వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాయామం: మానవులు ఎక్సర్‌సైజ్ చేయటం అసహజమా? చాలా మందికి వ్యాయామం ఎందుకు ఇష్టం ఉండదు? – మానవపరిణామ శాస్త్రవేత్త చెప్తున్న 4 విషయాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వ్యాయామం

''క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన నా స్నేహితుల అంత్యక్రియల్లో శవపేటికలు మోయటం ద్వారా నాకు అవసరమైన వ్యాయామం అంతా లభించింది’’ అని ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్ ఒకసారి చెప్పారు. ఆయన 75 ఏళ్లు జీవించారు.

అందరూ ఇంత గౌరవప్రదంగా తమ అభిప్రాయాలు వ్యక్తీకరించలేరు కానీ.. వ్యాయామం అంటే అంతగా ఇష్టపడని వారు చరిత్రలో చాలా మందే ఉన్నారు.

అది అరుదైన విషయమేమీ కాదని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పురామానవశాస్త్రవేత్త డానియెల్ లీబర్మన్ 'ద హార్వర్డ్ గెజిట్’ పత్రికతో చెప్పారు. వ్యాయామం మీద 'ఎక్సర్‌సైజ్’ అనే పుస్తకం ఆయన రాశారు.

మనం అనవసర శ్రమను నివారించే విధంగా రూపొందాం. ట్రయథ్లాన్ల కోసమో ట్రెడ్‌మిల్స్ కోసమో కాదు.

కాబట్టి... వ్యాయామం చేయటం సాధారణమనే ఆలోచన వట్టి కల్పితం.

వ్యాయామం

మనిషి వ్యాయామం చేయటానికి అనుగుణంగా పరిణామం చెందలేదని డాక్టర్ లీబర్మన్ అంటారు. శాస్త్రీయ కోణంలో చూస్తే వ్యాయామం అనేది ఒక విచిత్రమైన కార్యకలాపమని అభివర్ణించారు.

అంటే.. మనం కదలటానికి, శారీరకంగా క్రియాశీలంగా ఉండటానికి వీలుగా పరిణామం చెందినప్పటికీ.. ''వ్యాయాం అనేది ఒక నిర్దిష్టమైన శారీరక కార్యక్రమం: ఆరోగ్యం, దృఢత్వం కోసం స్వచ్ఛందంగా చేసే శారీరక కార్యక్రమం.’’

వ్యాయామం చేయటమనేది కొత్తగా కనుగొన్న విషయమని లబీర్మన్ అంటారు. జంతువుల వెనుక పరుగు పెట్టే ఒక వేటగాడు, లేదా నేల దున్ని పంటలు పండించే ఓ రైతు.. ప్రతి రోజూ పొద్దున్నే 10 కిలోమీటర్లు జాగింగ్ చేసి అదనపు శక్తిని ఖర్చు చేయటం నిర్హేతుకమే అవుతుంది. అలా చేస్తే.. తమ ప్రాధాన్య పనులు చేయటానికి ఎంతో విలువైన కేలరీలు వృధా అవుతాయి.

వ్యాయామం

''అనవసరమైన శారీరక కార్యకలాపాలను నివారించే సహజ స్వభావం మనలో చాలా లోతుగా పాతుకుపోయి ఉంది’’ అని ఆయన వివరించారు.

''కానీ ఇప్పుడు మనం ఎవరైనా వ్యాయామం చేయకపోతే వారికి బద్ధకమని ముద్ర వేస్తాం. కానీ వాళ్లు బద్ధకస్తులు కాదు. చాలా మామూలు మనుషులు’’ అని ఆయన పేర్కొన్నారు.

అయితే.. వ్యాయామం చేయటం వల్ల పెద్దగా లాభాలు లేవని అర్థం కాదు. అవసరమైనంత వ్యాయామం చేయటం మనలో చాలా మందికి ఎందుకంత కష్టమనేది ఇది వివరిస్తుంది. దీనిని అర్థం చేసుకోవటం వల్ల మనం ఎక్కువ వ్యాయామం చేయటానికి తోడ్పడుతుందని లీబర్మన్ చెప్తున్నారు.

''వ్యాయామాన్ని వైద్యీకరించటం, వాణిజ్యీకరించటం వల్ల ఫలితం ఉండటం లేదని స్పష్టమైంది. కాబట్టి పరిణామ మానవశాస్త్రవేత్తలుగా ఆలోచించటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నా’’ అన్నారాయన.

అదృష్టం ఏమిటంటే ఆయనే ఒక పురామానవశాస్త్రవేత్త. లీబర్మన్ చెప్తున్న నాలుగు అంశాలు ఇవి:

వ్యాయామం

1. మీపై మీకు కోపం వద్దు

మీకు వ్యాయామం చేయాలని అనిపించకపోతే, దాని గురించి విచారించవద్దు. అవసరమైన దానికన్నా ఎక్కువ చేయరాదన్నది మానవులకు సహజ స్వభావం.

అయితే మనం హేతుబద్ధంగా ఆలోచించే జీవులం కూడా.

మనం మనకు చాలా రకాలుగా ప్రయోజనాలనిస్తున్న ప్రపంచాన్ని నిర్మిస్తున్నామనేది మనకు తెలుసు. అయితే ఈ ప్రపంచంలో మనం శారీరకంగా క్రియాశీలంగా ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితులు లేకుండా పోయాయి. కాబట్టి ఈ ప్రపంచం మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టింది.

అవసరమైన దానికన్నా ఎక్కువ చేయాల్సిన అవసరమున్న ప్రపంచం ఇది. అనేక అధ్యయనాలు ఈ విషయాన్ని చూపాయి.

ఆ సహజాతాలను గుర్తించటం మనం నేర్చుకోగలిగితే.. వాటి నుంచి మనం మరింత సులభంగా అధిగమించగలమని లీబర్మన్ చెప్తున్నారు.

''ఉదయం రన్నింగ్ చేద్దామని నిద్ర లేచిన తర్వాత.. బయట చలిగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండదు. వ్యాయామం చేయాలని అనిపించదు. అది ఎగ్గొట్టానికి కావల్సిన సాకులన్నీ నా మెదడు నాకు చెప్తూ ఉంటుంది. ఒక్కోసారి నన్ను నేను బలవంతంగా తలుపు దగ్గరకు తీసుకెళ్లాల్సి వస్తుంది’’ – చాలా మందికి ఎదురయ్యే పరిస్థితి ఇది.

ఇలాంటి పరిస్థితి అందరికీ ఉంటుందని లీబర్మన్ అంటున్నారు. ''మీపట్ల మీరు సానుభూతితో ఉండండి. వ్యాయామం వద్దులే అంటూ మీ తలలో వినిపించే ఆ గొంతులు అందరికీ వినిపించటం మామూలు విషయమే. పొద్దస్తమానం వ్యాయామం చేసే వాళ్లు కూడా ఈ గొంతులతో పోరాడుతుంటారు. వాటిని అధిగమించటం కీలకం’’ అని ఆయన చెప్పారు.

వ్యాయామం

2. రెండు విషయాలు మరచిపోవద్దు

మనం శారీరకంగా క్రియాశీలంగా ఉండటం కోసం పరిణామం చెందటానికి కేవలం రెండే రెండు కారణాలున్నాయి: ఒకటి మన అవసరాలను తీర్చుకోవటం, రెండోది సామాజికంగా మనల్ని మనం సంతృప్తిపరచుకోవటం.

మన పూర్వీకుల్లో చాలా మంది ప్రతి రోజూ వేటకు, ఆహార సేకరణకు వెళ్లేవెళ్లు. అలా వెళ్లకపోతే ఆకలితో అలమటిస్తారు.

''అది కాకుండా వాళ్లు శారీరకంగా క్రియాశీలంగా ఉండేది నృత్యం చేయటం, ఆటలు ఆడటం వంటి సరదా సమయాల్లోనే’’ అని లీబర్మన్ చెప్పారు.

సరదాగా ఉండటం వారికి, మనకు కూడా, సామాజిక ప్రయోజనాలను అందించింది. వ్యాయామం గురించి కూడా అదే రకమైన ఆలోచనా విధానం అలవరచుకోవాలని లీబర్మన్ సూచిస్తున్నారు.

''సరదాగా మలచుకోండి.. అలాగే అవసరంగా మార్చుకోండి’’ అని ఆయన చెప్తున్నారు. రెండు లక్ష్యాలనూ సాధించటానికి ఒక ఉత్తమ మార్గం ఏమిటంటే.. శారీరక కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమంగా మార్చుకోవటం. ఉదాహరణకు.. రన్నింగ్ చేసే బృందంలో చేరటం వంటిది.

అలా చేయటం ద్వారా అది సరదాగా, సామాజికంగా, అవసరంగా మారుతుందని లీబర్మన్ పేర్కొన్నారు.

వ్యాయామం

3. ఎక్కువగా వర్రీ కావద్దు

ఎంత సేపు, ఎంత మోతాదులో వ్యాయామం చేయాలనే దాని గురించి ఆందోళన చెందకుండా ఉండటం కూడా తోడ్పడుతుందని లబీర్మన్ చెప్పారు.

మన పూర్వీకులు పెద్ద పెద్ద జంతువులను వేటాడటానికి భారీ రాళ్లు ఎత్తి విసరటం వంటి పనులు చేయాల్సి వచ్చేదని, కాబట్టి వాళ్లు నిజంగా చాలా చాలా బలంగా దృఢంగా ఉండేవాళ్లనే ముద్ర మనలో ఉందని ఆయన ప్రస్తావించారు.

కానీ అది ఏమాత్రం నిజం కాదని ఆయన పేర్కొన్నారు.

''మన పూర్వీకులు అవసరమైనంత మేరకు క్రియాశీలంగా, బలంగా ఉండే వాళ్లు. కానీ అతిగా కాదు’’ అని చెప్పారు. ''వాళ్లు ప్రతి రోజూ పరుగులు పెట్టేవాళ్లు కాదు. ఆ పని క్రమం తప్పకుండా చేసేదీ ఉండదు. వారానికో, పది రోజులకో ఒకసారి పరుగు తీసేవాళ్లు’’ అని ఆయన వివరించారు.

ఆ విషయం చూసి తెలుసుకోవటానికి గతంలోకి అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ తరహా జీవనశైలి ఉన్న ప్రజలు ఇప్పటికీ ఉన్నారు.

''వేట, ఆహార సేకరణ జీవనాధారంగా గల వాళ్లు రోజుకు సుమారు 2:15 గంటలు మాత్రమే ఒక మాదిరి నుంచి, తీవ్ర శారీరక కార్యకలాపాల్లో ఉంటారు’’ అని ఆయన చెప్పారు.

''వాళ్లు అతిగా కండలు తిరిగిన వాళ్లేమీ కాదు. మన లాగే వాళ్లు కూడా రోజూ దాదాపు 10 గంటల పాటు కూర్చునే గడుపుతుతారు’’ అని తెలిపారు.

చెప్పొచ్చేదేమిటంటే.. కనీసం ఇంత మోతాదు వ్యాయామం అవసరమని సిఫారసు చేసినపుడు.. అంత మొత్తం చేయలేకపోయినపుడు, ఏ కొంత శారీరక కార్యక్రమం చేసినా చాలా ఆరోగ్యవంతమైనదే.

''ఈ విషయం తెలిస్తే.. జనం అసలేమీ వ్యాయామం చేయకపోవటానికి బదులు కనీసం కొంచెమైనా వ్యాయామం చేశామన్న సంతృప్తి ఉంటుందని నేను అనుకుంటున్నా’’ అని లీబర్మన్ పేర్కొన్నారు.

వారానికి 150 నిమిషాల వ్యాయామం – అంటే రోజుకు సగటున 21 నిమిషాలు – చేయటం ద్వారా మరణాల రేటు 50 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెప్తున్నట్లు ఆయన తెలిపారు.

అయితే.. కొంచెమైనా వ్యాయామం చేయటమే కాదు.. చేయటం ఆపకుండా ఉండటం కూడా కీలకం.

వ్యాయామం

4. చేయటం ఆపవద్దు

ఉద్యోగ విరమణ అనే విధానాన్ని ఆధునిక పశ్చిమ ప్రపంచంలో కనిపెట్టారు. దానితోపాటు.. ఒకసారి 60, 65 ఏళ్లు వస్తే ఇక అన్నిటినీ తేలికగా తీసుకోవటం సాధారణమనే భావన కూడా వచ్చేసింది.

కానీ ''మనం మన జీవితాంతం శారీరకంగా క్రియాశీలంగా ఉండటానికి పరిణామం చెందాం’’ అని లీబర్మన్ చెప్తున్నారు.

ఈ శారీరక కార్యకలాపాలు మనం ఎక్కువ కాలం జీవించటానికి, వయసు పెరుగుతున్నపుడు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.

''శారీరక కార్యకలాపాలు శరీరంలో వృద్ధాప్య ప్రభావాలను తిప్పికొట్టే మరమ్మతు, నిర్వహణ వ్యవస్థలు చాలా వాటిని క్రియాశీలం చేస్తాయి’’ అని ఆయన వివరించారు.

నేడు పశ్చిమ పారిశ్రామిక సమాజాల్లో ప్రజలు ఎంత కాలం జీవిస్తున్నారో.. నేటికీ వేట, ఆహారసేకరణ జీవనవిధానంగా ఉన్న ప్రజలు కూడా దాదాపు అంత కాలం జీవిస్తున్నారనేది దీనికి ఒక ఉదాహరణ.

తేడా ఏమిటంటే.. వారి జీవిత కాలం, వారు ఆరోగ్యంగా ఉండే కాలం దాదాపు ఒకే స్థాయిలో ఉంటే.. పారిశ్రామిక సమాజాల్లోని జనంలో తమ చివరి సంవత్సరాలు ఏళ్ల తరబడి అనారోగ్యంతో మంచాన పడతామనే భయం ఉండటం సాధారణంగా మారిపోయింది.

''పశ్చిమ ప్రపంచంలో జనం వయసు పెరిగే కొద్దీ వారు శక్తి, బలం కోల్పోతుంటారు. దానివల్ల ప్రాధమిక పనులు కూడా కష్టమవుతాయి. అలా జరిగినపుడు జనం శారీరక క్రియాశీలత కూడా తగ్గిపోతుంది. శారీరకంగా క్రియాశీలంగా లేకపోతే వారి దృఢత్వం తగ్గిపోతుంది’’ అని లీబర్మన్ వివరించారు.

''ఇదొక వినాశకరమైన విషవలయం’’ అని అభివర్ణించారు.

కాబట్టి.. మీ సహజాతాలను ఓడించండి. మీ మెదడు మీకు సాయం చేయటానికి నిరాకరించినా, ఏమీ అవసరం లేదనిపించినా ముందుకు కదలండి.

ఒకవేళ వ్యాయామం విసుగ్గా అనిపిస్తే.. రాతి యుగంలో చేసినట్లుగా.. డాన్స్ చేయటం మొదలుపెట్టండి.

ఇవి కూడా చదవండి:

English summary
Exercise: Is it abnormal for humans to exercise? Why do so many people dislike exercise? – 4 things an anthropologist says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X