తుపానుపై అప్రమత్తంగా ఉండండి
అరేబియా సముద్రం లో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాన్ అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది తీరం వైపు దూసుకొస్తోన్న విషయం తెలిసిందే. తుపాను పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వైద్యం, విద్యుత్తు, తాగునీరు లాంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలన్నారు. నష్టనివారణ చర్యలు తక్షణమే చేపట్టేలా సిద్ధంగా ఉండాలని కోరారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తుపాను పరిస్థితులను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, ఇప్పటికే 12 ఎన్టీఆర్ ఎఫ్ బృందాలను మొహరించినట్లు తెలిపింది. మరో 15 బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సైతం బిపోర్‌జాయ్ తుపాను సంసిద్ధత చర్యలను సమీక్షించింది. ప్రస్తుత తుపాను పరిస్థితిని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 14వ తేదీ వరకు ఈ తుపాను ఉత్తర దిశగా కదులుతూ గుజరాత్ లోని కచ్, సౌరాష్ట్రలను దాటుతుందని తెలిపింది. జూన్ 15వ తేదీ మధ్యాహ్నానికి గుజరాత్ లోని మాండ్వి, పాకిస్తాన్ లోని కరాచీ మధ్య జఖావూ పోర్ట్ సమీపంలో తీరం దాటబోతున్నట్లు తెలిపింది. ఆ సమయంలో గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాయి. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజుల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వడగాలలు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications