మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు తప్ప మొత్తం బంద్.. జనతా కర్ఫ్యూలో తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా.. ఇంకొద్ది గంటల్లో దేశవ్యాప్త జనతా కర్ఫ్యూ మొదలు కానుంది. ఆదివారం(22న) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకుండా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారత్ లో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, కరోనాకు విరుగుడు మందు అందుబాటులోకి రాకపోవడంతో.. వైరస్ వ్యాప్తి లింకును బ్రేక్ చేయడానకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు..

అన్ని రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ జనతా కర్ఫ్యూ దృష్ట్యా ప్రభుత్వాలు కీలక సూచనలు చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాల బూత్ లు, పెట్రోల్ బంకుల వంటి ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడనున్నాయి. నిజానికి..

except emergency services all will be shutdown on janata curfew day, here are precautions

జనతా కర్ఫ్యూ విషయంలో ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురికావొద్దని, కిరాణ వస్తువులు,నిత్యావసర సరుకుల కోసం హడావుడిగా పరుగులు తీయొద్దని ప్రధాని మోదీ సూచించినప్పటికీ.. దేశవ్యాప్తంగా దుకాణాలు, సూపర్ మార్కెట్ల వద్ద రద్దీ ఏర్పడింది. 14 గంటల జనతా కర్ఫ్యూను.. గడువు ముగిసిన తర్వాత కూడా పొడిగిస్తారని, దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, ప్రస్తుతానికి లాక్ డౌన్ ప్రకటించే ఆలోచనేదీ కేంద్రానికి లేదని, ప్రజలు అనవసరంగా పానిక్ కావొద్దని అధికారులు స్పష్టం చేశారు.

కర్ఫ్యూ కారణంగా సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోయే అవకాశాలుండటంతో ప్రజలు ముందస్తుగా రెండు నెలలకు సరిపడా రేషన్ కొనుగోలు చేస్తుండటం కనిపించింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇవే సీన్లు చోటుచేసుకున్నాయి. శుక్రవారంలాగే, శనివారం కూడా వ్యాపార సముదాయాల వద్ద హడావిడి నెలకొంది. బియ్యం, నూనె, పప్పులు, ఉల్లిగడ్డలను రెండు నెలలకు సరిపడేలా కొనుగోలు చేశారు. ప్రస్తుతం హోటల్స్ బంద్ కావడంతో తోపుడు బండ్లపై టిఫిన్ అమ్మే వారు..చిన్న టిఫిన్ సెంటర్ల యజమానులు ఇడ్లీ, దోశ, పూరీ, వడ, ఇతరత్రా వాటికి అవసరమైన సరుకులను భారీగా కొనుగోలు చేస్తున్నారు.

హైదరాబాద్ లోనైతే.. రైతు బజార్లు, దుకాణదారుల సంఘాలు.. తాము స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటామని ప్రకటనలు చేయడంతో ఆయా దుకాణాలకు జనం పోటెత్తారు. కర్ఫ్యూ ఎత్తివేత తర్వాత కూడా సరుకుల ధరలు పెరగొచ్చనే ఆందోళన నేపథ్యంలో రెండ్రోజులకు సరిపడా కూరగాయలు కొనేవాళ్లుకాస్తా, ఇప్పుడు వారంపదిరోజులకు సరిపడా సరుకుల్ని సమకూర్చుకుంటున్నారు. సిటీలోని రైతు బజార్లతోపాటు ప్రఖ్యాత మోండా మార్కెట్, మీరాలం మండి, మాదన్నపేట, ఎన్టీఆర్ నగర్, బోయిన్ పల్లి, అల్వాల్, కొత్తపేట, మెహిదీపట్నం, ఎర్రగడ్డ మార్కెట్ల వద్ద కొనుగోలుదారులు కిటకిటలాడారు. ఆన్ లైన్ లోనూ కొనుగోళ్ల జోరు పెరిగింది.

ఇక, స్వచ్ఛంద కర్ఫ్యూలో భాగంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే.. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాలలోపు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలనీయొద్దని ప్రభుత్వాలు ఘంటాపథంగా చెప్పాయి. కరోనా మృతుల్లో పెద్ద వయసున్నవాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈమేరకు కాస్త కఠినంగానైనా వ్యవహరించాలనే సూచనలొచ్చాయి. హెల్త్, మీడియా రంగాలకు చెందినవాళ్లు, అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్లందరూ తప్పనిసరిగా మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతావాళ్లెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దు. మనకే మవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే అది కుటుంబానికి, దేశానికే ప్రమాదకర పరిణామంగా మారొచ్చని ప్రధాని హితవు పలికారు.

నిత్యావసరాల విషయంలోనూ కంగారు పడొద్దని, ప్రైవేటు వాహనాలు తిరగని పక్షంలో ప్రభుత్వమే సరుకుల రవాణా చేపడుతుందని, అవసరమైతే కేరళ తరహాలో ఇంటింటికీ రేషన్ చేరవేత సదుపాయాన్ని కూడా కల్పిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి. కాబట్టి ప్రజలు పానిక్ కాకుండా ఉండటం మంచిది. భారత్ లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారిని నివారించాలంటే.. అది వ్యాప్తి చెందే లింకును తెంచడం కోసమే జనతా కర్ఫ్యూ తెరపైకి వచ్చింది. కాబట్టి జనమంతా స్వీయనియంత్రణను పాటించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+