వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత కీలక రహస్యాలు చేరవేత: పాక్ గూఢచారి దేశ బహిష్కరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ గూఢచర్యం గుట్టును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. దేశ రక్షణ శాఖ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న పాక్ హైకమిషన్ ఉద్యోగిని అరెస్టు చేసి భారీ కుట్ర గుట్టు రట్టు చేశారు.
పాకిస్థాన్‌ రాయబార కార్యాలయ ఉద్యోగి మెహమూద్‌ అక్తర్‌ భారత రక్షణ రహస్యాలను సేకరించారన్న పక్కా సమాచారం ఆధారంగా.. అతనిపై భారత ప్రభుత్వం దేశ బహిష్కారం విధించింది.

48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. కాగా, ఇందుకు ప్రతిగా పాకిస్థాన్‌ కూడా అక్కడి భారత రాయబార కార్యాలయం ఉద్యోగిని బహిష్కరిచింది. తొలుత పాక్‌ఉద్యోగి అక్తర్‌ ఏజెంట్లనుంచి రహస్య పత్రాలను తీసుకుంటుండగా ఆయనను అదుపులోకి తీసుకున్న డిల్లీ పోలీసులు..విచారణ అనంతరం విడిచిపెట్టారు. ఆయనకు సహకరించిన రాజస్థాన్‌కు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ మోహరింపు తదితర సున్నిత రక్షణ వ్యవహారాలకు సంబంధించిన పత్రాలను సంపాదించినందుకు ఈ చర్య తీసుకున్నారు.

కాగా, ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ మాట్లాడారు. 'పోలీసుల చర్య అనంతరం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌.జయశంకర్‌.. పాకిస్థాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ను గురువారం ఉదయం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. జరిగిన విషయాన్ని వివరించారు.

అక్తర్‌ను 'స్థాయికి తగని వ్యక్తి'గా ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అక్టోబర్ 29లోగా తప్పకుండా పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టంచేశారు' అని తెలిపారు.

మారుపేరుతో ఆధార్‌ కార్డు:

ఐఎస్‌ఐ గూఢచారి కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే అక్తర్‌ భారత్‌లోని పాక్‌ రాయబార కార్యాలయంలోని వీసా విభాగంలో పనిచేస్తున్నాడు. 'గత ఏడాదిన్నరగా ఆయన గూఢచర్యానికి పాల్బడుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఆరు నెలలుగా ఆయనపై నిఘా ఉంచాం. స్పష్టమైన సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నామ'ని పోలీసు జాయింట్‌ కమిషనర్‌ (క్రైం) ఆర్‌ఎస్‌ యాదవ్‌ మీడియాకు తెలిపారు. ఆయనను మూడుగంటలసేపు విచారించి, దౌత్యపరరక్షణ ఉండడంతో విడచిపెట్టామని చెప్పారు.

'అక్తర్‌ మొదట మెహబూబ్‌ రాజ్‌పుత్‌ పేరుతో ఉన్న ఆధార్‌ కార్డును చూపించాడు. చాందినీచౌక్‌లో ఉంటున్నట్టు చెప్పాడు. చాలాసేపు తరువాత తన అసలు పేరు మొహమూద్‌ అక్తర్‌ అని అంగీకరించాడు. భారతీయుడునని చెప్పుకోవడానికి నకిలీ ఆధార్‌ కార్డు సంపాదించా'అని యాదవ్‌ వివరించారు. విదేశాంగ శాఖతో వివరాలను సరిపోల్చిన తరువాత ఆ శాఖ అధికారుల సమక్షంలో ఆయనను పాక్‌ రాయబార కార్యాలయానికి అప్పగించినట్టు వివరించారు.

Espionage case: Pak official held, expelled for spying; ties take another hit

వీసా విభాగంలో పనిచేయడంతో చాలా మందితో ఆయనకు పరిచయాలు ఏర్పడ్డాయని, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఆశచూపి గూఢచర్యంలోకి దింపేవాడని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.కొందర్ని ఎరవేయడానికి యువతులను కూడా ఉపయోగించుకున్నట్టు తెలిసిందని చెప్పారు.

ఛేదించారిలా: ఢిల్లీ జంతు ప్రదర్శన శాలలో అక్టోబరు26న ఉదయం పది గంటలకు సుభాష్‌ జింగీర్‌, మౌలానా రమ్‌జాన్‌, షోయబ్‌లతో అక్తర్‌ సమావేశం కానున్నట్టు మంగళవారం పోలీసులకు సమాచారం అందింది. వీరు పత్రాలు ఇచ్చిపుచ్చుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఈ సందర్భంగా షోయబ్‌ పరారీ కావడంతో ఆ సమాచారాన్ని జోధ్‌పూర్‌ పోలీసులకు అందించారు. వారు అతన్ని గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. రాజస్థాన్‌, గుజరాత్‌ల్లో బీఎస్‌ఎఫ్‌, ఇతర పారా మిలటరీ దళాల స్థావరాల సమాచారాన్ని మౌలానా ద్వారా షోయబ్‌ సంపాదించాడు. సుభాష్‌ పారామిలటరీ దళం అధికారి అంటూ అక్తర్‌కు పరిచయం చేశాడు.

