వైఎస్ జగన్ రాజకీయ వ్యూహకర్త ఛరిష్మా తగ్గిందా: అస్త్రసన్యాసం తప్పదా: వాట్ నెక్స్ట్!
కోల్‌కత: దేశవ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఉత్కంఠతగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ అస్సాంలో అధికారాన్ని నిలుపుకోవడం ఖాయమైంది. కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎంట్రీ ఇవ్వడం కూడా దాదాపుగా సాధ్యమేనంటూ అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. ఇక మిగిలిన మూడు అతిపెద్ద రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ నేతలకు ఎదురు దెబ్బ తగులుతుందని పేర్కొంటున్నాయి.

మెజారిటీ తగ్గినా..
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు వ్యర్థమే అవుతాయంటూ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ముచ్చటగా మూడోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ సారధ్య బాధ్యతలను నిలుపుకోవడం ఖాయమని స్పష్టం చేశాయి. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈ సారి తృణమూల్ కాంగ్రెస్ మెజారిటీ భారీగా తగ్గినప్పటికీ.. ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయడం సాధ్యపడుతుందని పేర్కొన్నాయి.

భారీగా ఓటుబ్యాంకు.. ఓట్ల శాతం..
ఈక్రమంలో బీజేపీ తన ఓటు బ్యాంకును, ఓట్ల శాతాన్ని అనూహ్యంగా పెంచుకుంటుందని అంచనా వేశాయి. దాదాపు అన్ని మీడియా హౌస్‌లు, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సర్వే సంస్థలు.. ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 147 స్థానాల మేజిక్ ఫిగర్ వరకు బీజేపీ వెళ్లగలిగినప్పటికీ.. చేతికి అందేంత దూరంలో ఆగిపోతుందని పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు, చేసిన సర్వేలు.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా కనిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేశారాయన.

ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారు?
ఈ సారి ఆయన మమతా బెనర్జీ విజయానికి వ్యూహాలు పన్నారు. కసరత్తు చేశారు. ఆయన అంచనా ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి దక్కే స్థానాల సంఖ్య మూడంకెలకు మించకూడదు. మూడంకెల్లోపే అంటే వంద స్థానాల్లోపు సంఖ్య వరకే బీజేపీ పరిమితమౌతుందంటూ ఇదివరకు ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. వంద కంటే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంటే.. తాను అస్త్రసన్యాసం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. రాజకీయ సర్వేలు చేయడాన్ని మానుకుంటానని, దీని నుంచి తాను తప్పుకొంటాననీ సవాల్ విసిరారు.
Recommended Video

కట్టుబడి ఉంటారా?
తాజాగా- వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే.. ప్రశాంత్ కిషోర్ అస్త్రసన్యాసం చేయక తప్పకపోవచ్చు. తాను ఇచ్చిన మాటకు గనక ప్రశాంత్ కిషోర్ కట్టుబడి ఉంటే- రాజకీయ సర్వేలు చేయడం, వేర్వేరు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేయడం నుంచి విరమించుకోక తప్పని పరిస్థితి ఎదురైనట్టే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా పశ్చిమబెంగాల్‌లో బీజేపీకి భారీగా సీట్లు దక్కుతాయని అంచనా వేశాయి. రిపబ్లిక్ టీవీ-సీఎన్ఎక్స్, జనతా కీ బాత్ వంటి ఛానళ్లయితే.. బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా తేల్చి చెప్పాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ వంద స్థానాలకు పైగా సీట్లను దక్కించుకుంటే.. ప్రశాంత్ కిషోర్ భవిష్యత్తు ఏమిటనేది ఆసక్తికరంగా మారుతుంది.












Click it and Unblock the Notifications