భారత్‌లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
Elon Musk: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారత పర్యటనకు ఆయన సిద్ధపడ్డారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారని, టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉన్నారంటూ ఇదివరకు వార్తలొచ్చాయి.
ఎలాన్ మస్క్ భారత పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయింది అప్పట్లో. దాని ప్రకారం చూసుకుంటే ఈ నెల 21, 22 తేదీల్లో అంటే ఆది, సోమవారాల్లో ఆయన ఇక్కడికి రావాల్సి ఉంది. దక్షిణాసియా దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలను విస్తరింపజేసుకోవడంలో భాగంగా భారత్‌లో పెట్టుబడులను పెట్టాలని, ఈ దేశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని టెస్లా కార్ల తయారీ ఎగుమతులను చేపట్టేలా ఎలాన్ మస్క్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారనే ప్రచారం కొద్దిరోజుల కిందట జోరుగా సాగింది.

టెస్లా కార్ల తయారీ ప్లాంట్‌ను తమ రాష్ట్రంలో పెట్టాలంటూ సంప్రదింపులు సైతం జరిగాయి. ఏపీ, తెలంగాణ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. తమ రాష్ట్రంలో ఈ యూనిట్‌ను నెలకొల్పాలంటూ ఏపీ, తెలంగాణ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించాయి కూడా.
ఈ పరిస్థితుల్లో బాంబు పేల్చారు ఎలాన్ మస్క్. తాను భారత పర్యటనకు ఇప్పట్లో రావట్లేదని ప్రకటించారు. టెస్లా కార్ల తయారీ విస్తరణకు సంబంధించిన కార్యకలాపాల వల్ల తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు. తన రాక ఆలస్యమౌతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో భారత్‌కు రావాలని అనుకుంటున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పారు.
మోదీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను ఎలాన్ మస్క్ ఫాలో అవుతోన్న విషయం తెలిసిందే. భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్‌కు నెలకొల్పడానికీ ఆయన సిద్ధంగా ఉన్నారని, కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు గతంలో వివరించారు.
భారత్‌లో కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పిన తరువాతే అమ్మకాలు చేపట్టాలంటూ కేంద్రం గతంలో షరతు పెట్టిన విషయం తెలిసిందే. మొదట్లో మస్క్ దీన్ని వ్యతిరేకించారు. ప్రస్తుతం చైనా సహా ఇతర దేశాల్లో తయారవుతోన్న కార్లను భారత్‌లో దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇస్తేనే యూనిట్ నెలకొల్పుతానని మెలిక పెట్టారు.












Click it and Unblock the Notifications