కాగా, అక్తర్‌ ఇక్కడి రాయబార కార్యాలయంలో గత రెండున్నర ఏళ్లుగా పనిచేస్తున్నట్టు చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి. రావల్పిండి జిల్లా కహుటా గ్రామానికి చెందిన అతను పాకిస్థాన్‌ సైన్యం 40 బలోచ్‌ రెజిమెంటులో 1997 నుంచి హవల్దార్‌గా పనిచేస్తున్నాడు. 2013 జనవరి నుంచి పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నాడు. 2013 సెప్టెంబరు నుంచి ఢిల్లీలోని పాక్‌ హైకమిషనర్‌ కార్యాలయంలో వాణిజ్య వ్యవహారాల కౌన్సెలర్‌ ఫరూక్‌ హబీబ్‌ వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు.

నకిలీ ఆధార్ కార్డు తయారీ:

అక్తర్‌ తమ ఇంటి చిరునామాతో ఆధార్‌ కార్డు ఎలా సంపాదించాడో అర్థం కావడం లేదని ఆ ఇంటి యజమాని మహమ్మద్‌ ఆసిఫ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంటి నెంబరు 2350, గలీ, మాదరి(దగ్గర), రోడ్‌గ్రాన్‌ మొహల్లా అనే చిరునామా ఇచ్చాడు. ఇది తెలిసి పాత్రికేయులు వెళ్లడంతో అసలు యజమాని ఆసిఫ్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాను విద్యుత్తు మోటార్ల వ్యాపారం చేస్తున్నానని, వారసత్వంగా వచ్చిన ఈఇంట్లో 40ఏళ్లుగా నివసిస్తున్నట్టు చెప్పాడు.

ఆరోపణలు నిరాధారం..పాక్‌: అక్తర్‌ విషయంలో భారత్‌ చేసిన ఆరోపణలు నిరాధారమని పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం ఖండించింది. తమ రాయబార కార్యాలయ ఉద్యోగిని బుధవారం అదుపులోకి తీసుకొని, కొట్టారని, దౌత్యవేత్తల విషయంలో 1961లో కుదిరిన వియన్నా సంప్రదాయాలకు ఇది వ్యతిరేకమని నిరసించింది. ఈ ఆరోపణలను భారత్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ఖండించారు. అక్తర్‌ను కొట్టలేదని, నిబంధనల మేరకు చాలా గౌరవంగానే చూశారని తెలిపారు.

బీఎస్‌ఎఫ్‌ ఉద్యోగులకూ సంబంధం?

గూఢచర్యం వ్యవహారంలో పాక్‌ రాయబార కార్యాలయానికి చెందిన మరికొందరు ఉద్యోగులకు కూడా సంబంధం ఉండి ఉంటుందని దిల్లీ పోలీసులు భావిస్తున్నారు. కొంత మంది సరిహద్దు రక్షణ దళం (బీఎస్‌ఎఫ్‌) ఉద్యోగుల పాత్ర కూడా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 'వారి దగ్గర ఉన్న పత్రాలను చూస్తే.. బీఎస్‌ఎఫ్‌లో కీలక సమాచారం తెలిసినవారు మాత్రమే వీటిని అందించే అవకాశం ఉంది. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. కొంతమంది అధికార్లను గుర్తించాం. త్వరలో దాడులు చేస్తామ' అని తెలిపారు.

ఐఎస్‌ఐ ఏజెంట్లుగా రాజస్థాన్‌వాసులు: దిల్లీలో పాక్‌ గూఢచారి అక్తర్‌కు రహస్య పత్రాలు అందజేసిన రాజస్థాన్‌కు చెందిన మౌలానా రమ్‌జాన్‌, సుభాష్‌ జంగీర్‌.. వీరిని పరిచయం చేసిన షోయబ్‌ను అరెస్టుచేసినట్టు పోలీసులు తెలిపారు. వారిద్దరూ ఏడాదిన్నరగా పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకి ఏజెంట్లుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మౌలానా, సుభాష్‌లకు 12 రోజుల పాటు (నవంబరు 8 వరకు) పోలీసు కస్టడీకి పంపిస్తూ దిల్లీ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సతీష్‌ ఆరోరా ఆదేశించారు. జోధ్‌పూర్‌కు చెందిన పాసుపోర్టు ఏజెంటు షోయబ్‌ను అక్కడి పోలీసులు అరెస్టుచేశారు. నాగౌర్‌కు చెందిన ఖురేషియాన్‌ కీ మజీద్‌లో మౌలానా ఇస్లామిక్‌ ప్రచారకునిగా పనిచేస్తుండగా, సుభాష్‌ ఆ మసీదు పక్కన కిరాణా దుకాణం నడుపుతున్నాడు. వ్యాపారంలో సుభాష్‌కు బాగా నష్టాలు రావడంతో మౌలానా అతన్ని ఈ రంగంలోకి దింపాడు.

పాక్ ప్రతీకారం

పాక్ ఉద్యోగి దేశ బహిష్కరణకు ప్రతిగా పాక్‌ విదేశాంగ శాఖ కార్యదర్శి ఇజాజ్‌ చౌదరి పాక్‌లో భారత హైకమిషనర్‌ గౌతం బాంబ్‌వాలేను తన కార్యాలయానికి పిలిపించారు. భారత రాయబార కార్యాలయం అధికారి సుర్జీత్‌ సింగ్‌ను 'స్థాయికి తగని వ్యక్తి'గా ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని, ఇందుకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని పాక్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

English summary
The already dim prospects of any improvement in India-Pakistan relations were dealt another blow on Thursday with Delhi Police busting an espionage ring whose 'kingpin' is a Pakistan high commission official.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X