్రకటన
Lok Sabha Elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో.. ఈసీఐ అధికారులు తమ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తోన్నారు. వివిధ రాష్ట్రాలను సందర్శిస్తోన్నారు. ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల అధికారులను సమాయాత్తం చేస్తోన్నారు.
ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్.. బిహార్‌లో పర్యటిస్తోన్నారు. మొత్తం 40 లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఇది. ఎన్నికల ప్రధానాధికారితో సమావేశం అయ్యారు. అన్ని జిల్లాల రిటర్నింగ్, నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు రాజీవ్ కుమార్. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు అందాయి. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటర్లకు కల్పించాల్సిన రక్షణ గురించి దాదాపు అన్ని పార్టీల నాయకులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలను నివారించడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కొత్త ఓటర్లకు అవగాహన కల్పించడంపై సూచనలు చేశారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఈసీ రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ శాతం పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోన్నామని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని కోరారు.
జాబితాలో నుంచి ఓటర్ల పేర్ల తొలగింపు, కొత్త ఓటర్లు గుర్తింపు కార్డుల జారీ, కొత్త ఓటర్ల పేర్లను లిస్టులో చేర్చడం వంటి అంశాలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు సూచనలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పారు. పోలింగ్ బూత్‌ల వద్ద పారామిలటరీ బలగాల మోహరింపు గురించీ ప్రస్తావించారని అన్నారు.
బిహార్‌లో మొత్తం 7.64 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. వారిలో నాలుగు కోట్ల మంది పురుషులు, 3.6 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు వివరించారు. వంద సంవత్సరాలకు పైగా వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 21,680గా తేలిందని చెప్పారు. వారందరికీ ఇంటివద్ద నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.
అలాగే- 9.26 లక్షలమంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని రాజీవ్ కుమార్ చెప్పారు. మరణించిన, ఒక చోటి నుంచి మరో చోటికి బదిలీ అయిన వారి పేర్లను తొలగించామని, మొత్తంగా 16.7 లక్షల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి డిలెట్ చేసినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications