బాంబు పేల్చిన మాజీ సీఎం, రెండు చోట్ల పోటీ చేస్తాను, చివరి ఎన్నికల సెంటిమెంట్ తో !
బెంగళూరు/కోలారు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో రాజకీయాలు మంచి ఊపుమీద ఉన్నాయి. ఇప్పటికే ఒక్క అడుగు ముందుకు వేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎంతో పాటు మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు మొదటి జాబితాలో ఉన్నాయి.
టిక్కెట్లు దక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేస్తోందని తెలుస్తోంది. జేడీఎస్ పార్టీ నాయకులు కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. బీజేపీకి చెందిన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మైసూరు జిల్లాలోని వరుణ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు పట్టణం నుంచి పోటీ చెయ్యాలని సిద్దరామయ్య ఆశపడినా అందుకు కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం అంగీకరించలేదు, వరుణా నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యకు సూచించింది.

మంగళవారం మైసూరు జిల్లాలో మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య తాను వరుణ నియోజక వర్గంతో పాటు కోలారు నుంచి పోటీ చేస్తానని బాంబు పేల్చారు. గతంలో రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేసిన సిద్దరామయ్య బాదమిలో విజయం సాధించి అదే నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు తాను హైకమాండ్ తో మాట్లాడి కోలారు, వరుణ నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తానని, ఇవే నా చివరి ఎన్నికలు అని సిద్దరామయ్య సెంటిమెంట్ తో చెప్పారు.
రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే కోలారులో ఎమ్మెల్యేగా కొనసాగి వరుణ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో కొడుకును ఎమ్మెల్యేగా నిలబెట్టాలని సిద్దరామయ్య ఆలోచిస్తున్నారని తెలిసింది. మొత్తం మీద కోలారులో సిద్దరామయ్య పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?, లేదా ? అని వేచిచూడాలి.












Click it and Unblock the Notifications