బీజేపీ అభ్యర్థి కారులో ఈవీఎం -అమిత్ షా అనూహ్య వ్యాఖ్యలు -ఎవరినీ వదలొద్దని ఈసీకి వినతి
అస్సాం అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లాల్సిన ఈవీఎంలు బీజేపీ అభ్యర్థి కారులో లభ్యమైన ఘటనపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. కరీంగంజ్ జిల్లాలోని రతాబరి అసెంబ్లీ సెగ్మెంట్ లో 149వ నంబర్ పోలింగ్ బూత్ కు చెందిన ఈవీఎం.. బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ కారులో తరలించిన వ్యవహారంలో నలుగురు పోలింగ్ సిబ్బందిపై వేటు పడింది. బీజేపీని 'ఈవీఎంల దొంగ పార్టీ'గా అభివర్ణించిన కాంగ్రెస్..బీజేపీ అభ్యర్థిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేసింది. దీనిపై..
అస్సాం ఈవీఎం వివాదం అంతకంతకూ ముదురుతుండటం, పోలింగ్ సిబ్బందితోపాటు బీజేపీ అభ్యర్థిపైనా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అసోం బీజేపీ అభ్యర్థి ఏవైనా తప్పులు చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం కఠినమైన చర్యలు తీసుకోవాలని షా స్పష్టం చేశారు.

''అసోం విషయంపై నాకు తెలియదు. ప్రస్తుతం నేను దక్షిణ భారత ప్రచార పర్వంలో ఉన్నాను. పూర్తి వివరాలు తెలుసుకుంటా. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకున్నా మేమెప్పుడూ అడ్డుచెప్పలేదు. మీరు చెప్పినదే నిజమైతే ఈసీ బీజేపీ అభ్యర్థిపై తగిన చర్యలు తీసుకోవచ్చు. ఈ చర్యలో భాగస్వాములైన వారిని శిక్షించాలి.'' అని అమిత్‌షా పేర్కొన్నారు.
రతబరిలో పోలింగ్ అధికారులు ఈవీఎంలను బీజేపీ అభ్యర్థి కృష్ణేందు పాల్ వాహనంలో తరలించడాన్ని గుర్తించిన స్థానికులు దాడికి దిగడంతో ఈ వ్యహారం రచ్చకెక్కింది. దీంతో ఎన్నికల సంఘం దర్యాప్తుకు ఆదేశించింది. అయితే తాము ఎక్కిన వాహనం బీజేపీ నేతకు సంబంధించిన వాహనమని తమకు తెలియదని, ఈవీఎంలను తీసుకెళ్లే క్రమంలో తమ వాహనంలో ఇబ్బంది తలెత్తితే, అగుగా వెళ్తున్న కారును లిఫ్ట్ అడిగామని పోలింగ్ అధికారులు ఈసీకి వివరణ ఇచ్చారు. పోలింగ్ సిబ్బందికి సాయం చేశామే తప్ప ఈవీఎంలను దొంగిలించలేదని బీజేపీ అభ్యర్థి విరణ ఇచ్చుకున్నారు. పోల్ సిబ్బందిపై వేటేసిన ఈసీ.. బీజేపీ అభ్యర్థిని మాత్రం ప్రస్తుతానికి వదిలేసింది.












Click it and Unblock the Notifications